🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 8 🌹🌻. 6. భ్రమరాంబిక దేవి - 6వ శక్తి పీఠం - శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ 🌻

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 8 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 8 🌹
🌻. 6. భ్రమరాంబిక దేవి - 6వ శక్తి పీఠం - శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ,ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణీ అవని జనులకు కొంగుబంగారైన దైవశిఖామణీ
శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమర

అష్టాదశ శక్తిపీఠలలో ఆరవ శక్తి పీఠమై భ్రామరి శక్తితో విరాజిల్లుతున్న శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా విశిష్ట స్థానం పొంది యున్నది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.

ఆంధ్రరాష్ట్రంలోని కర్ణూలు జిల్లాలో గల శ్రీశైలం సముద్రమట్టానికి చుట్టూ నాలుగు ప్రధాన గోపురాలతో కోట గోడల్లాంటి ఎతైన ప్రాకారంలో 279300 చ.అడుగుల విశాల ప్రాంగణంలో ఈ ఆలయం ఉన్నది. ఆలయ ప్రాకారం 2121 అడుగుల పొడవుతో దాదాపు 20 అడుగుల ఎత్తుగల కోట గోడ పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలచి ఉన్నది.

 కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో భ్రమరాంబ మల్లేశ్వరల దర్శనం ముక్తిదాయకమని పురాణ ప్రవచనం. 

అందుకే “శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే” అని ఆర్యోక్తి. శ్రీశైలము అనగా వరములనిచ్చె శివ కైలాసము. సతీదేవి కంఠభాగము ఈ ప్రదేశంలో పడిందని చరిత్ర ఆదారం.

విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. 

అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు... ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర (తుమ్మెద) రూపంలో అవతరించిందట. 

అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు. 

  ఒకరోజున సౌందర్యలహరి అయిన జగజ్జనని అరుణాసురుని కంటపడింది. ఓ సుందరీ ! నీకీ కానలలో పని ఏమి? నేను లోకాల నేలేటి అరుణాసురుడను. నా సామ్రాజ్ఞ్‌వై నాతో సుఖించు అని ఆమె చేయిపట్టుకోబోగా ఆమె చుట్టూ తిరుగుతున్న భ్రమరాల (తుమ్మెదలు) అరుణాసురునిపై దాడిచేసి, చంపివేసి వాడి రాజ్యంలో వున్న రక్కసులందరినీ తుదముట్టించాయి.

   కొంతకాలానికి మహిషాసురుని సంహరించేందుకు ఉగ్ర చండీరూపంతో, పద్దెనిమిది భుజములతో వెలసి వాడిని తుదముట్టించింది.రెండవసారి మహిషుడు మళ్ళీ పుట్టినప్పుడు భద్రకాళిగా ఎనిమిది చేతులతో అవతరించి వాడిని సంహరించింది. 

మూడవసారి మహిషుడు పుట్టి ‘అమ్మా! రేండు జన్మలలో నీచేత సంహరింపబడి నా అజ్ఞానం పొగొట్టుకున్నాను. ఇప్పటికైనా నన్ను కటాక్షించి నీ వాహనంగా నన్ను సేవచేయనీ, అని ప్రార్థించగా వాడిని తన పాదల క్రింద తొక్కి ఉంచింది భ్రమరాంబాదేవి.

  ఈ క్షేత్రమున ముందుగా వెలసినది అర్ధనారీశ్వరి అయినప్పటికీ భ్రమరాంబా దేవి వెలసిన నాటినుండి ఈమెయే ప్రధాన శక్తి స్వరూపిణి అయినది.

  శ్రీశైలానికి నాలుగు ప్రధాన ద్వారములు కలవు. అవి త్రిపురాంతకము,సిద్ధవటము, అలంపురము, ఉమామహేశము అనునవి.

  ఇక్కడి పాతాళగంగ భక్తుల పాపాలు కడిగే పావనగంగ. నల్లమలై అడవిలోపల గల “ఇష్టకామేశ్వరి” ఆలయం కాకుండా ఆరుబయటే ఆ దేవి ఉంటుంది. ఇష్టకామేశ్వరీ దేవి నొసట కుంకుమ దిద్దినపుడు మనిషి నుదురువలె మెత్తగా ఉంటుంది. ఇంకా చంద్రావతి నిర్మించిన “వృద్ధ మల్లికార్జునాలయము” అలా అడుగడుగునా అలరారే వన సౌందర్యాలు, ఔషధీ విలువలు, ఆరోగ్య ప్రశాంతతో అలరారే శ్రీశైలం నిజంగా భూతల కైలాసం.

చంద్రమతి అనే రాజకుమార్తె, శివుని ధ్యానించి ప్రసన్నం చేసుకుని, తాను మల్లికగా మారి శివుని జటాజూటంలో ఉండే వరాన్ని పొందింది.

పద్మ పురాణం, మత్స్యపురాణం, స్కాంద పురాణం, దేవీ భాగవతం వగైరా అనేక పురాణాలలో ప్రస్తుతించబడిన ఈ క్షేత్రం భూమండలానికి నాభిస్ధానం అని స్ధల పురాణం చెబుతోంది.  ప్రతి పూజ, వ్రతం ముందు మనం చెప్పుకునే సంకల్పంలో మనమున్న స్ధలం శ్రీశైలానికి ఏ దిశగా వున్నదో చెప్పుకోవటం ఈ క్షేత్రం యొక్క ప్రాచీనత్వానికి నిదర్శనం. 

శ్రీశైలంలో స్వామి ఆలయం వెనుక వున్న  శ్రీ భ్రమరాంబాదేవి ఆలయ మండపంలో అద్భుత శిల్ప కళతో అలరారే స్తంభాలున్నాయి.  పూర్వం ఈ ఆలయంలో వామాచార పధ్ధతి వుండేది.  విశేషంగా  జంతుబలి  జరిగేది.  

గుడిలోకి ప్రవేశించగానే, ముందుగా అయ్యేది అయ్య, మల్లికార్జునస్వామి దర్శనమే.  ఉపాలయాలలో శ్రీరాముడు ప్రతిష్టించిన సహస్ర లింగేశ్వరస్వామి, వృధ్ధ మల్లికార్జునస్వామి, రాజేశ్వరి, రాజేశ్వరుడు, సీతాదేవి ప్రతిష్టించిన సహస్రలింగేశ్వరస్వామి, ఇంకా పాండవులు ప్రతిష్టించిన శివ లింగాలు, వగైరా అనేక దేవతా మూర్తుల దర్శనం చేసుకోవచ్చు.

అంతేకాదు, ఈ చుట్టు పక్కల చూడవలసిన ప్రదేశాలు అనేకం వున్నాయి.  సాక్షి గణపతి, శిఖరం, పాల ధార, పంచధార, హటకేశ్వరం, శ్రీ పూర్ణానందస్వామి ఆశ్రమం, అందులో కామేశ్వరీ ఆలయం, ఇష్ట కామేశ్వరి వగైరాలు.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment