🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 11 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
అష్టమిచంద్ర విభ్రాజ దళికస్తల శోభిత
ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక
🌻 16. 'ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా' 🌻
చంద్రుని వంటి అందమైన ముఖము నందు చంద్రుని లోని మచ్చవలె కస్తూరి బొట్టును దాల్చినది అని అర్థము. వేదకాలము నుండి భారతీయ సంప్రదాయమున ఫాలభాగమున కస్తూరి బొట్టును అలంకరించుకొనుట కలదు. చాక్షుష మన్వంతరమున మానవు లందరికి నీ మూడవ కన్నుకూడ పనిచేయు చుండెడిది. కాలక్రమమున కామము పెరుగుటచే కాంతులీను దేహములు మరుగుపడి స్థూల దేహము లేర్పడుచు మూడవ కన్నును కప్పివేయుట జరిగినది. మూడవ కన్ను ఆజ్ఞా కేంద్రము.
దైవము యొక్క ఆజ్ఞ లేక సంకల్పము జీవునకు తెలియు స్థానము. మానవుల కత్యున్నత ప్రజాస్థానము. ఆ స్థానమును స్పృశించుచు, కస్తూరితో అలంకరించుకొనుచు అచటి ప్రజ్ఞను మేల్కాంచునట్లు చేయు విధానమొకటి ఉండెడిది. దానికి సంబంధించిన క్రతువును ప్రతిదినము, స్నానమాచరించిన పిదప స్త్రీలు, పురుషులు కూడ నిర్వర్తించుకొను చుండెడివారు. దైవాజ్ఞ తనయందు భాసింప, దానిని దినమంతయు అనుసరించుటకు ఉద్యుక్తులగుటకే ఈ క్రతువు.
కాలక్రమమున అంతర్షితమైన అర్థము మరుగై అలంకారప్రాయముగ మిగిలినది. అటుపై మ్లేచ్ఛుల సంపర్కమున భారతీయ పురుషులీ సంప్రదాయమును వదలినారు. ఉత్తర భారతమున స్త్రీలు కూడ వదలినారు. శ్రీవిద్యా ఉపాసకులు నేటికిని ఈ సంప్రదాయమును అనుసరించు చుందురు.
ఇతరులు వారి వారి భక్తిశ్రద్ధలను బట్టి అనుసరించుదురు. అమ్మవారు ముఖమున గల కస్తూరి బొట్టు మన యందలి ఆజ్ఞ యను ప్రజ్ఞను గుర్తు చేయునదిగ గోచరించును.
చంద్రబింబమందలి మచ్చతో ఫాలభాగమందలి బొట్టును పోల్చుటలో కూడ అంతరార్థ మిమిడి యున్నది. మృగనాభి యనగా చంచలమగు బిందుస్థానము. బిందుస్థానము అంతర్యామి ప్రజ్ఞలకు, అహంకార ప్రజ్ఞకు నడుమ ముఖద్వారము. అంతర్యామి ప్రజ్ఞ బిందువాధారముగ ప్రత్యగాత్మ లేక అహంకార ప్రజ్ఞయందు భాసించును.
కాని, అహంకార ప్రజ్ఞను మాయ ఆవరించినపుడు ఈ బిందువు మాయమగును. అనగా, అంతర్యామి ప్రజ్ఞనుండి వేర్పాటు కలుగును. అహంకార ప్రజ్ఞ స్మరించినప్పుడే అంతర్యామి ప్రజ్ఞ సాన్నిధ్యము నిచ్చును. స్మరింపనపుడు మాటుగ నుండును. అందువలన బిందువును చంచలాత్మకమగు మృగము(లేడి)తో పోల్చిరి. చంద్రుని యందలి మచ్చను కూడ అంతర్యామి ప్రజ్ఞకు అనగా మొత్తము వెలుగునకు, బింబాకారముగ ఏర్పడిన వెలుగునకు అనుసంధానము నేర్పరచు బిందువు భావించవలెను.
పూర్ణచంద్రుని యందలి మచ్చ “ఈ కాంతి నాది కాదు, నా నుండి వెలువడుచున్నది” అని తెలుపుచున్నది. అటులనే అమ్మవారి ముఖమందలి కాంతి పరతత్త్వము యొక్క ప్రతిబింబమే అని తెలుపుచున్నది.
ఫాలభాగమున తిలకమును దిద్దుకొను వ్యక్తి కూడ అంతర్యామి ప్రజ్ఞయే తన నుండి భాసించు చున్నదని భావన చేయవలెను. ఈ బొట్టు దివ్య సంకల్పములకు ద్వారమై వ్యక్తులను నడిపించగలదని మూల భావము. “Father thy will be done, not mine" అని తెలుపుటకే ఫాలభాగమందలి తిలకము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 16 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻. Mukacandra- kalaṇkābha- mṛganābhi-viśeṣakā मुकचन्द्र-कलण्काभ- मृगनाभि -विशेषका (16) 🌻
She is wearing a kastūri (kastūrikā a fragrant paste) tilaka (a mark on the forehead made with coloured earths, sandal-wood, or unguents, either as ornament or as a sectarian distinction) and this is compared to the spot that we see in the moon. In Śrī Śaktī Mahimnaḥ (verse 39), Her face is meditated upon.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
03 Oct 2020
No comments:
Post a Comment