🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 9 🌹🌻. 7. శ్రీ మహాలక్ష్మి - 7వ శక్తి పీఠం - కొల్హాపూర్, మహారాష్ట్ర 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 9 🌹
🌻. 7. శ్రీ మహాలక్ష్మి - 7వ శక్తి పీఠం -  కొల్హాపూర్, మహారాష్ట్ర  🌻
📚. ప్రసాద్ భరద్వాజ

కొలాహపురి మహాలక్ష్మీ:
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సుర పూజితే|
శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే||

తా|| శ్రీ పీఠముపై సుఖముగా కూర్చొని యుండి, శంఖము, చక్రము, గద మరియు అభయ హస్తముద్రతో నుండి మాయను మటుమాయం చేసే మహామాయగా దేవతల రత్న కిరీట కాంతులతో మొరయుచున్న పద్మపాదములుగల తల్లి, దేవతలచే పూజింపబడుతున్న మహాలక్ష్మికి భక్తిపూర్వక నమస్కారము.

అష్టాదశ శక్తి పీఠములలో ముఖ్యమైన శక్తిపీఠము కొలాహపురి మహలక్ష్మీ శక్తిపీఠము. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత మేలుచేస్తుందని ఆర్యోక్తి. 

ఈ క్షేత్రానికి పూర్వనామం “కరవీర” పట్టణం. ఈ కొలాహపూర్ సముద్ర మట్టానికి 550 అడుగుల ఎత్తులో వున్నది. క్రీ.శ.9వ శతాబ్దంలో ఈ మహాలక్ష్మి ఆలయం నిర్మించబడినదని చరిత్రకారుల భవన.

ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

పద్మావతి పురంవంటి కొలాహపురంలో కొలువైనది, కరుణ మాత్రమున వీరత్వము నొసగే కరవీర పురవాసిని, విభూతి అనగా ఐశ్వర్యప్రదమైన శివలింగమును కిరీటంపై ధరించి, వాత్సల్యంతో కోరిన వారికి సంపదనొసగే సచ్చిదానంద స్వరూపిణీ, ఓ లక్ష్మిదేవీ నీకు జయమగుకాక…

మాత లుంగం గదాం ఖేటం పానపాత్రం చ భిభ్రతే|
నాగలింగం చ యోనించ భిభ్రతీ నృప మూర్థని||

కొలాహపురి మహలక్ష్మికి నాలుగు చేతులున్నాయి. (కొలాహపుర మహాత్మ్యము) క్రింద కుడిచేతిలో మాతలుంగ ఫలం (మాదిఫలం), పైకుడి చేతిలో కిందికి దిగి ఉన్న పెద్ద గద, పైన ఎడమ చేతిలో డాలు, క్రింది ఎడమ చేతిలో పానపాత్ర ఉండగా, శిరస్సుపై ఒక నాగపడగ, దానిలో శివలింగము, యోని ముద్ర ఉన్నాయి. చంద్రఘంటా దేవి కిరీటంలోని ఘంటయే లక్ష్మిదేవి కిరీటంలోని శివలింగంగా మారిందని పెద్దల ప్రవచనం. 

అత్రి, అనసూయల పుత్రుడైన సద్గురు దత్తాత్రేయుడు ప్రతిరోజు మద్యాహ్నం ఈ లక్ష్మీదేవి వద్దకు వచ్చి భిక్షస్వీకరించేవాడట. వింధ్య గర్వమణచిన అగస్త్యుడు కొలాహపురి క్షేత్రదర్శనంతో దేవి సాక్షాత్కారం పొందాడు.

వందే పద్మకరాం ప్రసన్న వదనాం సర్వసౌభాగ్యదాయినీం|
వందే కరవీరపురస్థితాం మహాలక్షీం మానసార్చిత వందనం||

ఇక్కడ అమ్మవారి మూడు కళ్ళు పడ్డాయి అని చెప్పుతారు. మహాలక్ష్మి అనే పేరు ఉండడం మూలంగా ఈ అమ్మవారిని శ్రీ మహావిష్ణువు భార్య అని అనుకుంటారు. కానీ, ఈమె విష్ణుపత్ని కాదు. 18 భుజాలతో రజోగుణంతో భాసిల్లుతున్న మహాశక్తి. 

రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి.  కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. 

కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. 

మహాప్రళయకాలంలో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు. 

🌻. స్థల పురాణం  :
మహారాష్ట్రలోని కొల్హాపురంలో పంచగంగా నదీ సమీపంలో ఈ శక్తి పీఠం విరాజిల్లుతోంది. 

సిరిసంపదలను ప్రసాదించే ఈ శక్తి పీఠం గురించిన ప్రస్తావన మనకి పురాణాల్లో కనిపిస్తుంది. ఒకానొకప్పుడు ఈ ప్రాంతాన్ని కరవీరుడు పాలిస్తూ వున్న కారణంగా ఇది 'కరవీరపురం'గా ప్రసిద్ధి చెందింది.

కరవీరుడు అతని ముగ్గురు సోదరులు ప్రజలను నానాకష్టాలు పెడుతూ ఉండటంతో, రాక్షస కుమారులైన ఆ నలుగురిని కూడా శివుడు సంహరించాడు. 

దాంతో కరవీరుడి తండ్రి అయిన కొల్హుడు ప్రతీకారంతో రగిలిపోతూ దేవతలపైకి దండెత్తాడు. దాంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి అతణ్ణి సంహరించింది. కొల్హుడి అభ్యర్ధన మేరకు ఆ ప్రాంతానికి అతని పేరు స్థిరపడేలా అనుగ్రహించింది.

ఇక్కడి అమ్మవారు మూడు అడుగుల ఎత్తులో శివలింగాకారంలో దర్శనమిస్తూ ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. 

మహిమాన్వితమైనటువంటి ఈ శక్తి పీఠానికి క్షేత్ర పాలకుడు కపిలేశ్వరుడు, ముందుగా ఆయనను దర్శించిన తరువాతనే అమ్మవారిని దర్శించాలి. 

అమ్మవారికి చెరో వైపున మహాకాళి - మహా సరస్వతి ఆలయములు వున్నాయి. నవదుర్గల ఆలయాలు ... నవగ్రహాల ఆలయాలతో పాటు, సాక్షి గణపతి .. సూర్యనారాయణుడు .. దత్తాత్రేయుడు ఇక్కడ కొలువుదీరి కనిపిస్తారు.

 దత్తాత్రేయుడు ఈ అమ్మవారి దగ్గరే ప్రతి రోజు బిక్ష స్వీకరించేవాడని స్థల పురాణం చెబుతోంది.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment