భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 174


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 174 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భరద్వాజ మహర్షి - 5 🌻


31. భరద్వాజుడు ఇంకా చెప్పడు: “రాజా! అరామాల్లో, వేశ్యా వాటికల్లో, సత్రాల్లో, మదిరాల్లో, స్నాన-పానప్రదేశాల్లో దొంగలు చేరుతూ ఉంటారు. జార, చోరులవల్ల ప్రజలకు భయం ఉంటుంది. అందుకని వాళ్ళను పట్టుకుని దండించాలి. అది పరిపాలనలో ప్రథమధర్మం. ప్రజాక్షేమం కోసమని ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నదో నువ్వు గమనించాలి.

32. ఎవరి గురించో మరెవరో ఉత్తమ కులస్థుడనీ, పుణ్యాత్ముడనీ, చాలా మంచివాడనీ చెబుతారు. అది తీసుకుని నివు నమ్మవద్దు. అలాగని వాడిని అక్కడే అనుమానించనూవద్దు” అని చెప్పాడు.

33. నమ్మవద్దు, అనుమానించవద్దు అంటే, మరి ఏం చెయ్యాలి! పరీక్ష చేయాలి. పరీక్షించాలి వాళ్ళను. తన మనిషినే వాడిదగ్గరికి పంపించి పరీక్షించాలి.

34. రాజు తన మనిషిని అనుమానంకలిగినవాడి దగ్గరికి పంపించి ఎట్లా పరీక్షిస్తాడంటే; రాజు యొక్క అంతరంగికుడు, ఉద్యోగంలో కొత్తగాచేరిన వాడిదగ్గరికివెళ్ళి, “మన రాజు చాలా దుర్మార్గుడు. అందరి మనసులలోనూ ఆయన మీద క్రోధం ఉంది. ఎప్పుడో సమయం చూచి మేము తిరుగుబాటు చేద్దామనుకుంటున్నాము నువ్వేమంటావు? ఆయన తమ్ముడొకడు మంచివాడున్నాడు; ఆయనకు రాజ్యమొస్తే సుఖపడతాం మనం. నిన్ను రేపు ఆయన దగ్గరికి తీసుకెళతాను” అంటాడు. అప్పుడు ఆ కొత్తవాడు, “అలాగా! రేపు వెడదాం” అని కనుక అంటే, మర్నాడు వాడిని పంపించెయ్యాలి. అదీ పరీక్ష చేయటమంటే! దానితో వీడి నిజస్వభావం బయటపడిపోతుంది.

35. వాడికి ఆశపెట్టి, ధనాశపెట్టి పరీక్ష చేయాలి. అనుమానించినట్లు కనబడకూడదు. అలాగని గుడ్డిగా నమ్మనేకూడదు. ఈ ప్రకారంగా ప్రతివాడినీకూడా పరీక్షించాలి.

గిల్లికజ్జాలు పెట్టుకొని, చిన్నచిన్న కారణాలకోసం ఎవరూకూడా బలమయినవాడితో శత్రుత్వం పెట్టుకోకూడదు. రాజు చిన్నచిన్న విషయాలను అన్నిటినీకూడా ఉదారస్వభావంతో వదిలి పెట్టాలి. కాని వాటిని మాత్రం వెతుకుతూ ఉండాలి.

36. సాధారణంగా మనం తేలు, పాము ఎక్కడుందోఅని వెలుతురులో పరీక్షించినట్లు, పాలకుడు శత్రువులను వెతుకుతూ ఉండాలి. ఇవాళ ఒకడు మనకు అపచారంచేసాడు అంటే, వాడిని గురించి చాలా జాగ్రత్తవహించి ఎప్పుడూ పరిశీలన చేస్తూండాలి. మనమే వైరం పెట్టుకోకూడదు. చిన్న నేరాలన్నింటినీ క్షమించి వదిలివేయాలి.

37. హృదయంలో ఒకడిమీద ద్వేషం పెట్టుకోవటము, అతడంటే తనకు ఇష్టంలేదని అందరిలోనూ అనటము, వాడిమీద వైరభావము పెట్టుకోవడము, ఇట్లాంటివి ఉండకూడదు. ఎందుకంటే తన ఇస్టాఇస్టాలకు అక్కడ తావులేదు. అది Public administration. ప్రతీవాడికి ఏదో స్వభావం ఉంటుంది. ఏదో మతం ఉంటుంది. వాడిని dislike చేసినప్పటికీకూడా వాడితో రాజు వైరం పెట్టుకోకూడదని స్నేహమే పాటించాలని భరద్వాజుడు రాజనీతి బోధించాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




03 Dec 2020

No comments:

Post a Comment