శ్రీ శివ మహా పురాణము - 205



🌹 . శ్రీ శివ మహా పురాణము - 205 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴

45. అధ్యాయము - 20

🌻. శివుడు కైలాసమునకు వెళ్లుట - 4 🌻

సుముహూర్తే ప్రవిశ్యాసౌ స్వస్థానం పరమేశ్వరః | అకరోదభిలాన్ప్రీత్యా సనాథాన్‌ భక్తవత్సలః || 37

అథ సర్వే ప్రముదితా విష్ణుప్రభృతయస్సురాః | మునయశ్చాపరే సిద్ధా అభ్యషించన్ముదా శివమ్‌ || 38

సమానర్చుః క్రమాత్సర్వే నానోపాయనపాణయః |నీరాజనం సమాకర్షుర్మహోత్సవ పురస్సరమ్‌ || 39

తదాసీ త్సుమనో వృష్టి ర్మంగలాయతనా మునే | సుప్రీతా నవృతుస్త త్రాప్సరసో గానతత్పరాః || 40

జయశబ్దో నమశ్శబ్దస్తత్రాసీత్సర్వ సంస్కృతః | తదోత్సాహో మహానాసీత్సర్వేషాం సుఖవర్థనః || 41

పరమేశ్వరుడు సుముహూర్తమునందు తన స్థానమగు కైలాసమును ప్రవేశించెను. భక్తవత్సలుడగు ఆయన ప్రీతితో అందరినీ సనాథులను చేసెను (37).

అపుడు విష్ణువు మొదలగు దేవతలందరు ఆనందించినవారై, మునులతో సిద్ధులతో గూడి శివుని ప్రీతితో అభిషేకించిరి (38).

వారందరు చేతులలో ఉపాయనములను పట్టుకొని శివుని వరుసగా అర్చించి, మహోత్సవముతో నీరాజనమునిచ్చిరి (39).

ఓ మహర్షీ! అపుడు దేవతలు మంగళకరమగు పుష్పవృష్టిని కురిపించిరి. అచట అప్సరసలు గానము చేయుచూ ప్రీతితో నాట్యమాడిరి (40)

అపుడు అచట జయజయ ధ్వానములు, నమశ్శబ్దములు సర్వులచే పలుకబడినవి. ఆ గొప్ప ఉత్సాహము అందరికి సుఖవర్థకమయ్యెను (41).


స్థిత్వా సింహాసనే శంభు ర్విరరాజాధికం తదా | సర్వైస్సంసే వితోsభీక్ణం విష్ణ్వాద్యైశ్చ యథోచితమ్‌ || 42

అథ సర్వే సురాద్యాశ్చ తుష్టువుస్తం పృథక్‌ పృథక్‌ | అర్థ్యా భిర్వాగ్భిరిష్టాభిశ్శంకరం లోకశంకరమ్‌ || 43

ప్రసన్నాత్మా స్తుతిం శ్రుత్వా తేషాం కామాన్‌ దదౌ శివః | మనోsభిలషితాన్‌ ప్రీత్యా వరాన్‌ సర్వేశ్వరః ప్రభుః || 44

శివాజ్ఞాయాథ తే సర్వేస్వం స్వం ధామ యయుర్మనే | ప్రాప్త కామాః ప్రముదితా అహం చ విష్ణునా సహ || 45

ఉపవేశ్యాసనే విష్ణుం మాం చ శంభురువాచ హ | బహు సంబోధ్య సుప్రీత్యాsనుగృహ్య పరమేశ్వరః || 46

శంభుడు సింహాసనమునందున్న వాడై మిక్కిలి విరాజిల్లెను. విష్ణ్వాది దేవతలందరు యథో చితముగ ఆయనను సేవించిరి (42).

అపుడు దేవతలు, ఇతరులు లోకములకు మంగళములనిచ్చు ఆ శంకరుని అర్థవంతములైన, శివప్రీతికరములైన వాక్కులతో వేర్వేరుగా స్తుతించిరి (43).

సర్వేశ్వరుడు, ప్రభువు అగు శివుడు వారి స్తోత్రములను విని, ప్రసన్నమగు మనస్సుగలవాడై, వారు మనస్సులో కోరుకున్న కోర్కెలనన్నిటినీ వరములుగ నిచ్చెను (44).

అపుడు వారందరు శివుని వద్ద సెలవు తీసుకొని తమ తమ నెలవులకు వెళ్లిరి. ఓ మునీ! నేను, మరియు విష్ణువు ఈడేరిన కోర్కెలు గలవారమై ఆనందించితిమి (45).

పరమేశ్వరుడగు శంభుడు నన్ను, విష్ణువును ఆసనము నందు కూర్చుండబెట్టి, మిక్కిలి ప్రేమతో అనుగ్రహించి, అనేక విధములుగా సంబోధించి ఇట్లనెను (46).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

25.Aug.2020

No comments:

Post a Comment