🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 6 🌹
🌻. 4. శ్రీ చాముండేశ్వరీ దేవి - 4వ శక్తి పీఠం - మైసూరు 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
క్రౌంచపట్టణ చాముండేశ్వరి:
అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమాం|
చాముండేశ్వరి, చిత్కళవాసిని! శ్రీ జగదీశ్వరి రక్షయమాం||
అంటూ క్రౌంచి పట్టణమందున్న చాముండేశ్వరి ఆలయం భక్తజన జయజయ ధ్వానాలతో నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. క్రౌంచి పట్టణం అనగా మహిషాసురుని ప్రధాన పట్టణం. అదే ఈనాటి మైసూరు పట్టణం. కర్నాటక రాష్ట్రంలోగల మైసూరు పట్టణమందు మహిషాసుర మర్ధినిగా, చాముండేశ్వరీ మాతగా తన చల్లని దేవెనలు కురిపిస్తూ, భక్తజన మనోభీష్టాలనీడేరుస్తూ నిత్యసేవా కైంకర్యాల నందుకుంటున్న బంగారు తల్లి ఆదిపరాశక్తి చాముండేశ్వరికి నిత్యం మనః పూర్వక వందనం.
శ్రీ చాముండేశ్వరీ దేవి… ఈ శక్తి పీఠం కర్నాటకలోని మైసూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడ్డాయి. మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి. సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భవించిన శక్తి స్వరూపం. మనదేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగోదిగా ప్రసిద్ధికెక్కిన చాముండేశ్వరి ఆలయ ప్రాంగణంలోనే గణపతి, శివలింగం, ఆంజనేయస్వాని ఉపమందిరాలు భక్తులను ఆకట్టుకుంటాయి.
దేవాలయ ప్రాంగణంలోని రావిచెట్టుకు భక్తులు కుంకుమ పూజలు చేస్తుంటారు. కాళిక, దుర్గ, చాముండీమాతల కలయికగా భక్తులకు దర్శనమిచ్చే చాముండేశ్వరి అనుకున్న కార్యాలను విజయవంతం చేస్తుందని భక్తుల విశ్వాసం.
మైసూరు రాజుల ఇష్టదైవమైన ఈ ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా చేస్తుంటారు. ఈ ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు.
కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా లోని మైసూరులో మైసూరు ప్యాలెస్ కు 13 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండపై ఉన్నది. దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ప్రధాన దేవత చాముండేశ్వరి.
ఈ దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గ అని అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. మైసూరు మహరాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ, కుల దేవతగా ఆరాధీస్తూ, ఈ దేవాలయాన్ని పోషిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించారు. ఈ పుణ్యక్షేత్రాన్ని 12 వ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించారని భావిస్తున్నారు. సంవత్సరాని కొక్కసారి సర్వాలంకార భూషితమైన చాముండమ్మను చూడటం అదృష్టంగా భావిస్తారు భక్తులు.
తల మీదున్న చామరాజ ముడి (కిరీటం), కంఠాభరణాలతో, కర్ణ పత్రాలతో, 3 పతకాలు, హారం, 28 మణులను పొదిగిన కంఠి, జడ పిన్నులు, జడ బిళ్ల, వజ్ర ఖచితమైన త్రిశూలం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, కవచం, ఘంటా హస్త కవచం, కలశం, డమరుకాస్త్రం, ఖడ్గ హస్తం తదితర ఆభరణాలతో సర్వశోభితంగా చాముండీదేవి అలరారుతుంది.
నవరాత్రి ఏడవ రోజున చాముండీ దేవి ఆలయానికి సకల ఆభరణాలను తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుండి 12 రోజులు అన్ని ఆభరణాలను దేవికి అలంకరిస్తారు. దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలను మళ్లీ ఖజానాకు తరలిస్తారు.
🌻. ప్రచారంలో ఉన్న పురాణ కథ:
పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సుచే పురుషుల చేతుల్లో మరణించకూడదని పరమేశ్వరుని నుంచి వరాన్ని పొందుతాడు. ఆ వరం పొందిన గర్వంతో సకలలోకాలను పీడించాడు.
ఇంద్రుని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. భయభ్రాంతులైన సకలలోకవాసులు త్రిమూర్తులను వేడుకోగా, మహిషాసురుని వధించుటకై శక్తి వెలికివచ్చింది. ఆ శక్తి స్వరూపిణియే చాముండేశ్వరి. 18 చేతులతో ప్రతిచేతిలో ఒక ఆయుధంతో ఆ తల్లి దర్శనమిస్తుంది. మహిషాసురుని వధించి మహిషాసురమర్దినిగా సకలలోక వాసుల కీర్తనలను అందుకుంటుంది.
ఈ శక్తిమాతను దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా సకల సంపదలు, వ్యాపారాభివృద్ధి, ఆయురారోగ్యాలను చాముండేశ్వరి ప్రసాదిస్తుందని విశ్వాసం.
అమ్మ చాముండేశ్వరి దేవీ, “చాముండి కొండ” అనబడే ఒక పర్వతము పై కొలువై ఉంటుంది.
‘స్కంద పురాణం' మరియు ఇతర పురాతన గ్రంథాలు ఈ క్షేత్రాన్ని ఎనిమిది కొండల చుట్టూ ఉన్న 'త్రిముత క్షేత్రం' అనే పవిత్ర ప్రదేశం అని ప్రస్తావించాయి. ఆ ఎనిమిది కొండలలో ఒకటైన ఈ చాముండి కొండ పశ్చిమ దిశలో ఉంటుంది.
పూర్వ రోజులలో, ఈ కొండ పై వెలసిన మహాబలేశ్వర స్వామి) గౌరవార్ధం, ఈ కొండను 'మహాబలద్రి' అని అనేవారు.తరువాతి రోజులలో, “దేవి మహత్యం” యొక్క ప్రధాన దేవత చాముండి గౌరవార్థం 'చాముండి కొండా అని పిలువబడింది.
దేశం నలుమూలల నుంచి మరియు విదేశాల్లో నుండి అనేకమంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. దేవత వారి కోరికలను నెరవేర్చును.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment