కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 46



🌹.  కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 46  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 10 🌻

శత సంవత్సరములు ఏ రకమైన అనారోగ్యం లేకుండా బలవత్తరమైనటువంటి దేహాన్ని కలిగి వుండాలి. ఇదీ లంకంత ఇల్లుతో సమానమే. ఇప్పుడాలోపల వున్నవాడు కూడా ఏమౌతాడు అప్పుడూ? ఆ లంకేశ్వరుడే అవుతాడు. శరీరం కూడా నీ ఇల్లేగా. నువ్వు నివసించే ఇల్లు ఎట్లాగో, నీ శరీరమే మొదటి ఇల్లు.

అట్లాగే డబ్బెంత కావాలి నాయనా? అబ్బ, నేనండీ ఒక ఏనుగు మీదకి ఎక్కి ఒక రత్నాన్ని గాలిలోకి విసిరితే ఎంత ఎత్తు వెళ్తుందో అంత ఎత్తు ధనరాశి గనక నాకు లభిస్తే ఈ జీవితానికి సరిపోతుంది అన్నాడట. ఆ ధనం క్రిందే వాడు నలిగిపోతాడు అనమాట. ఎక్కడికో పోవవసర్లా. వాడు నలిగిపోవడానికి , ఆ ధనమే చాలు.

కాబట్టి ఏవేవి అయితే నీ సుఖప్రాప్తికి అవసరమని నువ్వు నీ జీవితంలో నిర్ణయించుకున్నావో వాటి వలననే నీకు దుఃఖము తప్పదు. అట్లా అనుభోక్తమవడం సృష్టి ధర్మం.

ఈవిడతో కలిసి జీవిస్తే నేను సుఖంగా వుంటాను అని ప్రేమించాడు. ఏమైంది? ప్రకృతి యొక్క ధర్మం ఏమిచేస్తుంది. ఆవిడ వలననే నీకు దుఃఖం ప్రాప్తించేటట్లుగా చేస్తుంది. చేస్తే ఏమైంది అప్పుడు. ఆ పూర్వపు అభిమాన బలమంతా దూరమైపోతుంది అప్పుడు.

కాబట్టి ఎవరితో అయితే దుఃఖం కలుగుతుందని నీవు అనుకుంటావో వారి వలన నీకు సుఖం కలిగేటట్లు చేస్తుంది. ప్రకృతి ఎప్పుడూ కూడా విలక్షణమైనటువంటిదనమాట. నీ అభిమానమును పోగొట్టేటటువంటి పద్ధతిగానే ప్రకృతియొక్క నియమాలు వున్నాయి . ఈ సత్యాన్ని గ్రహించాలి. కర్మవశాత్తూ అంటూవుంటామనమాట.

అంటే నువ్వు ఊహించనివి జరగడం కర్మవశాత్తు అని నీ అభిప్రాయం. కాని నీ బుద్ధిబలం కూడా ప్రకృతిలో భాగమే. ఈ సత్యాన్ని గ్రహించాలి. కాబట్టి అనిత్యములైనటువంటివాటిని నీవు ఆశ్రయించకూడదు. ఐహికము గాని, ఆముష్మికము గాని.

ఆముష్మికము అనిత్యమెట్లా అయిందండీ అంటే స్వర్గలోక వాస సుఖముగాని, యక్షలోక సుఖముగాని - చాలామంది ఈ మధ్యకాలంలో కుబేరుణ్ణి పూజించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే కుబేరుణ్ణి పూజిస్తే ధనం బాగా ప్రాప్తించేస్తుందని అందరి అభిప్రాయం.

అయితే ఆయన ఇంకొక అవకాశాన్ని కూడా ఇస్తాడు. యక్షలోకాధీశ్వరుడు ఆయన. ఆ యక్షలోకంలో నీకు అవకాశాన్ని ఇస్తాడు. కాని యక్షులు అందరూ కూడా రాజసికమైనటువంటి గుణధర్మము కలిగినవాళ్ళు. వారు రాక్షసులకి అతి దగ్గరగా వుండేటటువంటివాళ్ళు.

కాబట్టి తమో గుణ సహకారాన్ని తమోగుణ సహవాసాన్ని కలిగించేటటువంటి వాళ్ళు. మరి ఉత్తర జన్మలలో ఏమౌతావు? అప్పుడు జన్మరాహిత్య పద్ధతిలో వెళ్ళలేవు కదా.

ఆత్మానుభూతికి చేరువ కాలేవు కదా. కాబట్టి ఎంతగా ఎవడైతే ఈ ధన గృహ ఆరామ క్షేత్ర అనిత్య సుఖ భోగ సంపద - సుఖ భోగ సంపద - వీటికి దూరంగా వుండమని పరమహంస చెప్తున్నారు. కాంత కనకం. ఇది చాలా ముఖ్యం.

వీటికి ఎవరైతే దూరంగా వుంటారో, వీటిని ఎవరైతే నిరసించి వుంటారో, వీటియందు ఆసక్తి లేకుండా వుంటారో, వీటిచేత ఉద్వేగం పొందకుండా వుంటారో, ఆఖరికి స్వర్గ సుఖం చేత కూడా నువ్వు ప్రేరేపించబడకుండా వుండాలి. అదికూడా కర్మఫలమే. కాబట్టి వాటిని అశాశ్వతములని ఎరుగవలెను. అతి ముఖ్యమైనదనమాట. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

05.Sep.2020

No comments:

Post a Comment