శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 172 / Sri Lalitha Chaitanya Vijnanam - 172


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 172 / Sri Lalitha Chaitanya Vijnanam - 172 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |
నిఃసంశయా, సంశయఘీ, నిర్భవా, భవనాశినీ ‖ 48 ‖



🌻 172. 'నిస్సంశయా' 🌻

సంశయము లేనిది శ్రీమాత అని అర్థము.

భక్తి, జ్ఞానము, పూర్ణవిశ్వాసము కలవారికి సంశయముండదు. సంశయము అపరిపూర్ణత లక్షణము. సంశయ మున్నవారు దేనినీ సాధింపలేరు. వారి సంశయము వలననే వారు పతనము చెందుదురు.

“సంశయాత్మా వినశ్యతి” అని శ్రీకృష్ణుడు ఘంటా పథముగా నిర్ధారించి

నాడు. సంశయము కలవాడు నశించును అని అర్థము. సంశయము కలవాడు లేని అపాయమును ఉన్నట్లు చూచును. దానితో జంకు కలుగును. అట్టివాని మనస్సు విషయములను వెనుకకు లాగు చుండును.

కావున పురోభివృద్ధి సాధించలేడు. సంశయము కలవాడు ఇతరుల సంశయములను పోగొట్టలేడు. ఏదైన ఒక నిర్ణయము చేసి ఒక కార్యము నారంభించినపుడు, కార్య మధ్యమున సంశయించుట తిరోగమునకే.

ఫలితములందాసక్తి, ఆశకన్న కర్తవ్యమునందు దీక్ష కలవారికి సంశయముండదు. ఫలితములందాసక్తిచేత మేలుకన్న కీడునే ఎక్కువ సంశయించినపుడు కర్తవ్యము కుంటుపడును. కర్తవ్య మనునది మేలు కీడులతో సంబంధము కలది కాదు.

మహావీరుడు, సంస్కార సంపన్నుడు అగు అర్జునుడు, యుద్ధ ప్రారంభ సమయమున సంశయపడెను. ఆ సంశయమునుండి అనేక సిద్ధాంతములను పుట్టించుకొనెను. మనసు తికమక పడెను. ఏమియు తోచని స్థితి కలిగెను. దేహాంగములు భయముతో వణకెను.

ధనుస్సు, విల్లంబులు చేయిజారి నేలపై బడెను.

అతని అదృష్టముగ శ్రీకృష్ణుడుచటనే యుండుట వలన, సంశయ నివృత్తి గావించి అర్జునుని కర్తవ్యమునందు నిలిపెను. శ్రీకృష్ణుడు ఆశ లేనివాడు. సంశయము లేమాత్రము లేనివాడు. కావుననే గురుత్వము వహించి అర్జునుని సంశయములను పారద్రోలెను. శ్రీకృష్ణు డనగా శ్రీమాతయే. శ్రీమాత జ్ఞాన స్వరూపిణి.

నిత్యపరిపూర్ణ. అనంతముగా సృష్టి గావించి నిర్వహించుచున్ననూ, అట్టి బృహత్తర కార్యమందు ఆమెకు ఏ సంశయమూ లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 172 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Niḥsaṃśayā निःसंशया (172) 🌻

She is without doubts. Doubts arise while seeking knowledge. When She is the embodiment of knowledge, there is no question of doubts for Her.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


07 Jan 2021

No comments:

Post a Comment