ఓషో కథలు

ఓషో కథలు. *

మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఆ ప్రార్థన మన తీరని కోరికలతో నిండి వుంటుంది. ఎట్లాగయినా ఆ కోరికల్ని తీరుస్తాడని మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం. అంటే ప్రార్థన అన్నది బేరసారాలతో కూడి ఉంటుంది. దాన్ని మనం ప్రార్థన అంటాం.

ఒక వ్యక్తి నిరంతరం శివుణ్ణి పూజించేవాడు. ప్రార్థించేవాడు. ఉపవాసాలు చేసేవాడు. భజనలు చేసేవాడు. సంవత్సరాల తరబడి శివుణ్ణి ఆరాధిస్తూ ఎప్పటికయినా శివుడు ప్రత్యక్షమై తన కోరికలు తీరుస్తాడని తపించేవాడు. ఆ సమయం ఆసన్నమైంది.
ఒకరోజు హఠాత్తుగా శివుడు ఆ భక్తుడి ముందు ప్రత్యక్ష మయ్యాడు. కలలో కూడా ఊహించని ఆ పరిణామానికి అతను బిత్తరపోయాడు. సాక్షాత్తు శివుడే తనముందు నిల్చుంటే అతని ఆలోచనలు స్తంభించిపోయాయి. శివుడు ప్రసన్న వదనంతో భక్తుణ్ణి చూసి ‘‘నీకు మూడు వరాలు ప్రసాదిస్తున్నా. కోరుకో’’ అన్నాడు. ఒక్కసారిగా మూడు వరాలు అనే సరికి భక్తుడికి దిక్కుతోచలేదు. ‘‘స్వామీ! నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి’’ అన్నాడు. శివుడు చిరునవ్వు నవ్వి ‘‘అలాగే’’ అన్నాడు. ఆ వ్యక్తి తీవ్రంగా ఆలోచించాడు. పాతికేళ్ళ క్రితం అతనికి పెళ్ళయింది. అప్పటి నించీ అతను భార్య అజమాయిషీ కింద, అధికారం కింద నలిగిపోయాడు. ప్రతిదానికీ ఆమె అడ్డు చెప్పేది. తన మాటే నెగ్గేలా చూసుకునేది. అతని మనసులో భార్యపైన అంతులేని ఆగ్రహం వుంది. కానీ దాన్ని ఎప్పుడూ బయట పెట్టలేదు. నిగ్రహించుకున్నాడు. ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలి. ఇంతకుమించిన మంచి సమయం మళ్ళీ రాదు అనుకుని ‘‘స్వామీ! నా భార్యను చంపేయి’’ అన్నాడు. శివుడు ‘తథాస్తు’ అన్నాడు. దాంతో అతని భార్య చనిపోయింది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలన్నవి అనివార్యం. కానీ ఎవరిపట్లా మరొకరికి పూర్తి ద్వేషం ఉండదు. ప్రేమ, ద్వేషం విడివిడిగా ఉండవు. మనం ప్రేమించే వాళ్ళనే ద్వేషిస్తాం. ద్వేషించేవాళ్ళనే ప్రేమిస్తాం. అతను తన కళ్ళముందే భార్య చనిపోతే దానికి తనే కారణమని తెలిసి విలవిల్లాడిపోయాడు. వాళ్ళ మధ్య అనురాగ క్షణాలు, కుటుంబంపట్ల ఆమె అంకిత భావం గుర్తుకొచ్చి అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వెంటనే శివుడి పాదాలపై పడి ‘‘స్వామీ! తప్పయిపోయింది. నా భార్యను దయచేసి బతికించండి’’ అన్నాడు. శివుడు నవ్వుతూ ‘‘అలాగే’ అన్నాడు. అతని భార్య తిరిగి ప్రాణాలతో లేచింది. ఆ రకంగా రెండు వరాలు పూర్తయ్యాయి. ఇంక ఒక్క వరమే మిగిలింది. తొందరపాటువల్ల వరాలు అట్లా వ్యర్థమయ్యాయని ఆ వ్యక్తి దిగులుపడి కనీసం మూడో వరం అర్థవంతంగా ఉండాలని అనుకుంటూ శివుడితో ‘‘స్వామీ! నాకు కొద్దిగా సమయమివ్వండి’’ అన్నాడు. శివుడు ‘‘సరే! నీ యిష్టం నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తలచుకో. ప్రత్యక్షమవుతాను’’ అని అదృశ్యమైపోయాడు. రోజూ ఆ వ్యక్తి ఏం కోరుకోవాలా? అని ఆలోచించేవాడు. అతని దగ్గర ఒక వరమే వుంది. దాన్ని జాగ్రత్తగా ఆలోచించి కోరుకోవటం మంచిది. లేకుంటే ఆ కోరిక నిష్ఫలమవుతుంది. అనుకుని ఎప్పుడూ దాన్ని గురించే ఆలోచించి ఎటూ నిర్ణయించలేకపోయేవాడు. సంవత్సరం గడిచిపోయింది. భక్తుడు ఒకరోజు శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్ష మయ్యాడు. భక్తుడు శివుడి పాదాలపై పడి ‘‘స్వామీ! నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏం కోరాలో నాకు అంతుబట్టడం లేదు. దయచేసి నేను ఏం కోరాలో మీరే చెప్పండి’’ అని భారాన్ని శివుడిపై వేశాడు. దానికి శివుడు ‘‘నాయనా! నువ్వు కోరుకోదగిన వరం ఒకటుంది. అది సాటి లేనిది. దానితో పోల్చదగింది మరొకటి లేదు. అది కోరుకుంటే నీకు అన్నీ నెరవేరినట్లే. అది వాంఛా రాహిత్యం. కోరికలు లేని తనం. ఆ కోరికలు లేనితనాన్ని నువ్వు కోరుకుంటే నీకు అన్నీ నెరవేరుతాయి. తక్కినవేమి కోరినా దాని ముందు అన్నీ నిష్ప్రయోజనమే’’ అన్నాడు. భక్తుడు ‘‘స్వామీ! దయతలచి నాకు వాంఛా రాహిత్యాన్ని ప్రసాదించు’’ అన్నాడు.

No comments:

Post a Comment