కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 35



🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 35 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


మరి ఈ ఎనిమిది రకాలైనటువంటి గురువులలో ఎవరిని ఆశ్రయించాలి అనే సందేహాన్ని ఈ లక్షణాలలో తీరుస్తున్నారనమాట.

వివేక వైరాగ్యములు, శమాది షట్క సంపత్తి, ముముక్షత్వము అంటే సాధనా చతుష్టయ సంపత్తియందు నిష్ణాతుడైనటువంటి వాడిని ఆశ్రయించాలి. నిత్యానిత్య వస్తువివేకము, ఇహమూత్రార్ధ ఫలభోగ విరాగము, శమాదిషట్కసంపత్తి, ముముక్షత్వము - ఈ నాలుగు లక్షణాలు కలవారు మాత్రమే ఆత్మజ్ఞానమునకు అర్హులు.

వీటిలో ఈ నాలుగూ కాకుండా శాస్త్రజ్ఞాన విధానమని ఒకటి వున్నది. అంటే అర్ధం ఏమిటంటే షడ్ దర్శనాలయందు ప్రవేశం వున్నవాళ్ళందరూ గురువులే.

అంటే సాంఖ్య, మీమాంస (ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస) , యోగ దర్శనము, న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము ఈ షడ్ దర్శనాలు కూడా - ఈ షడ్ దర్శనాల గురించి చెప్పేవాళ్ళు కూడా గురువులే.

ఇంకేంటిట? ఇవి కాక షట్ శాస్త్రములు వున్నాయి. అంటే వ్యాకరణము ఇత్యాది శాస్త్రములు. ధర్మ శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము (జాతక శాస్త్రము), ప్రశ్నా శాస్త్రము ఇట్లాంటి కామ్యక పద్ధతులుగా ఉండేటటువంటి అంశాలతో కూడుకున్నటువంటి శాస్త్రములు కూడా వున్నాయి. కాబట్టి మరి ఒకాయన దగ్గరికి వెళ్ళారనుకోండి.

ఏమండీ మీకు ఆ గ్రహాలు బాలేదు, ఈ గ్రహాలు బాలేదు. ఆ గ్రహాల శాంతి కొరకు ఇలా చేయండి. ఈ గ్రహాల శాంతి కొరకు అలా చేయండి. ఆ రకమైన ఉపాసనా విధిని అనుసరించండి అనేటటువంటి పద్ధతిగా వుండే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండీ మీరు ఆత్మోపదేశం చేయండి. ఆత్మనిష్ఠ నాకు కావాలి. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కావాలి అని అడిగారనుకోండి అది సాధ్యమయేటటువంటి అంశం కాదు.

కాబట్టి శాస్త్ర జ్ఞానం, ఈ ప్రపంచములో అందరికీ ఆత్మవిషయం మీద ఎంతో కొంత పరిజ్ఞానం వుంటుంది. ఆత్మ వున్నది అని అందరూ ఒప్పుకుంటారు. కాని స్వయముగా ఆత్మ నిష్ఠ, స్వయముగా ఆత్మానుభూతి కలిగినటువంటివారిని ఆశ్రయించినపుడు మాత్రమే, వారు మాత్రమే దాని గురించి సరియైనటువంటి బోధని అందించగలుగుతున్నారు.

కాబట్టి, శాస్త్ర పరిజ్ఞానం ఒక్కటే సరిపోవడంలేదు. ఏమండీ, నేను మా గురువుగారి దగ్గర 30 సంవత్సరాలపాటు ఉపనిషత్తులు అధ్యయనం చేశాను. బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేశాను. కాబట్టి నేను బోధిస్తాను అన్నారనుకోండి, మంచిది , స్వీకరించవచ్చు. ఇలాంటి ప్రయత్నం మనం హైదరాబాదులో చేశాం.

మాండూక్య ఉపనిషత్తు చెప్పారు. ఒక వారం రోజులపాటో, ఒక పది రోజులపాటో రెగ్యులర్ గా పాఠం చెప్పారు. గురువుగారు ఏం చెప్పారో అదే చెప్తారు. మక్కీకి మక్కీ. అక్షరదోషంలేకుండా యధతథంగా చెప్తారు. వాళ్ళేం ధారణ చేశారో ఆ ధారణ చేసినదానినే చెప్తారు.

అయ్యా తమకు ఆత్మానుభూతి కలిగిందా, తాము ఆత్మనిష్ఠులేనా, మాకు ఆ రకమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి నిర్ణయాన్ని చెప్పగలరా అంటే ఇంకా మేము అది అందుకోలేదండీ అంటారు. అంటే ఉపనిషద్ పాఠం పూర్తయిపోయింది, కాని ఆత్మానుభూతి జరగలేదు. అంటే ఏమైనట్లు. లక్ష్యం సిద్ధించలేదు. కాబట్టి శాస్త్రజ్ఞానం అవసరమే.

ఆత్మానుభూతికి ఆత్మవిచారణకు శాస్త్రాజ్ఞానం అనేది అవసరమే. అనవసరం కాదు. కాని ఒట్టి శాస్త్రజ్ఞానమే సరిపోదు. కాబట్టి అనుభవజ్ఞానం కలవారు మాత్రమే ఆత్మోపదేశము చేయుటకు అర్హులు.

అందుకని నచికేతుడు ఈ వైవశ్వతుడుని ఆశ్రయించాడు ఆచార్యుడిగా. ఎందుకంటే ఇంతకుమించినటువంటి ఉత్తమమైనటువంటి గురువు లేడు కాబట్టి. ఇంకేమిటటా? ఆత్మ గురించి బాగుగా చెప్పలేరనియు తెలియుచున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

25.Aug.2020


No comments:

Post a Comment