🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 7 🌹
🌻. 5. జోగులాంబ - 5వ శక్తి పీఠం - అలంపురం , మహబూబ్‌నగర్ 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
అలంపురే జోగులాంబ:
అష్టాదశ క్షేత్రాలలో ఐదవది. అలంపురం పూర్వనామం హలంపురం, మరో పేరు హేమలాపురం. ఈ అలంపురంలోని శక్తిపీఠం జోగులాంబా దేవి శక్తిక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కలదు. ఆదియుగంలో ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా భాసిల్లింది. కాశీక్షేత్రంలో ఉత్తర వాహిని గంగానది, అలాగే అలంపురంలో ఉత్తర వాహిని తుంగభద్ర. కాశీకి అటు, ఇటు వరుణ, అసి నదులున్నాయి. అదే విధంగా అలంపురానికి వేదవతి, నాగావళీ నదులున్నాయి. కాశీలో గంగ, యమున, సరస్వతి, త్రివేణి సంగమం ఉన్న విధంగా అలంపురంలో వేదవతి, నాగావళీ నదులున్నాయి. కాశీ అధిదేవతలు విశాలాక్షీ, విశ్వేశ్వరుడు. అలంపురానికి అధిదేవతలు జోగులాంబా, బాలబ్రహ్మేశ్వరుడు. ఈ అలంపురం శక్తిక్షేత్రం శ్రీశైలానికి పశ్చిమ ద్వారమై వెలసింది. కావున ఈ అలంపురాన్ని “దక్షిణ కాశి” అంటారు.
అలంపురం శక్తి జోగులాంబా, బాలబ్రహ్మేశ్వరాలయాలకు అటూ ఇటూ కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, తారకబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ అనే నవబ్రహ్మ ఆకారాలు లింగ రూపంలోనే ఉంటాయి. బాలబ్రహ్మేశ్వరుని తలపై మాత్రం చిన్నచిన్న గుంటలుంటాయి. ఈ లింగం చుట్టూ నారాయణ సాలగ్రామాలుంటాయి. ఈ బాలబ్రహ్మేశ్వర లింగంపై ఎన్ని నీళ్లు పోసినా ఆ నీళ్లు ఎటు పోతాయో తెలియదు. ఇసుకతో రూపుదిద్దిన “రససిద్ది వినాయకుడు” అనే పేరుతో గుడిలోని ఒక వినాయకుని తాకితే గరుకుగా ఉంటాడు. గట్టిగా అరగదీస్తే ఇసుక రాలుతుంది.
తుంగభద్ర ఆవలి ఒడ్డున పాపనాశేశ్వర ఆలయం, పాపనాశిని తీర్థం ఉన్నాయి. ఈ తీర్థంలో ఒక్క స్నానం చేస్తే సంవత్సరం పాటు గంగానదిలో స్నానం చేసిన ఫలితం సిద్ధిస్తుంది.
ఎంతో అద్భుత మహిమల చరిత్రల అలంపురం క్షేత్రాన్ని 7,8 శతాబ్దాలలో చాళుక్య రాజులు; 9వ శతాబ్దంలో రాష్ట్రకూటం రాజులు; 10,11 శతాబ్దాలలో కళ్యాణ, చాళుక్య రాజులు అభివృద్ధిపరచారు. కాని బహుమని సుల్తానుల తాకిడికి ఈ ప్రాంతం జీర్ణస్థితికి చేరుకుంది. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ అలంపురాన్ని అభివృద్ధిప్రిచాడు. ఇలా కాలమనే ఆటుపోటులకు తట్టుకుంటు నాటి చరిత్రకు సాక్షీభూతంగా నిలచి నేటికి ఆ ప్రతిభను చాటుతూ నిలచిన అలంపురం చూసి తీరవలసిన మహిమాన్విత పర్యాటక కేంద్రం.
పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.
అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం. జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడకు తరలించారు. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు. ఇది హరిక్షేత్రం.
9 వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను ఇరవైకి పైబడిన శివాలయములు వివిధ ఆకారం, పరిమాణాలలో ఉన్నాయి. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది.
ఈ దేవాలయాన్ని ఒక్క సారి సందర్శిస్తే మన దురదృష్టం వెళ్లి పోయి అదృష్టం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. సంతాన సమస్యలు, అనారోగ్యసమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ అపాద్భాంధవ పాత్ర పోషిస్తుంది.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment