🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 136 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సువర్ణ సోపానములు -- Golden stairs 🌻
ఇట్టి దివ్యజ్ఞానమను వెలుగుతో కూడిన దేవాలయము చేరుట, అందు జీవించుట మన లక్ష్యము. దానిని మన హృదయమున ప్రతిష్ఠించుకొని, తన ప్రజ్ఞ అర్చకుడై క్రమముగ అందలి దేవుడుగా తానగుటయే నిజముగా ఆ దేవాలయమును చేరుటయగును.
ఇందులకై జగద్గురువు ఇచ్చిన కళ్యాణమయమైన మార్గమునే బ్లావెట్ స్కీ మాత మరియొక మారు మన కొరకు దర్శించి ప్రసాదించిన విధానమే ఈ సువర్ణ సోపానములు.
సువర్ణసోపానము అనగా మంచివన్నె అని అర్థము. ఏడు వన్నెలకు మూలమైన శుద్ధమైన తెలుపే సువర్ణముగా, సూర్యోదయ సమయమున ఆ తెలుపే బంగరురంగుగా కనపడును. కనుక సువర్ణము భగవంతుని కళను సూచించును. శ్రీమాతను "సువర్ణ" అందురు.
కావున జగన్మాత వద్దకు, భగవంతుని సన్నిధికి చేర్చు సోపానములు ఇవి. సిద్ధి సువర్ణయోగము, సాధన కూడ భగవంతుని స్మరణలో దివ్యమై సువర్ణమగుచున్నది. కావున ఈ సాధన సోపానములు కూడా సువర్ణమయములు.
ఈ సోపానములను ఎక్కువానిలో తన వన్నె తొలగి, భగవంతుని మంచివన్నె అవతరించును. ఈ సువర్ణ సోపానములకు ధ్యాన యంత్రము ఒక వృత్తము నందు గల చతురస్రము. దీని రెండు కర్ణములు కలుపబడి యుండును.
ఏమి లేనట్టి అనంతత్వము నుండి పరమాత్ముడు సూర్యోదయము, మిట్ట మధ్యాహ్నము, సూర్యాస్తమయము; అర్థరాత్రి, శుక్లాష్టమి, పూర్ణిమ, కృష్ణాష్టమి, అమావాస్య, సృష్టి, ప్రళయము, వీని మధ్య రెండు సంధులు అను చతుర్భుజములతో సృష్టి యందు అంతర్యామియై విష్ణుత్వమును చెంది, సూర్య కిరణముల ద్వారమున జీవులుగా దిగివచ్చుటను ఈ యంత్రము సూచించును.
ఈ సువర్ణసోపానములు జాతి, కుల, మతాదులతో సంబంధములేనివి. సర్వదేశకాలములకు సంబంధించినవి బ్లావెట్ స్కీ ద్వారమున పరమగురువులు అందించిన శాశ్వత దివ్యజ్ఞానము అనుగ్రహింపబడ వలెనన్నచో ఈ సోపానముల మీదుగా సాధన చేయుట ఆవశ్యకము.
లేనిచో ఆయా గ్రంథములందు ఉన్న వాక్యముల టీక, తాత్పర్యములు మాత్రమే తెలియును. వాని యందు నిహితమైన వేదమయమగు అంతర్యామి స్వరూపము అందదు. శ్రీకృష్ణుడు గీతలో వివరించిన దైవీసంపదకు ఇవి పోలును.
నరునితో నారాయణుడు ఇట్లనెను. "నీవు దైవీసంపదతోనే జన్మించినవాడవు. ఆందోళన చెందకుము". అనగా ప్రతి నరుడును తనలో అంతర్నిహితమైన ఈ దైవీగుణముల వికాసమునకై నిరంతర శ్రద్ధతో కూడిన సాధనను అభ్యసించవలెను. అపుడు నారదుడు (శ్రీరాముని) పరమపురుషుని గూర్చి వర్ణించిన కళ్యాణగుణమయమూర్తిని చేరుదుము.
..✍ మాస్టర్ ఇ.కె.🌻
(సోపానముల పూర్తి వివరణముల కొరకు సువర్ణసోపానములు అను పుస్తకమును చదువగలరు)
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె
25.Aug.2020
No comments:
Post a Comment