ధర్మమును కర్తవ్యము రూపమున అనుసరించుటయే బుద్ధియుక్తమగు జీవనము. అట్టి జీవనమున ఫలాసక్తి లేకుండుట కౌశలముతో గూడిన కర్మయోగము 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 50 📚
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే |
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ || 50 ||
బుద్ధిలోకములో నుండి పనిచేయు వాడు పుణ్య కర్మలని, పాప కర్మలని విభజించి ఫలితములనుద్దేశించి పనులు చేయడు. ఆ భావమును విసర్జించి తన కర్తవ్యమును నిర్వర్తించును.
ఫలితములపై ఆశ లేనివానికి పుణ్యపాపముల విభజన వుండదు. అతనికి కర్తవ్యము మాత్రముండును. కర్తవ్యమును మాత్రమే ఉద్దేశించుకొనుచు వివేకముతో పనిచేయు వానిని కర్మఫలములు బంధించవు.
పుణ్యపాపముల విభజనము మనోలోకములకు సంబంధించినది. బుద్ధిలోకములకు సంబంధించినది కాదు. బుద్ధి లోకమున కర్తవ్యము ధర్మ సంరక్షణము ననుసరించి యున్నది. ధర్మ రక్షణమునకై కృష్ణు 'ఆయుధము పట్టను' అను మాటను ప్రక్కన పెట్టి భీష్ముని పైకి సుదర్శనముతో దుమికెను. ఆడిన మాట తప్పను అని భీష్మించి భీష్ముడు పెళ్ళిని, సంతతిని నిరాకరించి కురు వంశమునకు నష్టము కలిగించెను. సత్యవతీదేవి వేడుకొనినను వినలేదు.
ధర్మమును కర్తవ్యము రూపమున అనుసరించుటయే బుద్ధియుక్తమగు జీవనము. అట్టి జీవనమున ఫలాసక్తి లేకుండుట కౌశలముతో గూడిన కర్మయోగ మగును.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
05.Sep.2020
No comments:
Post a Comment