గీతోపనిషత్తు -168
🌹. గీతోపనిషత్తు -168 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 11
🍀 11. స్థిరాసనము -2 - ఆసన మనగ కూర్చుండు పద్దతి. అది స్థిరముగ, నిశ్చలముగ నుండవలె నన్నచో దేహమునకు సుఖమిచ్చునదిగ నుండవలెను. లేనిచో సాధకు డటునిటు కదలుట తప్పనిసరియై, మనస్సును ఆత్మపై లగ్నము చేయుటకు వీలుపడదు. ధ్యానమునకు ప్రధానముగ వలసినది, మనస్సును ఆత్మపై లగ్నము చేయుట. అటుపైన మనస్సును స్థిరమగు ప్రదేశమున అంత రంగమున లగ్నము చేయుట నిజమగు ఆసన మగును. మనసును హృదయము నందు గాని, భ్రూమధ్యము నందు గాని స్థిరముగ లగ్నము చేయుటకు ప్రయత్నము సాగవలెను. 🍀
3. సాధకుడు స్థిరాసనమును ఏర్పరచుకొనవలెను. ఆసన మనగ కూర్చుండు పద్దతి. అది స్థిరముగ, నిశ్చలముగ నుండవలె నన్నచో దేహమునకు సుఖమిచ్చునదిగ నుండవలెను. లేనిచో సాధకు డటునిటు కదలుట తప్పనిసరియై, మనస్సును ఆత్మపై లగ్నము చేయుటకు వీలుపడదు. పూర్వకాలమున పద్మాసనము వేసు కొనెడివారు.
అట్లే వీరాసనము కూడ వాడుక యందుండెడిది. ప్రస్తుతము జీవన విధానము ననుసరించి నేలపై కూర్చుండు అలవాటు తప్పుటచే, ఎవ్వరును పై తెలిపిన విధముగ కూర్చుండుట లేదు.
ఆసన మేదైనను అది ప్రధానముగ దేహమునకు స్థిరత్వము నీయవలెను. భగవద్గీత యందు స్థిరమాసనమే తెలిపిరి గాని, ప్రత్యేకముగ ఏ ఆసనమును నిర్దేశించ లేదు. ధ్యానమునకు ప్రధానముగ వలసినది, మనస్సును ఆత్మపై లగ్నము చేయుట.
ఆ ప్రయత్నమున దేహమున కంతరాయము కలిగింపరాదు. ఇది ప్రధానమని సాధకుడు తెలియవలెను. దేహస్థిరత్వము, మనో స్థిరత్వము ధ్యానమునకు ప్రధానమగు లక్షణములు.
అందువలన కొందరు సద్గురువులు పరుండబెట్టి ధ్యానము నిత్తురు. మరి కొందరు కూర్చుండబెట్టి నిత్తురు. ఆసన మేదైనను ఒక గంట సమయము దేహమును కదపనవసరము లేనిదై యుండవలెను.
అటుపైన మనస్సును స్థిరమగు ప్రదేశమున అంత రంగమున లగ్నము చేయుట నిజమగు ఆసన మగును. మనసును హృదయమునందు గాని, భ్రూమధ్యమునందు గాని స్థిరముగ
లగ్నము చేయుటకు ప్రయత్నము సాగవలెను.
అట్టి స్థిరత్వము మనస్సునకు కలుగుటకు వలసిన లక్షణము లన్నియు ముందు శ్లోకములలో ఇప్పటికే తెలుపబడినవి. వాటిని పాటించినపుడే మనస్సునకు స్థిరాసనము ఏర్పడును. ఇట్లు ఈ శ్లోకమున స్థిరాసనము దేహమునకు, మనస్సునకు కూడ సూచింపబడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
09 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment