కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 158


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 158 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 88 🌻


నిత్యానిత్య, ఆత్మానాత్మ, సదసద్‌, కార్యకారణ, దృక్‌ దృశ్య వివేకములనేటటువంటి పద్ధతులుగా దీనిని ఏ వివేక పద్ధతిలోకి వస్తుందో విచారణ చేసుకుని, ఆ విచారణ ద్వారా ఏది ప్రధానమో దానిని గ్రహించి, ఏది అప్రధానమో దానిని త్యజించాలి. భాగత్యాగ నిర్ణయము అంటారు.

ఈ భాగత్యాగ నిర్ణయము లేకపోతే, వివేకము అసాధ్యము. అవివేకమే ఉంటుంది ఎప్పటికి కూడా. అజ్ఞానమే ఉంటుంది ఎప్పటికి కూడా. అవిద్యే ఉంటుంది ఎప్పటికి కూడా. బంధమే ఉంటుంది ఎప్పటికి కూడా. కాబట్టి, అవివేకాన్ని, అజ్ఞానాన్ని, అనాత్మని, అవిద్యని, బంధాన్ని - వీటన్నింటినీ తొలగించగలిగేటటువంటి ఏకైక వజ్రాయుధం వివేకం – జ్ఞానం.

కాబట్టి, అట్టి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఎవరైతే సంసిద్ధులై ఉన్నారో, అట్టి ఆత్మోపరతియందు స్థితుడైయున్నాడో, అట్టి ఆత్మోపవస్తు లబ్ధిచే మాత్రమే సంతుష్టత చెందేటటువంటి లక్షణం ఎవరికైతే ఉందో, అటువంటి తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అటువంటి సచ్ఛిష్యుడు ఎవరైతే ఉన్నారో, అటువంటి ఉత్తమ తరగతికి సంబంధించిన సాధకుడు ఎవరైతే ఉన్నారో, అతడు ఆభాసయుతమైనటువంటి ప్రతిబింబ సహితమైనటువంటి అనాత్మ వస్తువులచేత, సంతుష్టత చెందడం లేదు.

అవి ఏనుగుపై ఒక మనిషి నిలబడి ఒక రత్నాన్ని గాలిలోకి విసిరితే ఎంత ఎత్తుకు వెళ్తుందో, అంత ఎత్తు ధనరాశిని నీకెచ్చదన్ననూ, అఖండ మండలాకారముగా వ్యాపించి ఉన్నటుంవంటి, భూమండలాధిపత్యమును నీకిచ్చెదనన్ననూ, పిపీలికాది బ్రహ్మపర్యంతమూ వ్యాప్తమై ఉన్నటువంటి సమస్త జీవ తను చతుష్టయాధిపత్యమును ఇస్తాను అని అన్నప్పటికినీ,

సకల చతుర్దశ భువనాధిపత్యమును ఇస్తాను అనేటటువంటి ఆధిపత్యమును ఇస్తానన్నప్పటికి ఎవరైతే అవుననడో, ఎవరైతే వాటిని తృణప్రాయముగా, గడ్డిపోచవలె చూస్తాడో, అటువంటి తీవ్ర వైరాగ్యోపరతుడు మాత్రమే, అటువంటి కాంక్షారహితుడు మాత్రమే, అటువంటి మనోవాసనారహితుడు మాత్రమే, అటువంటి వివేకశీలి మాత్రమే, ఈ ఆత్మవస్తువును పొందగలుగుచున్నాడు. - విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


10 Jan 2021

No comments:

Post a Comment