🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దుర్వాసమహర్షి-కందళి - 6 🌻
28. “నీకు ఏవో ఇవ్వటం నా విధికాదు. నువ్వు గెలవబోతున్నావు. వాళ్ళు చావబోతున్నారు. తరువాత 30 ఏళ్ళు రాజ్యం ఏలుకుంటారు. వెళ్ళిపోతారు” అని, కాలంలో జరగబోతున్నదానిని చెప్పాడు కృష్ణపరమాత్మ.
29. నేను ఇవన్నీ ఇస్తున్నాను అనే కర్తృత్వం ఎన్నడూ ఆయన తనపైతాను ఆరోపించుకోలేదు. అనలేదు. ఇట్లాంటి మాటలు ఏవీ చెప్పలేదు. “అన్నిటికీ కర్తనునేను. ఏ కర్మకూ కారణం నేనుకాదు. ఈ సమస్త కర్మలూ, ఆయా ఫలములు జరుగుతాయి. ఆ శాసనంచేసిన శాసనకర్తను నేను. ఏకర్మకూ ఫలప్రదాతగా ప్రత్యేకంగా నేను లేను” అని ఆయన బోధగా అర్థంచేసుకోవాలి. ప్రత్యేకంగా లేడు. సమిష్టిగా ఉన్నాడు. ఒక్కడుగా ఉన్నాడు.
30. “అంతా ఈశ్వరేఛ్ఛ. ఇలా జరిగింది” అంటాము. ఈశ్వరేఛ్ఛ అంటే ఏమిటి? మన కర్మానికి తగిన ఫలం రావాలి అనేది ఈశ్వరేఛ్ఛ. “నా కర్మఫలం ఇలా చేసింది నాకు. అంతే కాని నాకివాళ ఈ పనికావాలి, ఈ పని కాకూడదు అని ఈశ్వరుడు అలా సంకల్పించలేదు” అని మనం అర్థంచేసుకోవాలి.
31. కాని అతడిని ఉపాసించినవాడు ఏ విధంగా ఉపాసిస్తాడో అట్టి ఆ ఫలం ఆ శక్తిలోంచి వస్తుందికాని, ఆ వ్యక్తిత్వంచేత కాదు. లక్షణంచేత సృష్టి అంతా ఏదయితే ఉందో – ఆరాధనకు ఫలం ఇచ్చే లక్షణం అందులో ఉంది. ఏ పని అయినా ఆయన చెయ్యటంలేదు. అంతర్యామిగా సాక్షిగా ఉన్నాడు.
32. మరి ఆయన సాక్షిగా లేకపోతే-మన కర్మ ఎక్కడ భద్రంగా నమోదు అవుతోంది? ఎక్కడనుంచీ ఈఫలం వస్తోంది? ఎవడు ఇస్తున్నాడు? ఎక్కడో ఒక చోట అది నిలిచి ఉండవలసిందే కదా! ఈనాటి మనకర్మ ఎప్పుడోఫలం ఇస్తోందంటే అది ఎక్కడ నిల్వ ఉంటోంది? ఎక్కడనుంచీ కర్మఫలం వస్తోంది? ఈ ప్రశ్నలకు అదే సమాధానం.
33. ఈశ్వరుడు సాక్షిగా, అంతర్యామిగా సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఇందుగలదందు లేడని అంటే-స్తంభంలో లేడా? ఎక్కడ లేడు ఆయన? అందుకే నృసింహావతారమయినా, మరే అవతారమయినా, ప్రతీదీకూడా “ఆయన అవతరించాడు, ఆయన ప్రహ్లాదుని కాపాడాడు, ఆయనే వాడిని సంహరించాడు” అని ఇలా చెప్పటం సబబు కాదు. అది ఆయనకి కర్తృత్వం ఆపాదించటమన్నమాట.
34. ప్రహ్లాదుడు ఆయనను ఉపాసించాడు. ఉన్నాడని ప్రతిపాదించాడు. అంటే నృసింహావతారానికి కర్త ప్రహ్లాదుడే. ఆ అవతారానికి ఇద్దరు కర్తలున్నారు. ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. తన చావుకు తానే రూపకల్పన చేసుకున్నాడు. తాను ఎలాగ చావాలో అతడే చెప్పాడు. అక్కడకూడా ఈశ్వరుడు కర్తకాడు! జాగ్రత్తగా తన చావును తానే రూపకల్పన చేసుకున్నాడు ఆ రాక్షసుడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
07 Jan 2021
No comments:
Post a Comment