గీతోపనిషత్తు -120


🌹. గీతోపనిషత్తు -120 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 4

🍀. 3. కర్మ - జ్ఞానము - సాంఖ్యము - కర్మయోగము, జ్ఞానయోగము వేరువేరని భావించువారు పసివారు. ఇందే ఒక్క దానినైనను ఆచరించువాడు రెండవ దానిని కూడ పొందును. కర్మ జ్ఞానములు అవినాభావ సంబంధము కలిగియున్నవి. అవి అవిభక్తములు. కర్మయోగమున కర్మాచరణమునకు దైవము నాలుగు సూత్రముల నిచ్చినాడు. 1. నీకు కర్మ నిర్వర్తించు అధికారమున్నది. కర్మఫలములయందు నీ కధికారము లేదు. 2. కర్మము నిష్కామమే కావలెను. 3. కర్మ నిర్వహణమున వక్రమార్గముల ననుసరింపకుము. 4. ఫలితమాశింపక, వక్రత లేక కర్తవ్యకర్మను నిర్వర్తించు నపుడు ఫలితములు సామాన్యముగ, వైభవముగ నుండును. 🍀

4. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః |
ఏక మప్యాస్థితః సమ్య గుభయో ర్విందతే ఫలమ్ ||

కర్మయోగము, జ్ఞానయోగము వేరువేరని భావించువారు పసివారు. తెలిసినవారట్లు భావింపరు. ఇందే ఒక్క దానినైనను ఆచరించువాడు రెండవ దానిని కూడ పొందును. కర్మ జ్ఞానములు అవినాభావ సంబంధము కలిగియున్నవి. అవి అవిభక్తములు.

చేయుచు సాగువానికి చేయుట యందలి జ్ఞానము తెలియుచు నుండును. తెలుసుకొనుచు ఆచరించు వానికి ఆచరించుట యందలి నేర్పు కలుగును. ఆచరించుట, తెలియుట, తెలుసుకొనుచు ఆచరించుట రెండును అవిభక్తముగ సాగునే గాని తెలుసుకొనుట ముఖ్యమని, ఆచరించుట ముఖ్యమని విడదీయుట తెలియని తనము.

ఆచరించువాడు తెలుసుకొనుచు ఆచరించవలెను. తెలుసు కొనువాడు తెలుసుకొనుచు ఆచరించవలెను. ఇటొకదాని వెంట ఒకటి జరుగుటయే యుండును గాని, కేవలము తెలుసుకొని

ఆచరించకపోవుట, ఆచరించుచు తెలుసుకొనకపోవుట యుండదు. పశువులు సైతము ఆచరించుచు తెలుసుకొనుచు, తెలుసు కొనుచు ఆచరించుచు యుండును. ఇందులో ఏది ముఖ్యము? అను ప్రశ్న పసితనమే.

అర్జునుడు నరులకు ప్రతినిధి. నరులలో విపరీత వ్యాఖ్య చేయు వారుందురు. అట్టివారికి కూడ సమాధానము తెలియవలెనని అర్జును డట్లు ప్రశ్నించినట్లు గోచరించును.

కర్మయోగము లేని జ్ఞాన యోగము లేదు. అందులకే ముందు కర్మయోగము తెలుపబడినది. అటుపైన జ్ఞానయోగము తెలుపబడినది. పండు భుజించిన వానికి రుచిజ్ఞాన మెట్లును కలుగును. రుచి జ్ఞానము కలిగి, పండు భుజింపనిచో ఆ జ్ఞానము అనుభవైక జ్ఞానము కాక, మానసికముగనే యుండిపోవును.

పై కారణమున కర్మయోగమే శ్రేయస్కరమని దైవము గీతయందు పదే పదే పలుకుచుండును. ఆచరించుచు తెలుసుకొనుట సులభము. తెలుసుకొనువాడు ఆచరించుట మాని యింకను తెలుసుకొనవలెనని భ్రాంతిపడుట భ్రష్టతను కలిగించును. తెలిసినంతమేర ఆచరించుట అవసరము. మొత్తము తెలిసిన వెనుక ఆచరింతు ననువాడు మూర్ఖుడు. తెలిసినది ఆచరించుచుండగ మరికొంత తెలియుట యుండును.

గాలిని పీల్చుచు వదలుచు నుండవలెను గాని, రోజు మొత్తమున కొక్కమారు పీల్చి, ఒక్కమారు వదలుట సాధ్యమా? చీకటిలో చిన్న దీపము ఒకటి రెండడుగుల మేర దారి చూపును. ఒక మైలు దూరము ఈ చిన్న దీపముతో ఎట్లు ప్రయాణము చేయగలను అనుకొనువాడు మూర్ఖుడు.

దీపము చూపునంతమేర నడచినచో మరి రెండడుగుల మార్గము కనుపించును. కేవల మాలోచించు వానికి నడక సాగదు. చిన్న దీపపు కాంతితో పెద్ద అడవిని కూడ దాటవచ్చును. అతి చిన్నదియైన నావతో పెద్ద నదిని దాటవచ్చును.

ఆచరణ వలన జ్ఞానము లభించుచునే యుండును. అనుభవైక జ్ఞానము నుండి మరికొంత ఆచరణ, మరికొంత జ్ఞానము లభించు చుండును. అట్లుకాక మీన మేషములు లెక్కించుచు చతికిల పడువానికి జ్ఞానయోగము లేదు. కర్మభ్రష్టత వలన జీవితము కూడ చెడును. ఆచరించుచు సాగువానికి జ్ఞానము కలుగుచు నుండును.

కర్మయోగమున కర్మాచరణమునకు దైవము నాలుగు సూత్రముల నిచ్చినాడు. అవి వరుసగా యిట్లున్నవి.

1. నీకు కర్మ నిర్వర్తించు అధికారమున్నది. కర్మఫలములయందు నీ కధికారము లేదు. కావున ఫలముల కాశించుచు కర్మము నిర్వర్తించుట వలదు.

2. కర్మము నిష్కామమే కావలెను.

3. కర్మ నిర్వహణమున వక్రమార్గముల ననుసరింపకుము. అట్లు చేసినచో కర్మ నిన్ను బంధించగలదు.

4. ఫలితమాశింపక, వక్రత లేక కర్తవ్యకర్మను నిర్వర్తించు నపుడు ఫలితములు సామాన్యముగ, వైభవముగ నుండును. వైభవము, శోభనములకు ఆకర్షింపబడక కర్తవ్యకర్మ యందు కొనసాగుము.

పై విధముగ నాచరించు వానికి కర్మాచరణము సుఖము నిచ్చును. ఆచరణయందే సుఖమున్నదని, ఫలితముల యందు కాదని తెలియును. అట్లాచరించు వారు జ్ఞానయోగమున తెలిపిన పండ్రెండు కర్మ యజ్ఞములను ఆచరించు సమర్థతను పొందుదురు.

ఆచరణమున పరహితము మెండై, స్వహితము మరుగున పడుచుండును. ఆచరణయందు పవిత్రత పెరుగుచునుండుగ, రాగ ద్వేషములు లేని ఆచరణ సిద్ధించును. అదియే సన్న్యాసమని ముందు శ్లోకమున దైవము తెలిపినాడు.

జ్ఞానము, ఆచరణము, సమన్వయింప బడినపుడు ఏర్పడు వైరాగ్యము కారణముగ జీవుడు పొందు స్థిరతయే సాంఖ్యము. అదియే యోగస్థితి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


10 Jan 2021

No comments:

Post a Comment