గీతోపనిషత్తు - 91


🌹. గీతోపనిషత్తు - 91 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 26 - 4. ప్రాణాయామ యజ్ఞము - ప్రాణాయామ హోమము జరుగు చుండగ ఏర్పడిన విరామముల యందు హృదయమున ప్రజ్ఞకు గోచరించునది స్పందనాత్మక చైతన్యము. ఈ చైతన్యమున ప్రవేశించినపుడు మనసు శ్వాస యొక దాని యందొకటి కరిగి రెండునూ లేని స్థితి యుండును. సాధకుడు తాను స్పందనాత్మక చైతన్యుడనని తెలియును. 🍀

📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚

Part 4

పై విధముగ మూడు శ్వాసలు యొక విభాగముగ నిర్వర్తించు చున్నప్పుడు, కొంత తడవు పీల్చ నవసర మనిపించదు. అట్లే కొంత తడవు పీల్చిన శ్వాసను వదలవలె ననిపించదు. ఇట్లు సహజముగ జరుగును. ఇట్లు చేయుట హఠయోగము. ఇట్లు జరుగుట రాజయోగము. ఇట్లు జరుగుటకు చాలాకాలము పట్ట వచ్చును. త్వరితగతిని జరుగవచ్చును. అది సాధకుని పూర్వ సంస్కారమును బట్టి, శ్రద్ధనుబట్టి జరుగును.

ఇట్లు ప్రాణము పీల్చబడి- వదలబడకుండుట, వదలబడి- పీల్చబడకుండుట ప్రాణాయామ పరాయణులకు జరుగును. శ్వాస పీల్చబడి వదల బడకుండుటను 'పూరకము' అందురు. శ్వాస వదలబడి పీల్చబడ కుండుట 'రేచకము' అందురు.

రెండు స్థితుల యందు కలిగిన విరామమును 'కుంభకము' అందురు. ప్రాణాయామ పరాయణులకు ఈ కుంభకము సిద్ధించును. పీల్చబడిన ప్రాణము అపానమై మలుపు తిరుగు సమయమున ఏర్పడిన విరామము అపానమున ప్రాణము హోమము చేయబడినదిగ చెప్పబడు చున్నది.

అదే విధముగ వదలబడిన అపాన వాయువు ప్రాణవాయువుగ మలుపు తిరుగు సందర్భమున ఏర్పడిన విరామము, అపానము ప్రాణము నందు హోమము చేయబడు చున్నట్లుగ చెప్పబడినది. “ప్రాణాయామ తత్పరులగు వారు అపాన వాయువు నందు ప్రాణవాయువును, ప్రాణవాయువు నందు అపాన వాయువును హోమము చేయుచున్నారు. తత్కారణముగ ప్రాణాపానగతి నిరోధింపబడు చున్నది." అని భగవద్గీత శ్లోక అర్థము. (4-29)

అట్లే పై తెలిపిన ప్రాణాయామ పరాయణులు ఆహార వ్యవహారములను కూడ పై తెలిపిన హోమము ద్వారా నియమించుకొనుచు పవిత్రులై, పాపము నశించినవారై వెలుగొందు చున్నారు. అనునది రెండవ శ్లోక అర్థము. (4-30)

పై తెలిపిన విధముగ ప్రాణాయామ హోమము జరుగు చుండగ ఏర్పడిన విరామముల సమయము పెరుగును. విరామముల యందు హృదయమున ప్రజ్ఞకు గోచరించునది స్పందనాత్మక చైతన్యము. ఈ చైతన్యమున ప్రవేశించినపుడు మనసు శ్వాస యొక దాని యందొకటి కరిగి రెండునూ లేని స్థితి యుండును.

సాధకుడు తాను స్పందనాత్మక చైతన్యుడనని తెలియును. ఆ సమయమున బాహ్యస్మృతి యుండదు. అంతఃస్మృతి యుండును. ఆ స్మృతి కారణముగనే, తాను స్పందనాత్మ కుడ నని తెలియును. స్పందనము చేయు శబ్దము తనకు సూక్ష్మముగ వినపడుచుండును. స్పందనము ద్వంద్వ చేష్ట.

అందువలన ద్వంద్వ శబ్దము వినబడును. అంతర్ముఖుడైన సాధకుడు ద్వంద్వ శబ్దమును వినుచు ద్వంద్వ చేష్టయందు లగ్నమై యుండును. ఈ ద్వంద్వ శబ్దమే 'సోలి హం'. దాని ద్వంద్వ చేష్టయే ప్రజ్ఞ స్పందనముగ విచ్చుకొనుట, ముడుచుకొనుట.

దీనిని పెద్దలు హంసతో పోల్చిరి. గరుడ పక్షితో పోల్చిరి. పావురముతో కూడ పోల్చిరి. విచ్చు కొనుట, ముడుచుకొనుట యనునది ఆధారముగ తానున్నాడని సాధకునకు తెలియును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


05 Dec 2020

No comments:

Post a Comment