గీతోపనిషత్తు - సాంఖ్య యోగము : 3. శరణాగతి - నిన్ను శరణు పొందితిని అని అర్జునుడు ప్రార్థించెను. తరించెను.

🌹 3. శరణాగతి - నిన్ను శరణు పొందితిని అని అర్జునుడు ప్రార్థించెను. తరించెను. 🌹
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 3 📚
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మనోవ్యాకులతను చెందినవాడు, మోహమున పడినవాడు, పిరికితనముచే భయము ఆవహించిన వాడు , శోకతప్త హృదయమును దుర్బలత్వమునకు తాకట్టు పెట్టిన వాడు, అవగాహన యందు తికమక గలవాడు, కర్తవ్యమును గ్రహింప లేనివాడు, విచక్షణను కోల్పోయిన వాడు, ధర్మ విషయమున సందేహము కలిగి సంకటమున పడినవాడు, అట్టి విషమస్థితి నుంచి బైట పడుటకు తెలిసిన వారిని ఆశ్రయించవలెను.

ఈ ఉపాయమును గీత నిస్సందేహముగ స్థాపించుచున్నది. గీతోపాయమును అందుకొనిన బుద్ధిమంతునకు తన గీత మారగలదు.

కార్పణ్య దోషోపహతస్వభావః

పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాం |

యచ్ఛ్రేయ స్స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే

శిష్యస్తే-హం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌ || 7

అర్జునుడు కోరుటయే అతనికి తరణోపాయమును చూపినది.

నేను నీకు శిష్యుడను, నన్నాజ్ఞాపింపుము, నిన్ను శరణు పొందితిని అని అర్జునుడు ప్రార్థించెను. తరించెను.

మనము కూడ క్లిష్ట సమయముల యందు పఠింపవలసిన ఏకైక మంత్ర మిదియే.

భగవంతుని సంబోధించుచూ '' నేను నీ శిష్యుడను, నిన్ను శరణాగతి చెందితిని, నన్ను శాసింపుము'' అని మరల మరల ప్రార్థింపవలెను. ఈ ప్రార్థన ఎంత ఆర్తితో చేసినచో అంత పరిష్కారము దొరుకుటకు వీలుపును. అర్జునుడు తానేమి చేయవలెనో తెలియగోరు చున్నాడు. చేసిపెట్టమని అడుగుట లేదు.

సోమరితనము కలిగినవాడు గురువు తనకు చేసిపెట్ట వలెనని ఎదురు చూచుచుండును. దారి చూపుటయే గురువు వంతుకాని నడచుట శిష్యుని వంతుయే. ఇట్టి గురుశిష్య సంప్రదాయమును అందించిన ఉత్తమమైన సంప్రదాయము మనది.

శరణాగతి చెందిన శిష్యునకు గురువు బోధ చేయుటకు ఉన్ముఖుడగును. ఉపాయమును చూపిన గురువుయందు సందేహము పుట్ట కూడదు. సందేహమున్నచో గురువునే అడిగి పరిష్కరించు కొనవలెను గాని, ఇతరులతో చర్చించుట, సంప్రదించుట నీచము.

అర్జునుడు కర్తవ్యమును సంపూర్ణముగ నెరుగుటకు శ్రీకృష్ణుని మరల మరల ప్రశ్నించెను. అది పరిప్రశ్నమే. ''పరిప్రశ్నము చేయు శిష్యునియందు సద్గురువునకు వాత్సల్యము హెచ్చగును. పరిప్రశ్నము లేక గురువును ప్రశ్నింపరాదు.

పరిప్రశ్నము చేసినపుడు సద్గురువైనచో కోపము రాదు. గురువునకు కొన్ని అర్హతలు కలవు. సద్గురువు తపస్వి అయి వుండవలెను. తనను తాను తెలిసినవాడై వుండవలెను. ధర్మము నాచరించువాడై యుండవలెను.

ఈ గురుశిష్య సంబంధము అత్యంత పవిత్రము. దీనిని నిర్మలముగ నుంచుకొనుట శ్రేయస్కరము. క్లుప్తముగ నుంచుకొనుట మరియు శ్రేయస్కరము. బజారు కెక్కించుట

కుసంస్కారము.

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment