కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 120
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 120 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 50 🌻
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణములు గల పృథ్వి స్థూలమైనది. శబ్ద, స్పర్శ, రూప, రస గుణములు గల జలము పృథ్వి కన్న సూక్ష్మము. శబ్ద, స్పర్శ, రూప గుణములు గల అగ్ని జలము కన్న సూక్ష్మము. శబ్ద, స్పర్శ గుణములు గల వాయువు అగ్ని కన్న సూక్ష్మము. శబ్ద గుణమే గల ఆకాశము వాయువు కన్న సూక్ష్మము.
పంచభూతములు ఒక్కొక్క గుణము తగ్గిన కొలదీ సూక్ష్మమగుచున్నది. ‘నిశ్శబ్దోబ్రహ్మముచ్యతే’ అని చెప్పబడినటుల ఏ గుణము లేని పరమాత్మ అతిసూక్ష్మము. ఈ విధముగా స్థూలమైన పృథ్వికంటే ఆకాశము సూక్ష్మమని గ్రహించగలుగుచున్నాము.
అదే విధముగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను ఏ గుణము లేని పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమని గ్రహింపవచ్చును కదా! అవ్యక్తము విత్తనము వంటిది. ఆ విత్తనము ఉబ్బినట్లు ఉండునది మహతత్త్వము. దాని నుండి బయటకు వచ్చిన మొలకవంటిది అహంకార తత్వము. కాండము, కొమ్మలు, ఆకులు మొదలగునవి ఆకాశాది పంచభూతములుగా యున్నవి.
మరియు ఇవి కార్యకారణరూపముగా నున్నవి. మరియు ఆద్యంతములు కలిగియున్నవి. ఏ కారణము లేని ఆత్మ, ఆద్యంతములు లేనిదిగాను, అవ్యయము నిత్యమునై యున్నది. శాశ్వతమైన ఇట్టి తత్త్వమును తెలుసుకున్నవారు ముక్తులగుదురు.
చాలా స్పష్టంగా రెండు ఉపమానాలను తీసుకున్నారు. ఒక్కటేమిటి అంటే, పంచభూత విచారణ.
రెండవది ఎట్లా సృష్టి క్రమము ఏర్పడుతున్నది? ఈ రెండు అంశాలని ఇక్కడ బోధించే ప్రయత్నము చేస్తున్నారు. మనందరమూ దేని మీద ఆధారపడి ఉన్నాము అంటే, భూమి మీద ఆధారపడి ఉన్నాము అని, ప్రతీ ఒక్కరూ చెబుతారు. కారణము ఈ నేల మీదే ఉన్నాం కాబట్టి. భూమి మీద ఆధారపడి ఉన్నాము అంటున్నామా? పరమాత్మ మీద ఆధారపడి ఉన్నాము అంటున్నామా? అనేది ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే, ఈ నేలే కదండీ మనకు ఆధారము.
ఈ నేల లేకపోతే మనం ఏం చేయగలుగుతాము? ఎక్కడ ఉంటాము? ఏ రకంగా జీవిస్తాము? ఏ రకమైన అవకాశాలున్నాయి మనకు. ఈ భూమిలేకపోతే? ఏమీ లేదండీ అని అన్నామనుకో, అప్పుడు మనము శబ్ద స్పర్శ రూప రస గంధాలనే ఐదు గుణాలతోనూ, ఈ పృథ్వి మీద జీవిస్తున్నటువంటి వాళ్ళము.
అయితే ఈ పంచభూతాలు.. ఏవయ్యా? భూమి ఉంటే సరిపోతుందా? భూమి మీద నీళ్ళు అవసరం లేదా? అని అడిగామనుకోండి? అయ్యో! నీళ్ళు లేకపోతే ఎట్లా జీవిస్తామండీ? నీరే ప్రాణాధారము. నీళ్ళు లేకపోతే అసలు ప్రాణ శక్తే లేదు. నీళ్ళు త్రాగకుండా ఒక గంట కూడా ఉండలేమండీ. నీళ్ళు ప్రతీ గంట గంటకూ అవసరమేనండీ! నీళ్ళు లేకపోతే ఏ జీవ లక్షణమూ కుదరదండీ! అబ్బో నీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండీ! నీళ్ళు లేకపోతే నడవదండీ.
మరి ఇందాక ఏమన్నావయ్యా? పృథ్వే ఇంపార్టెంట్ అన్నావు కదా! పృథ్వే లేకపోతే నీళ్ళే లేవు కదండీ అంటావు! కాబట్టి, మానవులందరూ, ఇప్పుడు ఏమైపోయిందీ అంటే, నీకు ఆకాశం ప్రధానమా? పృథ్వి ప్రధానమా? అంటే, పృథ్వే ప్రధానం. ఎందుకంటే ఆకాశము వలన నేను జీవించడం లేదు అనుకుంటున్నాడు కాబట్టి.
ఏమయ్యా! మరి నీకు నీళ్ళు అవసరం లేదా? నిప్పు అవసరం లేదా గాలి అవసరం లేదా? అంటే, అవి లేకుండా ఎట్లా జీవిస్తామండీ అంటాడు.
కాబట్టి, నీవు జీవన పర్యంతమూ దేని మీద ఆధారపడియున్నావయ్యా అంటే, పంచభూతాల మీద ఆధారపడియున్నావు. అందుకని, ఈ దేహం పేరేమిటి? పాంచభౌతిక దేహము. పంచభూత లక్షణ సముదాయము చేత, నీకు దేహంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ ఏర్పడ్డాయి. నీ దేహములో వున్న ఇంద్రియాలు అన్నీ ఏర్పడ్డాయి. నీ దేహలో ఉన్న గోళకాలన్నీ ఏర్పడ్డాయి.
నీ వ్యవహారమంతా ఈ పంచభూతాలపై ఆధారపడే జరగుతుంది. ఎట్లా జరుగుతుంది అనే విచారణ మాత్రం చేయావు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఐదు తన్మాత్రల యొక్క జ్ఞానాన్ని పూర్తిగా కలిగియున్నటువంటిది, పూర్తి విషయ వ్యావృత్తి కలిగినటువంటిదీ పృథ్వి తత్వము సాత్వికమైనటువంటి బోధను ప్రారంభిస్తున్నారు.
తత్ త్వం ఈ పృథ్వి దేని మీద ఆధారపడి ఉంది? దీనకంటే సూక్ష్మమైనటువంటి, స్థూలమంతా సూక్ష్మం మీద ఆధారపడి యున్నది. సూక్ష్మము సూక్ష్మతరంమీద ఆధారపడి యున్నది.
ఆ సూక్ష్మతరం సూక్ష్మతమమైనటువంటి పరమాత్మ మీద ఆధారపడి యున్నది. ఈ ఆధార ఆధేయ విమర్శని చెబుతున్నారన్నమాట! కాబట్టి, ఆకాశంలో నుంచి మొట్టమొదట వాయువు వచ్చింది. వాయువు నుంచి అగ్ని వచ్చింది.
అగ్ని నుంచి జలము వచ్చింది. జలము నుంచి పృథ్వి వచ్చింది. ఎందుకు చెప్పారు అంటే, రేపు విరమణ సమయంలో కూడా ఇదే రీతిగా విరమించబడుతుంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
03 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment