గీతోపనిషత్తు - 87


🌹. గీతోపనిషత్తు - 87 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀
25. చతుర్యజ్ఞములు - ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము. ఈ నాలుగు యజ్ఞములు దృఢవ్రతములుగ ప్రయత్నించు వారు కూడ దివ్యానుభూతిని పొందగలరు. 🍀

📚. 4. జ్ఞానయోగము - 28 📚


ద్రవ్యయజ్ఞ స్తపోయజ్ఞ యోగయజ్ఞా స్తథాల పరే |
స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశ్రితవ్రతాః || 28

ముందు శ్లోకముల యందు నాలుగు యజ్ఞములు తెలుపబడినవి. అవి వరుసగ బ్రహ్మ యజ్ఞము, దేవ యజ్ఞము, ఇంద్రియ యజ్ఞము, మనో యజ్ఞము. ఇపుడీ శ్లోకమున మరి నాలుగు యజ్ఞములు తెలుపబడినవి.

అవి వరుసగా ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము. ఈ నాలుగు యజ్ఞములు దృఢవ్రతములుగ ప్రయత్నించు వారు కూడ దివ్యానుభూతిని పొందగలరు.

1. ద్రవ్య యజ్ఞము :

తనకున్న సమస్త ఒనరులను సమర్పణ బుద్ధితో సద్విషయములకు వినియోగించుట ఒక మహత్తర యజ్ఞము. బలి, శిబి యిత్యాది మహాత్ములు ఈ యజ్ఞము ద్వారా దైవానుగ్రహ పాత్రులై, శాశ్వతులైరి.

2. తపో యజ్ఞము :

తపస్సు ఎందరినో దైవానుగ్రహ పాత్రు లను గావించినది. తపస్సు మూడు భాగములుగ నున్నది. శారీరక తపస్సు, వాజ్మయ తపస్సు, మనోమయ తపస్సు. ఈ సోపానముల ద్వారా మనస్సును దైవమున కర్పించి, స్థిరముగ చేయు తపస్సు వలన దైవ మనుగ్రహించును.

విశ్వామిత్ర మహర్షి తపస్సునకు పెట్టినది పేరు. ఆ మహర్షి చేసిన తపస్సు అనుపమానము. ఆయన యందు బ్రహ్మమును గూర్చిన తపనయే నిరుపమానమగు తపస్సుగ నడచినది. దైవమును గూర్చి తపన లేనిచో తపస్సు కుదరదు.

తపన యున్నవానికి దైవముచే పొందబడుటయే ప్రధానమగు కర్తవ్యమై, యితర వ్యాపారములను మాని రహస్య ప్రదేశమున తపస్సు చేయును. కలియుగమున మానవులకు ఇది దుష్కర విషయము. గౌతమబుద్ధుడీ మార్గముననే కలియుగమున సిద్ధి

పొందెను.

3. యోగ యజ్ఞము :

యోగమనగా అష్టాంగ యోగమే. ఇది సమగ్రముగ ఏడు సోపానములతో కూడిన మార్గమిది. ఎనిమిదవది సిద్ధి. దానిని సమాధి అందురు. కలియుగమున అష్టాంగ యోగమునకు జగద్గురువు మైత్రేయులు అధిపతిగ నున్నారు. పరమగురువు లందించు మార్గము అష్టాంగ యోగమే.

ఇందు యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము ఏడు సోపానములుగ నున్నవి. దీక్షతో క్రమముగ ఈ ఏడింటిని అధిగమించుట సక్రమమగు మార్గము. ఈ మార్గము సక్రమము కానిచో యోగము సిద్ధించదు. ఇది యొక యజ్ఞము.

4. స్వాధ్యాయము :

స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము కూడ దైవ సన్నిధికి చేర్చగలదు. వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు ఇత్యాది వాజ్మయమున రుచి కలిగి వాని నధ్యయనము చేసి, వాని యందలి అంతరార్థములను గ్రహించి, (గ్రహింపలేకున్నచో సద్గురువులను సేవించి, పూజించి, వారి అనుగ్రహముగ జ్ఞానము నుపదేశముగ పొంది) అందు అనుష్ఠానపరమైన విషయములను ఆచరణ మార్గమున కొనివచ్చి తాదాత్మ్యము చెందుట వలన, అజ్ఞానము తొలగి జ్ఞానము నిలచును. ఈ విధముగ కూడ దైవ సాన్నిధ్యము చేరవచ్చును.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


01 Dec 2020

No comments:

Post a Comment