భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 248


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 248 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. జడమహర్షి - 3 🌻


12. మనలో ఎవరికైనా చావు గురించి జ్ఞాపకం ఉందా? ఎవరికీ లేదు. అందుకనే సుఖంగా ఉన్నాము. కానీ దాని లక్షణము ఇలా ఉంటుందని పెద్దలు చెప్పినప్పుడు, పునర్జన్మ తనకు వద్దు అనేటటువంటి తీవ్రమయిన సంకల్పం మినిషికి కలగాలి. అదే వివేకం.

13. అందుకనే జడమహర్షి చెపుతున్నాడు ఇదంతా. “మోక్షం కోసమయినా, మృత్యువాతను తప్పించుకోవటం కోసమయినా మనుష్యుడు పురంజన్మ లేకుండా చేసుకోవాలి. మృత్యువు యొక్క బాధ అంత భయంకరమైనది.

14. ముక్తి యందు ఆసక్తి అనేది ఉన్నాలేక పోయినా, అది వేరే విషయం. మృత్యువు యొక్క బాధ ఇలా ఉంటుందని పెద్దలు చెపుతున్నారు. ఏమయినప్పటికీ మరణించిన తరువాత యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన పుణ్యానికి పుణ్యఫలం, పాపానికి పాపఫలం ఇస్తాడు. అదెట్లాగూ తప్పదు.

15. కానీ, ఇది అయిపోయిన తరువాత జీవుడు మళ్ళీ ఇంకొక పురుషుడి వీర్యంలో ప్రవేశిస్తాడు. స్త్రీగర్భంలోకి వెళతాడు, మళ్ళీ పుడతాడు. అప్పటికే అంతా మరచిపోతాడు. యమదర్శనం, చావు, దుఃఖము, కష్టము, పోయిన జన్మలో తల్లి తండ్రులు, వళ్ళెవరు వీళ్ళెవరు – అన్నీపోతాయి. మరచిపోతాడు. అవి ఏవీ మిగలవు. పలక మీద వ్రాసి, తడితో చెరిపేస్తే ఏం మిగులుతుందో, ఇదీ అంతే! అతడి మనస్సులో ఏమీ ఉండదు.

16. “కాబట్టి ఇదంతా ఒక భయంకరమయిన మాయాజాలం. ఈ వలలో తగులుకున్న వాళ్ళు బయటికి రాలేరు. ఎప్పుడయితే గురువును ఆశ్రయించి బోధ పొందుతాడో, అప్పుడే ఇది తప్పుతుంది. గురువును ఆశ్రయిస్తే, మార్గాన్ని అన్వేషించమనేదే ఆయన చెప్పవలసింది. ఎందుకంటే హితబోధ ఎవ్వరయినా చేయగలరు.

17. హితైషి ఏం చెపుతాడంటే, నీ విషయం అన్వేషించుకో! నీ మంచి, నీ భవిష్యత్తు ఆలోచించుకో! సమయం ఆసన్నమవుతున్నది. దినదినము మృత్యువు దగ్గరికి వెళుతున్నావు. జాగ్రత్తపడు – చెప్పినవాడే నీకు ఆప్తుడనుకో.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


09 Mar 2021

No comments:

Post a Comment