శ్రీ శివ మహా పురాణము - 320
🌹 . శ్రీ శివ మహా పురాణము - 320 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
80. అధ్యాయము - 35
🌻. విష్ణువు పలుకులు - 3 🌻
హే దక్షా! ఈనాడు ఈతనిని ఆపగలిగే శక్తి నాకు లేదు. ఎందువలననగా, నేను ఆ శపథమును ఉల్లంఘించి శివద్రోహము చేసితిని (37). మహేశ్వరుని విషయంలో ద్రోహము చేసిన వారికి మూడు కాలములయందైననూ సుఖము లేదు. అందువలన నీతో బాటు నేను కూడా ఈనాడు దుఃఖమును పొందుట నిశ్చయము (38).
సుదర్శనమను పేరు గల ఈ చక్రము ఈతనియందు తగుల్కొనదు. ఇది శైవచక్రము. కాన ఇది శివభక్తులు కాని వారని మాత్రమే సంహరించును (39). వీరభద్రుడు లేకున్ననూ ఈ ఈశ్వర చక్రము ఇపుడు శీఘ్రముగా మనలను సంహరించి శివుని వద్దకు వెళ్లగల్గును (40).
శివునికి సంబంధించిన శపథమును ఉల్లంఘించియున్న నన్ను ఇట్టి ఈ చక్రము ఇంకనూ సంహరించక పోవుటను గొప్పదయగా భావించవచ్చును (41). ఈపైన ఈ చక్రము నా వద్ద నిశ్చయముగా ఉండబోదు. ఇది ఇప్పుడే అగ్నికీలలను వెళ్లగ్రక్కుచూ శీఘ్రముగా వెళ్లగలదు (42).
మనము వెంటనే వీరభద్రుని ఆదరముతో పుజించి ననూ, మహాక్రోధముతో నిండియున్న ఆతడు మనలను రక్షించడు (43). అయ్యో! అయ్యో! మనపై ఈ అకాల ప్రళయము వచ్చి పడినది. ఇపుడు నీవు, మేమూ కూడ వినాశము యొక్క ముంగిట నున్నాము (44). ఈ ముల్లోకములలో మాకిపుడు శరణము నిచ్చువాడు లేనే లేడు. శివద్రోహికి లోకములో శరణము నిచ్చువాడు ఎవడు ఉండును? (45)
ఈ దేహము నశించిననూ మనకు యమయాతనలు తప్పవు. యముడు పెట్టే యాతనలు అధిక దుఃఖమును కలిగించును. వాటిని సహింప శక్యము కాదు (46). యముడు శివద్రోహిని చూచి పళ్లను కొరికి స్వయముగా కాగుచున్న నూనెతో నిండిన గుండిగలలోనికి విసిరివేయును. దానిని తప్పించుకొనుట అసంభవము (47).
ఆ శపథము అయిన వెంటనే నేను వెళ్లి పోవుటకు సంసిద్ధుడనైతిని. అయిననూ, చెడు సహవాసము అను పాపము వలన వెంటనే వెళ్లలేకపోయితిని (48). మనము ఇపుడు ఇచట నుండి పారిపోయిననూ, శర్వుని కుమారుడగు వీరభద్రుడు శస్త్రములచే మనలను ఆకర్షించగలడు (49).
స్వర్గము గాని, భూమిగాని, పాతాళముగాని, మరియొక స్థలము ఏదైన గాని, శ్రీ వీరభద్రుని శస్త్రములు చొరరాని స్థలము లేదు (50). త్రిశూలధారియగదు శ్రీ రుద్రుని గణములు ఎందరు గలరో, వారందరికి నిశ్చయముగా ఇటువంటి శక్తియే గలదు (51).
రీ కాలభైరవుడు పూర్వము కాశీలో బ్రహ్మయొక్క అయిదవ శిరస్సును గోటికొనతోటి మాత్రమే లీలగా దునిమెను (52). విష్ణువు ఇట్లు పలికి అచట నిలబడి యుండెను. ఆతని ముఖ పద్మము మిక్కిలి భయమును కలిగియుండెను. అదే సమయములో వీరభద్రుడు యజ్ఞశాలకు వచ్చెను (53). గోవిందుడిట్లు పలుకు చుండగనే, సైన్య సముద్రము వీరభద్రునితో గూడి అచటకు వచ్చెను. దేవతలు మొదలగు వారా సైన్యమును చూచిరి (54).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండలో సత్యుపాఖ్యానము నందు విష్ణువాక్యవర్ణనమనే ముప్పది అయిదవ అధ్యాయము ముగిసినది (35).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
10 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment