కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 155


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 155 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 85 🌻

ఎప్పటికప్పుడు నిజానికి అఖండమైనటువంటి ఆత్మ స్వరూపంలో ఏ భేదము లేకపోయినప్పటికి, భేదములను ఆపాదించుకుని చూచుట అనే అభ్యాస బలము వలన అనేక రకములైనటువంటి అంతరములు ఏర్పడుతున్నాయి.

కాబట్టి, ప్రతి ఒక్క మానవుడు కూడా ఇతర మానవులతో ఎలా ఉన్నారు? నువ్వు నేను ఒక్కటేనా? వీడు వాడు ఒక్కటేనా? అదీ ఇదీ ఒక్కటేనా? అనేటటువంటి పదాలు మాట్లాడుతున్నాము. అంటే అప్పుడేమయ్యింది అంటే, మనం చిన్నప్పటి నుండి జనన కాలం నుండి మరణ కాలం వరకూ భేద దృష్టిని పెంచి పోషిస్తూఉన్నాము.

అభేద సిద్ధి కొరకై ప్రయత్నించ వలసిన మానవుడు, భేద దృష్టి యందు బలపడిపోవడం చేత, వస్తువుల యందున్నటువంటి భేదాన్ని గుర్తించడంతో మొదలు పెట్టి, అంటే, ఉప్పు పంచదార ఒకటేనా? కర్పూరం ఉప్పు ఒకటేనా? తెల్లని వస్తువులన్నీ ఒకటేనా? వాటి వాటి లక్షణాలు వేరు వేరుగా ఉన్నాయి కదా! కాబట్టి, లక్షణ రీత్యా గుర్తించాలి కదా, అనేటటువంటి ప్రతిపాదనని మనం చిన్నప్పుడే చెప్పుకున్నాము.

కారణం ఏమిటి అంటే, ఆత్మవస్తువుని లక్షణరీత్యానే గుర్తించ గలుగుతున్నాము. అట్టి లక్షణాన్ని గుర్తించేటటువంటి బుద్ధి వికాసం ఎందుకు అవసరమయ్యా అంటే, అఖండంగా ఉన్నటువంటి ఆత్మవస్తువుని గుర్తించటానికి లక్షణ రీత్యానే గుర్తించాలి కాబట్టి, వస్తువుగా దానిని చూపెట్టటం కుదరదు కాబట్టి.

కానీ, తాను అల్లుకున్నటువంటి గూటిలో, తానే చిక్కుకుని అక్కడే మరణించేటటువంటి సాలె పురుగు వలే, తాను అల్లుకున్న గూటిలో తానే చిక్కుకుని, తన మనోజాలంలో తానే చిక్కుకుని, తన మనో భ్రాంతిలో తానే చిక్కకుని, తన బుద్ధిగతమైనటువంటి వివేకాన్ని, అవివేకంగా మార్చుకుని, అజ్ఞానంగా మార్చుకుని, అవిద్యగా మార్చుకుని, అభ్యాస దోషం చేత, అనేకత్వం అనేటటువంటి భ్రాంతికి గురై, అనాత్మ అనేటటువంటి భ్రాంతికి గురై, భేద స్థితికి లొంగిపోయి, చిట్టచివరికి మృత్యువు పాలౌతున్నాడు.

ఈ రకంగా అద్వితీయ బ్రహ్మము తానై ఉన్నప్పటికి, అసలు ద్వితీయమే లేనటువంటి స్థితిలో తాను ఉన్నప్పటికీ, స్వకీయమైనటువంటి ఆభాస చేత, స్వయం కృతమైనటువంటి అపరాధం చేత, మృత్యువు నుండి మృత్యువునే పొందుచున్నాడు.

కాబట్టి, ఈ ఆత్మను అనేకముగా తలంచడం అనేటటువంటి దోషాన్ని మనము చేయరాదు. ఇక్కడ అనేకమంది జీవాత్మలున్నారండీ అనకూడదు.

ఇక్కడ అనేకమంది దివ్యాత్మలున్నారండీ అనకూడదు. ‘ఆత్మలు’ అని బహువచన ప్రయోగం చేయకూడదు. ఆత్మకు ఏక లేక బహు అనే రూపాంతరం లేదు. ఈ ఆత్మ శబ్దం సంస్కృత శబ్దం. దీనికి వచనం లేదు. ఆత్మ - ఆత్మలు అనరాదు.

కాబట్టి, అఖండముగా నున్నటువంటి ఆత్మస్వరూపాన్ని ఆ లక్షణ రీత్యా ఏక పద్ధతిగా, ఏకత్వం అనేటటువంటి ఏకైక లక్షణ రీత్యా అందరూ మానవులే. అందరూ మానవులే అన్న దాంట్లో కూడా ఒక దోషము ఉంది. మానవులు అనే బహువచన శబ్దం.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


07 Jan 2021

No comments:

Post a Comment