శ్రీ శివ మహా పురాణము - 284


🌹 . శ్రీ శివ మహా పురాణము - 284 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

68. అధ్యాయము - 23

🌻. భక్తి మహిమ -2 🌻


ఆ సగుణ, నిర్గుణ భక్తులు రెండు నైష్ఠికి, అనైష్ఠికి అను భేదముచే మరల ఒక్కొక్కటి రెండు రకములుగా నున్నది. నైష్ఠికీ భక్తిలో ఆరు భేదములుండగా, అనైష్ఠికీ భక్తిలో ఒకే రకము గలదని పెద్దలు చెప్పెదరు (19).

ఆ సగుణ నిర్గుణ భక్తి మరల విహితము, అవిహితము అను భేదములను కలిగి బహు భంగుల నుండునని పండితులు చెప్పెదరు. దాని తత్త్వము మరియొక చోట వర్ణింపబడినది (20). ఓ ప్రియురాలా! ఆ సగుణ నిర్గుణ భక్తులు రెండింటికీ తొమ్మిదేసి అంగములు గలవని మునులు వర్ణించిరి. ఓ దక్షపుత్రీ! నేను ఆ నవాంగములను ప్రేమతో వర్ణించెదను వినుము (21).

శ్రవణము, కీర్తనము, స్మరణము, సేవనము, దాస్యము, అర్చనము, నన్ను సర్వదా నమస్కరించుట (22), సఖ్యము, ఆత్మార్పణము అనునవి తొమ్మిది అంగములని పండితులు చెప్పెదరు.

హే శివే! వాటికి అనేకములైన ఉపాంగములు కూడ చెప్పబడినవి (23). ఓ దేవీ! నా భక్తి యొక్క తొమ్మిది అంమగముల లక్షణములను వేర్వేరుగా చెప్పెదను. భక్తిని ముక్తిని ఇచ్చే ఈ అంగముల లక్షణములను నీవు సమాహితచిత్తముతో వినుము (24).

భగవత్కథను నిత్యము సమ్మాన పూర్వకముగా, నమస్కార పూర్వకముగా, స్థిరాసనముపై గూర్చుండి చెవులతో గ్రోలుట శ్రవణమనబడును (25). నా ఆవిర్భవమును, లీలలను హృదయాకాశములో దర్శించుచూ, ప్రీతితో వాటిని ఉచ్చరించుట కీర్తనమనబడును (26).

సర్వవ్యాపకుడనగు నన్ను నిత్యము సర్వత్రా దర్శించి, లోకములో సదా నిర్భయుడై ఉండుట స్మరణమని చెప్పబడినది (27). సూర్యోదయము మొదలుకొని సేవాకాలమునందు అంకిత భావముతో నిండిన హృదయముతో సర్వదా సేవకుని వలె అనుకూలముగ నండుటను శాస్త్రములు సేవనమని వర్ణించినవి (28).

హృదయములో అమృత రూపముగా అనుభవించుచూ, భగవంతుని ప్రియునిగా భావన చేయుటకు దాస్యమని పేరు. సర్వదా భృత్యుని వలె అనుకూలముగా నున్నవాడై పరమాత్మనగు నాకు యధావిధిగా (29),

పాద్యము మొదలగు షోడశోపచారములను చేయుట అర్చనమగును. వాక్కుచే యంత్రమును ఉచ్ఛరించి, మనస్సుచే ధ్యానించుచూ (30), అష్టాంగములచే భూమిని స్పృశించుట వందనమనబడును.

ఈశ్వరుడు నాకు మంగళమును గాని, అమంగళమును గాని దేవిని చేసిననూ, (31) సర్వము మంగళము కొరకే అనే విశ్వాసముసఖ్యము యొక్క లక్షణమగును. దేహము మొదలగు సర్వమును భగవానుని ప్రీతి కొరకు అర్పించి (32), దేహ నిర్వహణకు యత్నించకుండనుండుట ఆత్మ సమర్పణమనబడును. నా భక్తి కి సంబంధించిన ఈ తొమ్మిది అంగములు భుక్తిని ముక్తిని ఇచ్చునవి (33).

మరియు నాకు మిక్కిలి ప్రియమైనవి. జ్ఞానమును కలిగించునవి. నా భక్తియొక్క ఉపాంగములు అనేకము చెప్పబడినవి (34). బిల్వార్చన, సేవనము మొదలగు ఉపాంగనములను విచారణచేసి ఊహించదగును.

ఓ ప్రియురాలా! ఇట్టి అంగ, ఉపాంగములతో కూడిన భక్తి సర్వ శ్రేష్ఠము (35). జ్ఞానవైరాగ్యములకు తల్లి, ముక్తి దాసిగా గలది అగు భక్తి శోభిల్లుచున్నది. సర్వ కర్మల ఫలము భక్తి నుండి ఉద్భవించును. నాకు భక్తియందు సర్వదా నీతో సమమైన ప్రేమ గలదు (36).

ఎవని హృదయములో సర్వదా భక్తి ఉండునో, వాడు సర్వదా నాకు మిక్కిలి ప్రియుడు. ముల్లోకములలో భక్తివంటి సుఖకరమగు మార్గము లేదు (37).

ఓ దేవదేవీ! నాల్గు యుగములలో, విశేషించి కలియుగములో భక్తి చాలా గొప్పది. కలియుగమునందు జ్ఞానవైరాగ్యములు ఉత్సాహము లేనివై జవసత్త్వములుడిగి యుండును (38).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


01 Dec 2020

No comments:

Post a Comment