శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 41


🌹.   శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 41  🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. స్వామివారు పంచాననం వారికి కాలజ్ఞానమును చెప్పటం... 2 🌻

“గోదావరి నది పన్నెండు రోజులు ఎండిపోయి తిరిగి పొంగిపొర్లుతుంది. వేంకటేశ్వరుని కుడిభుజం అదురుతుంది. మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి.

కృష్ణానది మధ్యలో బంగారు రథం కనిపిస్తుంది. ఆ రథాన్ని చూసిన వారి కళ్ళుపోయి, గుడ్డివారవుతారు. కర్ణాటక దేశంలో దేవాలయాలను తురకలు ధ్వంసం చేస్తారు.

కుక్కలు గుఱ్ఱాలను చంపుతాయి. ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి.

నేల నెత్తురుతో తడిచిపోతుంది . చనిపోయిన వారి ఎముకలు గుట్టలుగా పడి వుంటాయి. దుష్టశక్తులు విజ్రుంభిస్తాయి. అందువల్ల జననష్టం జరుగుతుంది. కాకులు కూస్తాయి, నక్కలు వూళలు వేస్తాయి. ఫలితంగా ప్రజలు మరింతమంది గుంపులుగా మరణిస్తారు.

కొండవీటి రాతిస్థంభం కూలిపోవటం తథ్యం.

కలియుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు. బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతిముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి.

పసిబిడ్డలు మాట్లాడతారు. ఒకరి భార్య మరొకరి భార్యగా మారుతుంది.

కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తరాన వింత వింత చుక్కలు కన్పిస్తాయి. అవి అయిదు నెలలపాటు వుంటాయి. వేంకటేశ్వరుని సొమ్ము దొంగలు అపహరిస్తారు.

కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతమందు జనులు ఎక్కువగా నశిస్తారు. ప్రజలు గ్రామాలు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. అనేక రకాలయిన జబ్బుల వలన పలువురు మరణిస్తారు.

అమావాస్య నాటి అర్థరాత్రి సమయాన ఉదయగిరి శిఖరం మీద చక్రాంకితుడైన ఒక పరమహంస ఎక్కి నిలిచి వుండడం చూసి, చంద్రగ్రహణం అని జనులు ఆశ్చర్యం చెందుతారు.

ఆకాశమార్గాన రెండు బంగారు హంసలు వచ్చి, పట్టణాల్లో సంచరిస్తాయి. దురాశాపరులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించి సర్వ నాశనమైపోతారు. ఆకాశాన తూర్పు పడమరలు కాషాయరంగున కనిపిస్తాయి.

కొండల నుండి పెద్ద పెద్ద ధ్వనులు వినిపిస్తాయి.

వీరభోగవసంతరాయులునై నేను వచ్చులోపల ఇలాంటి వింతలూ అనేకం జరుగుతాయి’’ అని చెప్పి బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ముగించారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కాలజ్ఞానం

25.Aug.2020

No comments:

Post a Comment