🌹 . శ్రీ శివ మహా పురాణము - 311 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
77. అధ్యాయము - 32
🌻. వీరభద్రుడు - 1 🌻
నారదుడిట్లు పలికెను -
మూర్ఖుడగు దక్షుడు ఆకాశవాణిని విని, అపుడేమి చేసినాడు? ఇతరులు ఏమి చేసిరి?అపుడు ఏ మాయెను ?చెప్పుము (1). భృగు మహర్షి యొక్క మంత్ర బలముచే పరాజితులైన శివగణములు ఏమి చేసిరి? ఎచటకు వెళ్ళిరి ? ఓ మహాబుద్ధి శాలీ !ఆ విషయమును నీవు చెప్పుము (2).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆకాశవాణిని విన్న దేవతలు, ఇతరులు అందరు ఆశ్చర్యచకితులై కింకర్తవ్యతా విమూఢులై నిలబడియుండిరి. వారేమియూ మాటలాడకుండిరి (3). భృగువు యొక్క మంత్రబలముచే కొందరు శివగణములు సంహరింపబడిరి. వారిలో మిగిలిన వీరులు పారిపోయి శివుని శరణు పొందిరి (4). సాటిలేని తేజస్సు గల రుద్రునకు వారు ఆదరముతో నమస్కరించి జరిగిన వృత్తాంతమునంతనూ యథాతథముగా నివేదించిరి (5).
గణములు ఇట్లు పలికిరి -
దేవదేవా !మహాదేవా! శరణు పొందిన మమ్ములను రక్షించుము. ఓ నాథా !సతీదేవి యొక్క విస్తరమగు వృత్తాంతమును ఆదరముతో చక్కగా వినుము (6). ఓ మహేశ్వరా! గర్విష్ఠి, పరమదుష్టుడునగు దక్షుడు సతీదేవిని అనాదరించి, అవమానించినాడు. దేవతలు కూడ అటులనే చేసినారు (7). ఆతడు మీకు భాగమును ఈయలేదు. కాని దేవతలకిచ్చినాడు. దుష్టుడు, మిక్కిలి గర్విష్ఠియగు దక్షుడు బిగ్గరగా పలుకరాని మాటలను పలికినాడు (8).
ఓ ప్రభూ! నీకు యజ్ఞములో భాగము ఈయకపోవుటను చూచి సతీదేవి మిక్కిలి కోపించెను. అపుడామె తన తండ్రిని పరిపరివిధముల నిందించి తన దేహమును అగ్నికి ఆహుతి చేసెను (9).
పదివేల మంది గణములు మిక్కిలి సిగ్గుపడిన వారై తమ దేహములను ఆయుధములతో నరుకుకొని అచట మరణించిరి. మాలో కొందరు మిక్కిలి కోపించి (10),భయమును గొల్పుచూ వేగముగా ఆ యజ్ఞమును ధ్వంసము చేయుటకు సిద్ధమైతిమి. కాని శత్రువగు భృగువు తన మహిమచే మమ్ములను తరిమి వేసినాడు (11). జగత్తును రక్షించే ఓ ప్రభూ! మేము నిన్ను శరణు పొందితిమి. హే దయోళో! మాకు సంప్రాప్తమైన ఈ భయము నుండి మమ్ములను రక్షించి, భయమును తొలిగించుము(12).
హే మహాప్రభో! మిక్కిలి గర్వించిన దక్షుడు మొదలగు దుష్టులందరు ఆ యజ్ఞములో పెద్ద అవమానమును చేసిరి (13). అభిమానమును రక్షించువాడా! సతీదేవికి, మాకు జిరిగిన వృత్తాంతమునంతనూ నీకు చెప్పితిమి. ఆ మూర్ఖుల విషయములో నీవు ఎట్లు చేయగోరెదవో, అట్లు చేయుము (14).
బ్రహ్మఇట్లు పలికెను -
శివ ప్రభుడు ఆ తన గణముల మాటలను విని, వెంటనే ఆ వృత్తాంతమునంతనూ ఎరుంగుటకై నారదుని స్మరించెను (15). ఓ దేవర్షీ! నీ దర్శనము దివ్యమైనది. నీవు వెంటనే అచటకు వచ్చి, శంకరుని భక్తితో అంజలి యొగ్గి నమస్కరించి అచట నిలబడితివి (16). ఆ ప్రభుడు అపుడు నిన్ను ప్రశంసించి, దక్షయజ్ఞమునకు వెళ్లిన సతీదేవి యొక్క వార్తను, మరియు ఇతర వృత్తాంతమును గురించి ప్రశ్నించెను (17).
ఓ కుమారా! శంభుడు ఇట్లు ప్రశ్నించగా, ఆయనను మస్సులో ధ్యానించే నీవు వెంటనే దక్షయజ్ఞములో జరిగిన వృత్తాంతమునంతనూ చెప్పియుంటివి (18). ఓ మహర్షీ !అతి భయంకరమగు పరాక్రమము గలవాడు, సర్వేశ్వరుడునగు ఆ రుద్రుడు నీవు చెప్పిన ఆ వృత్తాంతమును విని వెనువెంటనే క్రోధమును పొందెను (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
30 Dec 2020
No comments:
Post a Comment