‘‘ఎంపిక లేని ఎరుకతోనే పూర్తి స్వేచ్ఛ’’


🌹.‘‘ఎంపిక లేని ఎరుకతోనే పూర్తి స్వేచ్ఛ’’ 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


ఒకడు ఒక గురువును కలిసి ‘‘మనిషి పూర్తి స్వతంత్రుడు, స్వేచ్ఛాపరుడేనా లేక అందుకు పరిమితులేమైనా ఉన్నాయా లేక స్వేచ్ఛను హరించే అలాంటి పరిమితులను మించిన దేవుడు, విధి, అదృష్టం, ప్రారబ్ధం లాంటివి ఉన్నాయా?’ ’అని అడిగాడు.

వెంటనే ఆ గురువు తనదైన పద్ధతిలో ‘‘లేచి నిలబడు’’ అన్నాడు.

వెంటనే అతను గురువు చెప్పినట్లు లేచి నిలబడ్డాడు.

‘‘ఇప్పుడు నీ రెండు కాళ్ళలో ఒక కాలు పైకెత్తు’’అన్నాడు గురువు.

వెంటనే అతను కుడి కాలు పైకెత్తి ఒంటి కాలిపై నిలబడ్డాడు.

‘‘ఇప్పుడు ఆ రెండవ కాలు కూడా పైకెత్తు’’ అన్నాడు గురువు. వెంటనే అతను ‘‘నేను చెయ్యలేని పనిని మీరు చెయ్యమంటున్నారు’’ అన్నాడు.

ఇంతకుముందు ‘‘నీ రెండు కాళ్ళలో ఒక కాలు పైకెత్తు’’ అని నేను అన్నప్పుడు నీకు పూర్తిస్వేచ్ఛ ఉంది కాబట్టి నీ కుడి కాలును పైకెత్తావు. నువ్వు తీసుకున్న ఆ నిర్ణయమే ఇప్పుడు నీ ఎడమ కాలును పైకెత్తలేకుండా చేసింది.

కాబట్టి, మీరు ఏ పనిచేసినా అది దానికి వ్యతిరేకమైన పని చెయ్యకుండా మిమ్మల్ని అడ్డుకుంటుంది. అంటే ప్రతి పనికి పరిమితి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది కదా! కానీ, జీవితంలో ఎవరూ ఒంటి కాలిపై నిలబడలేరు కాబట్టి, అది అంత స్పష్టంగా కనిపించదు. అయినా ప్రతి పనికి, ప్రతి నిర్ణయానికి పరిమితులుంటాయి.

కాబట్టి, దేవుడు, విధి, ప్రారబ్ధం, అదృష్టాల గురించి అనవసరంగా చింతించకుండా మామూలు విషయాలపై మనసు పెట్టు’ అన్నాడు గురువు అతనితో.

నిర్ణయం తీసుకునేముందు మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకోగానే, ఆ నిర్ణయమే, ఆ ఎంపికే దాని పరిమితులను మీ ముందు ఉంచుతుంది. అది సహజం.

అంతేకానీ, పరస్పర విరుద్ధమైన నిర్ణయాలను మీరు ఏక కాలంలో ఒక్కసారిగా తీసుకోలేరు. అలా తీసుకోలేక పోవడం మంచిదే. అది కేవలం అస్తిత్వపరమైన సురక్షిత కొలమానం. లేకపోతే అసలే గందరగోళంలో ఉన్న మీరు మరింత గందరగోళంలో పడతారు. అప్పుడు మీకు పిచ్చెక్కుతుంది. కాబట్టి, మీ నిర్ణయానికి ఎవరూ బాధ్యులు కారు.

ఎంపిక విషయంలో మౌలికంగా మీరు పూర్తి స్వేచ్ఛాపరులే అయినా, ఆ ఎంపికే మీకు పరిమితులను విధిస్తుంది. కాబట్టి, మీరు పూర్తి స్వేచ్ఛాపరులుగా ఉండాలనుకుంటే ఎంపిక చెయ్యడం మానండి. అప్పుడే ఎలాంటి ఎంపికలు లేని ఎరుకకు సంబంధించిన బోధనలు మీ తలకెక్కుతాయి.

‘‘ఎంపికలు మాని ఎప్పుడూ ఎరుకలో ఉండండి’’ అని గొప్ప గొప్ప గురువులందరూ ఎందుకన్నారో తెలుసా? ఎంపిక చేసిన మరుక్షణం మీరు మీ స్వేచ్ఛను పూర్తిగా కోల్పోతారు. అప్పుడు ఎంపిక చేసుకున్నది మాత్రమే మీ దగ్గర మిగులుతుంది.

కాబట్టి, మీరు ఎలాంటి ఎంపికలు లేని వారైతే, మీ స్వేచ్ఛ మీకు పూర్తిగా దక్కుతుంది. కాబట్టి, ఎలాంటి ఎంపికలులేని ఎరుకకు మాత్రమే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మిగిలినవన్నీ పరిమితులతో కూడుకున్నవే.

మీ ముందు చాలా అందమైన నిరుపేద స్త్రీ, చాలా వికారంగా ఉండే ధనవంతురాలైన స్త్రీ ఉన్నారు. వారిలో ఒకరిని ఎంచుకుని ఆమెను మీరు ప్రేమించాలి. ఎవరిని ఎంచుకున్నా మీకు బాధ తప్పదు. ఎందుకంటే, ఒకవేళ మీరు చాలా అందంగా ఉండే నిరుపేద స్త్రీని ఎంచుకుంటే దరిద్ర బాధలు తప్పవు. మీరు కారు కొనలేరు, ఇల్లు కొనలేరు, ఏమీ చెయ్యలేరు. పైగా, అనవసరంగా అనేక సంపదలు వచ్చే అవకాశాన్ని కోల్పోయారని తరువాత బాధపడతారు.

ఎందుకంటే, కొన్ని రోజుల తరువాత ఆ అందం పాతదైపోతుంది. తరువాత దానితో ఏం చెయ్యాలో తెలియక తల బాదుకుంటారు. అంతకన్నా మీరు ఏమి చెయ్యగలరు? అప్పుడు మీ మనసు ‘‘అనవసరంగా తప్పుగా ఎంచుకున్నాను’’ అని భావించడం ప్రారంభిస్తుంది.

ఒకవేళ మీరు చాలా అసహ్యంగా ఉండే ధనవంతురాలైన స్ర్తిని ఎంచుకుంటే ఆమె డబ్బుతో మీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు. కానీ, చాలా వికారంగా ఉండే ఆమె రూపాన్ని మీరు ఏమాత్రం అసహ్యించుకోకుండా భరించాల్సి వస్తుంది.

ఎందుకంటే, అసహ్యించుకోవడం కూడా ఒక రకమైన అనుబంధమే. అంతేకాదు, ‘‘నిన్ను ప్రేమిస్తున్నాను’’ అని కూడా ఆమెతో చెప్పాల్సివస్తుంది. కానీ, ఆమె డబ్బుతో కొన్నవాటితో మీరు ఏమాత్రం ఆనందించ లేరు. ఎందుకంటే, ఆమె వికార రూపం మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. మీరు కేవలం డబ్బుకోసమే ఆమెను పెళ్ళిచేసుకున్నారన్న సంగతి ఆమెకు తెలుసు.

అందువల్ల ఆమె మిమ్మల్ని ఒక పనిమనిషిగానే చూస్తుంది తప్ప, ప్రియునిగా చూడలేదు. అప్పుడు మీరు ఆమెను ప్రేమించలేదని, అందంగా ఉండే డబ్బులేని అమ్మాయిని ప్రేమిస్తే కనీసం ఆమె అందమైనా దక్కేదని, కేవలం డబ్బుకోసం కురూపిని కోరుకోవడం మూర్ఖత్వమని భావిస్తారు. ఇది సత్యం.

కాబట్టి, వారిలో ఎవరిని ఎంచుకున్నా మరొకరు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. అందువల్ల మీకు పశ్చాత్తాపం తప్పదు. కాబట్టి, పూర్తి స్వేచ్ఛ కోరుకునే వారికి ఉన్న ఏకైక మార్గం ‘‘ఎంపికలేని ఎరుక’’ ఒక్కటే.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


09 Mar 2021

No comments:

Post a Comment