శ్రీ శివ మహా పురాణము - 368


🌹 . శ్రీ శివ మహా పురాణము - 368 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

96. అధ్యాయము - 08

🌻. నారద హిమాలయ సంవాదము - 3 🌻


ఓ మహర్షీ!ఇచటకు విచ్చేసి నాతో ప్రీతిగా మాటలాడే కిన్నరుల ముఖము నుండి నేను అనేక పర్యాయములు ఇట్లు వినియుంటిని. ఈ మాట అసత్యము అనుట నిశ్చయమేనా? (40). ఆయనకు హరుడని పేరు గలదు. ఆ పేరును బట్టి (హరించువాడ హరుడు) ఆయన అట్టి వాడే అయి ఉండునని లోకములో వినబడు చున్నది. ఆయన పూర్వము ఒక ప్రతిజ్ఞను చేసినాడట. దానిని చెప్పెదను వినుము (41).

'దక్షపుత్రీ! సతీ! ప్రియురాలా! నిన్ను తక్క మరియొక స్త్రీని నేను భార్యగా స్వీకరించను. వరించను. నేను సత్యమును చెప్పుచున్నాను' (42). ఇట్లు ఆయన పూర్వమే సతీదేవి ఎదుట ప్రతిజ్ఞను చేసియున్నాడు. ఆమె మరణించినది. ఇపుడాతడు మరియొక స్త్రీని ఎట్లు వివాహమాడగలడు? (43)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ హిమవంతుడు నీ ఎదుట ఇట్లు పలికి మిన్నకుండెను. ఓ దేవర్షీ! నీవా మాటను విని,యధార్ధమును నిశ్చయించి, అతనితో నిట్లంటివి (44).

నారదుడిట్లు పనికెను-

ఓ పర్వతరాజా! మహాత్మా! నీవు చింతిల్లకుము.న నీ కుమార్తె యగు ఈ కాళియే పుర్వము దక్ష పుత్రియై జన్మించెను (45) సర్వకాలములలో సర్వమంగళములనిచ్చే సతియను పేర ఆమె అపుడు ప్రసిద్ధిగాంచెను. ఆ సతి దక్ష పుత్రియై రుద్రునకు పత్ని ఆయెను (46).

ఆ సతి తండ్రి చేసిన యజ్ఞములో శంకరునకు అనాదరము జరుగుటను గాంచి కోపమును చెంది దేహమును త్యజించెను (47). జగన్మాతయగు ఆ శివాదేవియే మరల నీ గృహములో జన్మించినది. ఈ పార్వతి శివుని పత్ని యగుననుటలో సందేహము లేదు(48).

ఓ సహర్షీ! నీవు ఈ వృత్తాంతమునంతనూ ఆ పర్వత రాజునకు చెప్పితివి. నీవు చెప్పిన ఆ పూర్వ చరిత్ర పార్వతికి మహానందమును కలిగించెను(49). హిమవంతుడు. ఆయన భార్య,కుమారులు మహర్షి ముఖము నుండి కాళిక యెక్క ఆ పూర్వ వృత్తాంతము నంతయూ విని, సంశయములను వీడిరి (50).

అపుడు నారదుని ముఖము నుండి ఆ గాధను విని కాళిక సిగ్గుతో తలను వంచుకొనెను.ఆమె ముఖము చిరునవ్వుతో విప్పారెను (51). ఆ చరిత్రను విని హిమవంతుడు ఆమెను చేతితో స్పృశించి, శిరస్సు పై ముద్దాడి తన ఆసన సమీపములో కూర్చుండబెట్టు కొనెను (52).

ఓ మహర్షీ! అచటనున్న అమెను చూచి నీవు మరల ఇట్లు పలికితివి. నీ పులుకులు హిమవంతునకు, మేనకు, వారి కుమారులకు ఆనందమును కలిగించినవి(53).

ఓ పర్వతరాజా! ఈ పైన ఈమె యొక్క సింహాసనము సర్వదా శివుని ఊరువులు కాగలవు(54). నీ కుమార్తె శవుని ఊరువులు అనే ఆసనమును సర్వకాలముల యందు పొంది, ఎవ్వరి తృష్టికి గాని, మనస్సుల కైననూ గాని గోచరము గాని స్ధానమును పొందగలదు (55).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ నారదా! నీవు ఈ విధముగా పర్వతరాజుతో ఉదారమగు వచనములను పలికి వెంటనే ఆనందముతో స్వర్గమునకు వెళ్లి యుంటివి. ఆ హిమవంతుడు ఆనందముతో నిండిన హృదము గలవాడై సర్వ సంపదలతో నలరారు తన గృహమునకు వెళ్లెను(56).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో నారద హిమాలయ సంవాద వర్ణనమనే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


09 Mar 2021

No comments:

Post a Comment