శ్రీ శివ మహా పురాణము - 285


🌹 . శ్రీ శివ మహా పురాణము - 285 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

69. అధ్యాయము - 24

🌻. శ్రీరామునకు పరీక్ష - 1 🌻

నారదుడిట్లు పలికెను -


ఓ బ్రహ్మా! విధీ! ప్రజాపతీ! మహాప్రాజ్ఞా! కృపాసింధో! సతీపరమేశ్వరుల మంగళకరమగు యశస్సును వినిపించితివి (1). ఇపుడు పవిత్రము, ఉత్తమము అగు ఆ యశస్సును ప్రీతితో ఇంకనూ చెప్పుము. ఆ దంపతులైన సతీపరమేశ్వరులు అచట ఉన్నవారై ఏమి చరితమును చేసిరి?(2).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! నేను సతీశివుల చరిత్రను చెప్పెదను. ప్రేమతో వినుము. వారు అచట ప్రతిదినము అన్నివేళలా లోకపు పోకడను అనుసరించి క్రీడించిరి (3). ఓ మహర్షీ! అపుడు మహాదేవి యగు సతి శంకరుడు నిద్రించు చుండగా వియోగమును పొందినదని కొందరు ప్రాజ్ఞులు చెప్పుచున్నారు (4). ఓ మహర్షీ! శబ్దార్ధముల వలె కలిసి ఉండే చిత్స్వరూపులగు ఆ శక్తీశులకు ఏ కాలమునందైననూ వాస్తవమగు వియోగము ఎట్లు సంభవమగును?(5). కాని లీలల యందు అభిరుచి గల వారిద్దరికి సర్వము సంభవమే యగును. ఏలయన, సతీశివులు లోకమర్యాదననుసరించి లీలలను ప్రకటించెదరు (6).

ఆ దక్ష పుత్రి తన తండ్రి చేసిన యజ్ఞములో శంభునకు ఆదరము లేకుండుటను గని, శంభునిచే విడువ బడి, ఆ యజ్ఞశాలయందు దేహత్యాగమును చేసెను (7).

ఆ సతీ దేవి మరల హిమవంతునకు కుమారై యై జన్మించి, పార్వతి యను పేరును బడసి, తీవ్రమగు తపస్సును ఆచరించి, శివుని వివాహమాడెను (8).

సూతుడిట్లునెను -

ఆ నారదుడు ఆ బ్రహ్మ యొక్క ఈ మాటను విని, శివాశివుల గొప్ప యశస్సును గురించి బ్రహ్మను ప్రశ్నించెను (9).

నారుదుడిట్లు పలికెను -

ఓ విష్ణు శిష్యా! మహాత్మా! విధీ! లోకాచారమును అనుకరించే శివాశివుల చరిత్రమును నాకు విస్తరముగా చెప్పుము (10). శంకరుడు ప్రాణములకంటె ప్రియతరమగు భార్యను విడనాడుటకు కారణమేమి? తండ్రీ! ఇది నాకు విచిత్రముగ తోచుచున్నది. కాన చెప్పుము (11).

నీ కుమారుడు యజ్ఞమునందు శివుని అనాదరము చేయుటకు కారణమేమి? తండ్రి చేయుచున్న యజ్ఞమునకు వెళ్లిన ఆ సతి దేహమునెట్లు త్యజించెను? (12). తరువాత ఏమాయెను? మహేశ్వరుడేమి చేసెను? ఆ వృత్తాంతమునంతనూ నాకు చక్కగా చెప్పుము. నేను ఆవృత్తాంతమును వినుట యందు శ్రద్ధ గలవాడను (13).

బ్రహ్మ ఇట్లు పలికెను -

కుమారా! నారాదా! నీవు నా కుమారులలో శ్రేష్ఠుడవు. గొప్ప బుద్ధి శాలివి.చంద్ర శేఖరుని చరితమును మునులతో గూడి పరమప్రీతితో వినుము (14). విష్ణువు మొదలగు దేవతలచే సేవింపబడే, పరబ్రహ్మయగు మహేశ్వరునకు నమస్కరించి, అత్యద్భుతమగు ఆయన చరితమును చెప్పెదను (15). ఇదంతా శివలీల. స్వతంత్రుడు, నిర్వికారుడునగు ఆ ప్రభువు అనేక లీలలను ప్రదర్శించును. ఆ సతీదేవియూ ఆయనవలెనే లీలలను ప్రదర్శించును (16).

ఓ మహర్షీ! ఆయన తక్క మరియెవ్వరు ఆయన చేసిన కర్మలను చేయగల్గుదురు? ఆయనయే పరమాత్మ, పరబ్రహ్మ, పరమేశ్వరుడు (17).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


03 Dec 2020

No comments:

Post a Comment