గీతోపనిషత్తు -111


🌹. గీతోపనిషత్తు -111 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 4. జ్ఞానయోగము - శ్లోకము 42 📚

🍀 37. నిష్కామ కర్మయోగము - మానవులకు తెలుసు కొనుటలో గల ఆసక్తి చేయుటలో లేదు. తెలుసుకున్న కొలది యింకను తెలుసుకొన వలెనను ఆరాటమేగాని, తెలిసినది ఆచరించుట యుండదు. తెలిసినది ఏ కొద్దియైనను, దాని నాచరించుట ఆరంభించినచో తెలియవలసినది ఎప్పటికప్పుడు తెలియుచునే యుండును. ఆచరింపక తెలుసుకొనుట ఆరంభించినచో అది వ్యసనమై స్థిరపడును. తెలుసుకొనుట, ఆచరించుట ఉచ్ఛ్వాస నిశ్వాసలవలె ఎవరియందు జరుగునో అట్టివారే ముముక్షు మార్గమున పయనించువారు. అందులకే ఉత్తిష్ఠ, అతిష్ఠ (లెమ్ము, ఆచరింపుము) అని దైవము పలికినాడు. యోగమనగ నిష్కామ కర్మయోగమే. 🍀

తస్మా దజ్ఞానసంభూతం హృత్ స్థం జ్ఞానాసి నాత్మనః |
ఛిత్వైనం సంశయం యోగ మాతిష్ణోత్తిష్ఠ భారత || 42


భరత పుత్రుడవగు ఓ అర్జునా! నీ హృదయమందు పుట్టిన అజ్ఞానమును, ఈ తెలుపబడిన జ్ఞానమను ఖడ్గముచే ఛేదించుము. నిష్కామముగ కర్మమును నిర్వర్తించుము. సంశయింపక లెమ్ము. అర్జునుడు సంశయమున పడుట చేతనే అతని హృదయమున అనేకానేక ప్రశ్నలు ఉద్భవించినవి. ప్రశ్నల నుండి ప్రశ్నలు పుట్టుచున్నవి. సహజముగ జ్ఞానవంతుడైనను అతడు సంశయ మున పడుటచే అతని నజ్ఞాన మావరించినది. అజ్ఞానము, సంశయముతోడై, అశ్రద్ధ జనింపగ శ్రీకృష్ణుడు తెలిపిన విషయమునే మరల మరల తెలుపవలసి వచ్చినది. అర్జునుని యందుకల వాత్సల్యముతో దైవము మరల మరల నిష్కామ కర్మయోగ ప్రభావమును వివరించినాడు.

అర్జునుడు ధనుస్సు, బాణములను విడిచి పెట్టి ప్రశ్నలు వేయుట, శ్రీకృష్ణుడు పదే పదే ఒకే సమాధానము తెలుపుట మానవుల సహజ ధోరణిని తెలుపును. మానవులకు తెలుసు కొనుటలో గల ఆసక్తి చేయుటలో లేదు. తెలుసుకున్న కొలది యింకను తెలుసుకొన వలెనను ఆరాటమేగాని, తెలిసినది ఆచరించుట యుండదు. తెలిసినది ఏ కొద్దియైనను, దాని నాచరించుట ఆరంభించినచో తెలియవలసినది ఎప్పటికప్పుడు తెలియుచునే యుండును. ఆచరింపక తెలుసుకొనుట ఆరంభించినచో అది వ్యసనమై స్థిరపడును. తెలుసుకొనుట, ఆచరించుట ఉచ్ఛ్వాస నిశ్వాసలవలె ఎవరియందు జరుగునో అట్టివారే ముముక్షు మార్గమున పయనించువారు.

అందులకే ఉత్తిష్ఠ, అతిష్ఠ (లెమ్ము, ఆచరింపుము) అని దైవము పలికినాడు. ఆచరించవలసినది తాను తెలిపిన యోగము. అందుచే "యోగమాలిష్ణోత్తిష్ఠ భారత" అని పలికినాడు. యోగమనగ నిష్కామ కర్మయోగమే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


30 Dec 2020

No comments:

Post a Comment