✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 26 - 2. ప్రాణాయామ యజ్ఞము - ఎంత నెమ్మదిగ శ్వాసను పీల్చిన మనసు అంత నెమ్మదించును. నిదాన మగుచున్న మనసునకు ప్రశాంతత రుచి తెలియును. ఈ ప్రశాంతత రుచిగొనిన మనసు మరింత ప్రశాంతతకై మరింత నెమ్మదిగ పీల్చుట, వదలుట చేయును. ఈ అభ్యాసమున మనోశాంతి అనునది యిట్లు అప్రయత్నముగ లభించును. 🍀
📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚
Part 2
ప్రవాహము పైన వస్తువులు తేలుచు వేగముగ కదలుచున్నను అది వస్తువుల కదలిక కాదు కదా! ప్రవాహ వేగమే పైన తేలు వస్తువుల వేగము. అట్లే శరీర ప్రయాణ వేగమునకు, మనో ప్రయాణ వేగమునకు శ్వాసయే ఆధారమని తెలియును.
శ్వాస ప్రవాహమున మనసు లగ్నమగును. శ్వాస నెమ్మదించినచో మనసు నెమ్మదించును. మనసు నెమ్మదించినచో శ్వాస నెమ్మదించును. కావున మనసు నెమ్మదించ వలెనన్నచో శ్వాసను నెమ్మదిగ నిర్వర్తించవలెను. మనసు వేగముగ పనిచేయు వారియందు శ్వాస కూడ వేగముగ పనిచేయుచు నుండును. అట్టివారి శ్వాస బుసలు కొట్టుచున్నట్లుగ యుండును. ఇది రజోగుణ పూరితమైన శ్వాస.
మనసు లగ్నము చేసి శ్వాసను నెమ్మదిగ పీల్చుట అభ్యాసమున రెండవ మెట్టు. ఎంత నెమ్మదిగ శ్వాసను పీల్చిన మనసు అంత నెమ్మదించును. పీల్చినంత నెమ్మదిగనే వదలుట కూడ చేయవలెను. పీల్చుట, వదలుట నెమ్మది యగుకొలది మనసు నిదానమగు చుండును.
నిదాన మగుచున్న మనసునకు ప్రశాంతత రుచి తెలియును. ఈ ప్రశాంతత రుచిగొనిన మనసు మరింత ప్రశాంతతకై మరింత నెమ్మదిగ పీల్చుట, వదలుట చేయును. ఈ అభ్యాసమున మనోశాంతి అనునది యిట్లు అప్రయత్నముగ లభించును.
మనోశాంతియే ధ్యేయముగ ప్రస్తుతకాలమున ధ్యానములు బోధింపబడుచున్నవి. వాస్తవమునకు మనోశాంతి నిజమగు ధ్యానమునకు ఆరంభము. ధ్యేయము కాదు, అంతము కాదు. మనోశాంతి ఆధారముగ ప్రాణాయామ యజ్ఞము ఆరంభమై ప్రత్యాహార, ధారణ స్థితులను దాటి ప్రజ్ఞ ధ్యానమును చేరును.
అందులకే భగవానుని బోధ ధ్యానమును గూర్చి తరువాత అధ్యాయమైన ఆరవ అధ్యాయమున వున్నది. నాలుగవ అధ్యాయమగు జ్ఞాన యోగమున- యోగమున నాలుగవ అంగమైన ప్రాణాయామమును బోధించుట పతంజలి యోగశాస్త్రమునకు, భగవద్గీతకు గల సమన్వయము.
ప్రశాంతతో కూడిన మనస్సు శ్వాసను నెమ్మదిగ పీల్చుటతో పాటు పూర్ణముగ పీల్చుట చేయును. శ్వాసనెంత పూర్ణముగ పీల్చినచో అంత పూర్ణముగ వదలుట జరుగును. పూర్ణముగ పీల్చుట వలన ప్రాణావాయువు దేహమున పూర్ణముగ నిండును. పూర్ణముగ వదలుట వలన అపాన వాయువు పూర్ణముగ బయలు వెడలును.
అపానము పూర్ణముగ బయలు వెడలినచో దేహమందలి మలినములు బైటకు నెట్టబడును. మలినములు నెట్టబడుట, ప్రాణము పీల్చబడుట కారణముగ ఈ అభ్యాసమున దొరకు రెండవ బహుమతి ప్రాణశక్తి. క్రమముగ దేహము ఆరోగ్య వంతమగుటకు క్రొత్తగా కొనివచ్చిన ప్రాణము సహకరించును. ప్రాణశక్తి పెరుగుట, మలినములు తొలగుట అనునది నిరంతరము జరుగు ప్రాణాయామము అభ్యాసమున మరియొక భాగము.
ప్రాణమును అనేక విధములుగ దేహము అందుకొను చుండును. ఆహారము అందులో ఒక భాగము. మనసును లగ్నము చేసి శ్వాసను నెమ్మదిగ పీల్చుట, వదలుట, పూర్ణముగ పీల్చుట, వదలుట కారణముగ శ్వాస క్రమ బద్ధము చెందుట జరుగును.
మనసు ప్రశాంతత చెందు చుండును. ప్రాణశక్తి పెరుగుచు నుండును. ఉచ్ఛ్వాస నుండి పొందు ప్రాణవాయువు వలసిన ప్రాణశక్తిని దేహమున కిచ్చుచుండును. అట్టివారు నియతాహారు లగుదురు. అనగా సహజముగ వారి ఆహారము నియమింపబడును. ఇదియొక సిద్ధి.
వీరు ఆహారమును అల్పముగనే స్వీకరించినను శక్తివంతులై యుందురు, సులభముగ అలసట చెందరు. దేహము తేలిక పడుచు పలుచనై కాంతివంత మగుచుండును. దేహమున శుభమగు మార్పులు ఈ విధముగ శ్వాస నభ్యసించుటవలన వచ్చును. శ్వాస నుండి వలసిన ప్రాణశక్తి లభించుటచే ఆహారము నందు నియమము
సహజముగ ఏర్పడును.
ఆహారము తగ్గుట జరుగునే కాని చేయుటగ నుండదు. తగ్గించుట చేయువారు అకస్మాత్తుగ ఎక్కువ తినుచుందురు. ఎక్కువ తినుట, తక్కువ తినుట వలన దేహమునకు అవ్యవస్థత కలిగించును. ఈ అవస్థకు గురియగు దేహము, అస్వస్థతకు కారణమగును. ఉపవాసములు చేయువారు, ఎక్కువగను, తక్కువగను తినువారు యోగమున కనర్హులు.
యోగజీవనము నిర్మల సెలయేరువలె ప్రవహించవలెనే కాని వరదవలె కాదు. పై కారణముగనే భగవద్గీత యందు నియతాహార విషయము 30వ శ్లోకమున తెలుపబడెను. 29వ శ్లోకమున ప్రాణమును గూర్చిన సాధన తెలుపబడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
03 Dec 2020
No comments:
Post a Comment