భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 172


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 172 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భరద్వాజ మహర్షి - 3 🌻

15. శ్రీమహావిష్ణువు వరాహమూర్తిగా, భూమిని మూలమ్నుంచీ ఎత్తాడు. ఇక్కడకూడా ఈ పందులు గడ్డికోసం భూమిని త్రవ్వుతూ ఉంటాయి. గడ్డిమొక్కలకు భూమిలో కాయలుంటాయి. ఆ కాయలు వాటికి ఆహారం. వీటికోసమని భూమిని సమూలంగా ఛేదిస్తుంది. అది దానిలక్షణం.

16. శత్రువృక్షాన్ని సమూలంగా అక్కడనుండి ఎత్తి పారేయాలి అన్నమాట. సమూలంగా ఛేదించాలి. దాని విత్తనంకూడా లేకుండా నాశనం చేయమని ఆయన ఉద్దేశ్యం. అడే ఆర్యధర్మం.

17. మన దేశ చరిత్రలో గతంలో అనేకమంది హిందూ మహారాజులు, శత్రువులు తమచేతికి చిక్కిన తరువాత వారిని శిక్షించకుండా క్షమించి, మర్యాద చేసి పంపిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే అది ఎంత తెలివితక్కువ పనో, ఆ తరువాత భారతదేశ చరిత్ర మనకు తెలియజేసింది. అలా చేసి ఆ హిందూరాజులు తమ దాక్షిణ్యం బయటపెట్టుకున్నారు కాని, వారు అలా చేసి ఉండకూడదు.

18. నీ మనసులో ఉండేటటువంటి కరుణ, విశాలదృష్టి శత్రువుదృష్టిలో, శత్రువు హృదయంలో లేకపోతే ఏమవుతావు నువ్వు? కాబట్టి శత్రువును ఉపేక్షించదం అనార్యపద్ధతి.

యుద్ధభూమిలో యుద్ధంచేయనని అర్జునుడు విషాదయోగం పూనినపుడు, ‘అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికరం అర్జునా’ అంటూ శ్రీకృష్ణుడు, ‘యుద్ధం చేయక పోవడాన్ని’ మూడు విశేషణాలతో ఖండించాడు.

19. ‘వీళ్ళందరూ నా బంధువులు కదా! వీళ్ళను సంహరిస్తే నాకు పాపం చుట్టుకుంటుంది’ లాంటి శాంతివచనాలు యుద్ధరంగంలో నిలుచుని పలకటమనేది ‘అనార్య జుష్టం అస్వర్గ్యం’ – అంటే, అది ఆర్యలక్షణంకాదని, స్వర్గాన్నివ్వదని; అంతేగాక ‘అకీర్తికరం’ – కీర్తినికూడా ఇవ్వదని కృష్ణభవానుని ఉద్బోధ. అలా భగవంతుడు రాజధర్మాలను క్షత్రియుడైన అర్జునుడికి బోధించాడు.

20. భరద్వాజమహర్షి సత్రుంజయుడికి ఇంకా రాజధర్మాలగురించి చెపుతున్నాడు: “నీ శత్రువుల ప్రసక్తి వచ్చినప్పుడు నువ్వు కోయిలవలే మాట్లాడాలి మధురంగా. నీ వాక్పారుష్యంచేత శత్రుత్వం పెంచవద్దు. యుద్దానికి నువ్వు మొదటి కారణం కావద్దు” అని. రాజు ఎప్పుడూ కూడా జాగ్రత్తలో ఉండాలి.

21. చతురంగబలాలు ఉన్నాయి కదా అని నిద్రపోకూడదు. తనచుట్టూ అనేకమంది పరివారం ఉన్నది కాబట్టే జాగ్రత్తగా ఉండాలి. అందులో ఎవరిలో ఏ విధమైన మనస్తత్వం ఉంటుందో తెలియదు. నమ్మితేనే మోసంచేయటం కుదురుతుంది. అందుకని ద్రోహమంటే నమ్మకద్రోహమనే అర్థం. ఈ ప్రకారంగా మనుష్యులు ఉంటారు. అందుకనే శత్రు పక్షంలో కోయిలవలె మధురంగా మాట్లాడాలి. శత్రువుల యడల దయాదాక్షిణ్యాలు ఉండకూడదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


01 Dec 2020

No comments:

Post a Comment