శ్రీ శివ మహా పురాణము - 287
🌹 . శ్రీ శివ మహా పురాణము - 287 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
69. అధ్యాయము - 24
🌻. శ్రీరామునకు పరీక్ష - 3 🌻
పరమేశ్వరుడిట్లు పలికెను -
ఓ సతీదేవీ! వినుము. నేను సత్యమును చెప్పెదను. అసత్యమాడను. వరదాన ప్రభావము వలన, ఆదరము వలన నేను ఇట్లు ప్రణమిల్లితిని (37). రామలక్ష్మణులను పేరు గల ఈ సోదరు లిద్దరు వీరులచే పూజింపబడువారు. ఓ దేవీ! దశరథుని కుమారులగు ఈ ప్రాజ్ఞులు సూర్యవంశమునందు పుట్టినవారు (38).
పచ్చని రంగు గల ఈ చిన్నవాడు లక్ష్మణుడు. శేషుని అంశచే జన్మించినవాడు. విష్ణువు పూర్ణాంశతో రాముడను పేర జ్యేష్ఠుడై జన్మించినవాడు. ఆయన వలన ఎవ్వరికీ హాని లేదు (39). విష్ణువు భూమి యందు సాధువులను రక్షించుట కొరకు, మన సుఖము కొరకు జన్మించినాడు. ఇట్లు పలికి జగత్కారణుడు అగు శంభు ప్రభుడు మిన్న కుండెను (40).
శంభుని ఈ మాటలను వినిన తరువాతనైనూ ఆమె మనస్సునకు విశ్వాసము కలుగలేదు. ముల్లోకములను మోహింపజేయు శివుని మాయ బలీయమైనది (41). లీలా పండితుడు, సనాతనుడు అగు శంభు ప్రభుడు ఆమె మనస్సులో విశ్వాసము కలుగలేదని యెరింగి ఇట్లు పలికెను (42).
శివుడిట్లు పలికెను -
ఓ దేవీ! నా మాటను వినుము. నీ మనస్సునకు విశ్వాసము కలుగనిచో, నీవు నీ బుద్ధిని ఉపయోగించి రాముని పరీక్షించుము (43). ఓ సతీ! ప్రియురాలా! నీ మోహము తొలగునంత వరకు ప్రయత్నించుము. నేను ఆ మర్రి చెట్టు నీడలో నిలబడి యుందును. నీవు పరీక్షను చేయుము (44).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
05 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment