కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 122


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 122 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 52 🌻


అంతే కానీ, ఒకటి మరొక తీరుగా చెప్పింది, ఒకటి మరొక తీరుగా చెప్పిందనే ఖండన మండనాల జోలికి వెళ్ళకుండా ఉండాలి. శాస్త్రారణ్యంలో చిక్కపడకుండా ఉండాలి. ఈ అధ్యయనం చాలా అవసరం. సృష్టిని అధ్యయనం చేయాలి. తనను తాను అధ్యయనం చేయాలి. పంచకోశాలని బాగా అధ్యయనం చేయాలి.

పంచభూతాలను బాగా అధ్యయనం చేయాలి. పంచకోశ సాక్షి ఎలా ఉన్నాడో గమనించాలి. పంచభూత సాక్షి ఎలా ఉన్నాడో గమనించాలి. ఆవరణ దోషం లేకుండా ఉన్నటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడో గర్తించగలగాలి. ఆవరణ రహితమైనటువంటి స్థితిని గుర్తించాలి. మల విక్షేప ఆవరణలు అనేటటువంటి మలత్రయాలని కూడా పోగొట్టుకోవాలి. పంచమలములను లేకుండా చేయాలి.

ఈ రకంగా ప్రతీదానిని సూక్ష్మంగా గుర్తించి, సూక్ష్మంగా రద్దు చేసి, తనను తాను అధిగమిస్తూ, తనను తాను తెలుసుకుంటూ, తనను తాను పోగొట్టుకుంటూ, ముందు తనను తాను తెలుసుకోవాలి, తరువాత తనను తాను అధిగమించాలి, తరువాత తనను తాను పోగొట్టుకోవాలి. ఈ రకమైనటువంటి, క్రమమైనటువంటి, మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి.

ఒక్కొక్క గుణాన్ని నువ్వు విరమిస్తే, అది సూక్ష్మమైపోతుంది. ఐదు గుణములు కలిగినటువంటి పృథ్వి స్థూలంగా కనబడుతుంది. నాలుగు గుణములు కలిగినటువంటి జలము స్థూలంగా కనబడుతుంది. మూడు గుణములు కలిగినటువంటి అగ్ని స్థూలంగా కనబడుతున్నది. రెండు గుణములు కలిగినటువంటి వాయువు స్థూలంగా కనబడుతున్నది. అవి కూడా స్థూలంగానే ఉన్నాయి.

కానీ వీటి యందు సగభాగము అపంచీకృతములై, అవి ఎక్కడ ఉన్నాయి అంటే, ఆకాశానికి అవతల ఉన్నాయి. ఆ అర్థభాగములన్నీ కూడాను, కూటస్థ భాగములో ఉన్నాయి. ఆ అర్థభాగములన్నీ బ్రహ్మాండ భాగములుగా ఉన్నాయి. ఆ అర్థభాగములు అన్నీ కూడాను, అధిష్ఠానములుగా ఉన్నాయి. ఆ అర్థభాగములు అన్నీ కూడ దేవతా సమూహములుగా ఉన్నాయి.

ఆ అపంచీకృతమైనటువంటి బ్రహ్మాండ భాగమంతా కూడా, అద్వయముగా దర్శన పద్ధతిగా తెలుసుకొన్నవాడవై, పంచశక్తులు, పంచబ్రహ్మల యొక్క అనుగ్రహాన్ని పొందిన వాడవై, బ్రహ్మాండ, పిండాండ నిర్ణయన్ని స్పష్టముగా ఎఱిగిన వాడవై, బ్రహ్మాండ పంచీకరణలో ఉన్న 25 తత్త్వాలను, పిండాండ పంచీకరణలో ఉన్న 25 తత్త్వాలను సమన్వయీకరించుకుని, ఒక దాని కొకటి ఆధారభూతమై ఎట్లా ఉన్నాయో తెలుసుకొని, అధిగమించేటటువంటి పద్ధతిగా జ్ఞాత కూటస్థునికి అభేద స్థితి ఎట్లా ఉన్నదో, ప్రత్యక్‌ పరమాత్మలు అభిన్నులు ఎట్లా అయిఉన్నారో, ఆధేయ పద్ధతిగా నువ్వు ప్రయాణం చేయవలసినటువంటి అవసరము ఉన్నది.

ఈ రకంగా అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తిచేసి, ఎవరైతే బ్రహ్మనిష్ఠులై వారు ఉన్నారో, వారు ముక్తులగుదురు. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య అనేటటువంటి చతుర్విధ ముక్తులను, సాధించినటువంటి వారు అవుతున్నారు. బ్రహ్మనిష్ఠులు అవుతున్నారు. ఈ రకంగా తప్పక సాధకులందరూ, ఈ లక్ష్యాన్ని సాధించవలసినదిగా యమధర్మరాజు గారు ఉపదేశాన్ని చేస్తున్నారు.

నచికేతుని మూలమున లభించినట్టియు, మృత్యు దేవతల వలన ఉపదేశింపబడినట్టియు, వైదికమగుట వలన సనాతనమైనట్టియు, గురుశిష్య సంవాద రూపముగా నున్నట్టియూ, ఈ ఉపాఖ్యానమును యోగ్యులకు చెప్పిన వారున్ను, బ్రహ్మవిష్ణులగు గురువుల వలన ఉపదేశమును పొందిన వారున్ను, బ్రహ్మలోకమున పూజనీయులు అగుదురు.

ఈ కఠోపనిషత్తులో ఉన్నటువంటి, ఈ ఆత్మోపదేశ విశేషాన్ని తెలియజేస్తున్నారు యమధర్మరాజుగారు. నచికేతుని మూలమున మానవాళిని ఉద్ధరించదలచి, మానవాళికందరికీ మహోపదేశాన్ని చేసేటటువంటి ప్రయత్నం, ఆత్మోపదేశాన్ని చేసేటటువంటి ప్రయత్నాన్ని చేశారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


05 Dec 2020

No comments:

Post a Comment