✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మ విచారణ పద్ధతి - 31 🌻
కాని తురీయ స్థానమందు జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థల యొక్క సమస్త కదలికలు, సమస్త చేతనములు, చరాచరములైనటువంటి స్థితులన్ని జడ చేతన భాగములన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగి స్వయం చేతనావస్థ గలిగి చైతన్య స్థితి యందు అగోచరరూపమైనటువంటి నిరాకార పద్ధతిగా, కేవల ప్రకాశ పద్ధతిగా, స్వరూప సాక్షాత్కార పద్ధతిగా, నిర్వాణ పద్ధతిగా తురీయమందు ఆవిర్భవిస్తున్నాయి.
కాబట్టి ఈ రకంగా అకారము, ఉకారము, మకారము, అమాతృక - ఈ నాలుగూ- నాలుగు శరీరములను, నాలుగు అవస్థలను సూచిస్తూ వున్నాయి. కాని ఈ మాత్రలు ఈ శరీరములు ఈ అవస్థలు ఇదంతా కూడా వాచికములే గానీ లక్ష్యము కాదు. కాని వీటిని తెలుసుకొనడం ద్వారా, వీటిని దర్శించడం ద్వారా, వీటిని అనుభవించడం ద్వారా వీటి యొక్క లక్ష్యార్ధమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయములోనికి ప్రవేశించాలి అంటే అమాతృకను, తురీయమును, మహాకారణమును లక్ష్యించాలి.
తద్వారా నీవు పరబ్రహ్మమును స్ఫురింపజేసేటటువంటి వాచ్యమైనటువంటి పరబ్రహ్మ లక్ష్యార్ధములో నీవు ప్రవేశించగలుగుతావు. పరబ్రహ్మమును గురించినటువంటి ధ్యానస్థితియందు చిత్తైకాగ్రత పొందాలి అంటే మానవులందరూ తప్పక చేయవలసినది ఏమిటంటే మూడు అవస్థల యందు తురీయ స్థితిలో నిలబడి వుండుట. మూడు శరీరములందు నాలుగవ శరీరమైనటువంటి మహా కారణ దేహ స్థితితో నిలబడియుండుట.
మూడు మాత్రల యందు అకార, ఉకార, మకార మాత్రలను వదలి వేసి అర్ధమాత్రుక లేక అమాత్రుకాయుత ప్రణవ ధ్యానంలో నిరంతరాయముగా మగ్నత చెందియుండుట. ఈ రకముగా ఎవరైతే వుంటారో వారు మాత్రమే పరబ్రహ్మము యొక్క స్ఫూర్తిని, స్ఫురణను వాళ్ళు అనుభూతి చెందగలుగుతున్నారు.
ఇట్టి పరబ్రహ్మ స్ఫూర్తిని, స్ఫురణని పొందాలి అంటే ఈ ఓంకార మార్గము, ఓంకార ఉపాసన, ఓంకార తత్వము, ఓంకార ఆలంబన, ఓంకారమనే ఆశ్రయము ఉన్నతమైనటువంటిది. అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది. అన్ని ఉపాసనలకంటే, అన్ని సాధనలకంటే శ్రేష్ఠమైనటువంటి ఉపాసన.
కాబట్టి నీలో జరుగుచున్నటువంటి శ్వాస/ప్రాణము కూడా ఈ ఓంకారానుసంధానము ద్వారానే జరుగుచున్నది. నీ అంతర ఇడా పింగళ నాడులలో జరిగేటటువంటి హంస తత్వము ఏదైతే వున్నదో ఆ హంసతత్వము కూడా ఈ ఓంకారానుసంధానము చేతనే జరుగుచూవున్నది. కాబట్టి సర్వ జీవులయందు ప్రాణచలనము ఈ ఓంకారము యొక్క నాదానుసంధానమునించే ఉద్భవిస్తూవున్నవి.
కాబట్టి ఇట్టి ఓంకార తత్వమును ఎరుగుట శ్రేష్ఠదాయకమైనటువంటిది. ఆధారభూతమైనటువంటిది. పరమాశ్రయమైనటువంటిది. కాబట్టి తప్పక సాధకులందరూ ఈ ఓంకార ఉపాసనని విధిగా, యధావిధిగా, లక్ష్యార్ధ పద్ధతిగా, వాచిక పద్దతిగా, వాచ్యార్ధ పద్ధతిగా తెలుసుకుని దాని లక్ష్యమునందు ప్రవేశించుటకు సంసిద్ధులై చిత్తైకాగ్రత కలిగివుండి చిత్ స్వరూపముగా చిత్ జడ గ్రంధి బేధనము జరిగి చిత్ గా నిలబడి వుండేటటువంటి స్థితిలో ఈ సాధనని కొనసాగించాలి అనే రూపంలో యమధర్మరాజు గారు నచికేతుడికి బోధిస్తూవున్నారు.
ఆత్మ శరీరముతోపాటు పుట్టునది కాదు. శరీరము నశించిన దానితో పాటు నశించునది కాదు. ఈ ఆత్మకు కారణభూతమైనదేదియు లేదు. శరీరమునకు శుక్ల శోణితములు కారణమైనట్లు ఆత్మకు ఏ కారణమును లేదు.
ఇది దేనికి కార్యము కానందున నశించునది కాదు. ఈ ఆత్మ నుండి ఏదియు పుట్టుట లేదు. వికారములు, పరిణామములేక భూతభవిష్యద్వర్తమాన కాలంలో ఒకటిగానే యుండుట చేత నిత్యుడనబడును. వృద్ధిక్షయములు లేనిది కనుక శాశ్వతమనబడును. పురాణమనబడును. శరీరము ఖండించబడినను ఆత్మ ఖండించబడదు.
శరీరమునకు గర్భములో నుండుట, పుట్టుట, పెరుగుట, పరిణామము చెందుట, క్షీణించుట, మరణించుటయను వికారములు కలిగియున్నది. ఆ ఆత్మకు ఏ వికారములు లేవు. శరీరములో నున్నప్పటికిని ఆత్మకు శరీరధర్మములంటవు. సామాన్య మానవులు శరీరమునే ఆత్మగానెంచి, శరీరముతో బాటు ఆత్మయును నశించునని తలంతురు.
కనుకనే వారు నేను చంపెదననియు, చంపబడుచున్నాననియు తలంతురు. ఆ విధముగా తలంచువారిరువురును ఆత్మయనగా నేమియు తెలియనివారే. ఆత్మ ఎవరిని చంపుట లేదు, చంపబడుటలేదు. - విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group
https://t.me/ChaitanyaVijnanam
Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
03 Oct 2020
No comments:
Post a Comment