శ్రీ శివ మహా పురాణము - 317
🌹 . శ్రీ శివ మహా పురాణము - 317 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
79. అధ్యాయము - 34
🌻. దుశ్శకునములు - 2 🌻
పరమేశ్వరుడు రక్తవర్షమును కురిపించెను. దిక్కులు చీకట్లతో నిండినవి. దిక్కులన్నియు వేడితో నిండి పోవుటచే జనులందరు భయమును పొందిరి (15). ఓ మహర్షీ! ఆ సమయములో విష్ణువు మొదలగు దేవతలు ఇట్టి అరిష్టములను చూచి, మిక్కిలి భయమును పొందిరి (16).
నదీ వేగమునకు తీరమునందలి చెట్లు కూలిన విధముగా వారు, 'అయ్యో!చచ్చితిమి' అని పలుకుచూ మూర్ఛితులై నేల గూలిరి (17). వారు నేలపైబడి సంహరింపబడిన క్రూర సర్పములవలె కదలిక లేకుండ నుండిరి. మరికొందరు క్రిందబడి బంతులవలె పైకి ఎగిరిరి (18).
అపుడు వారు వేడిని తాళలేక రోదిస్తూ పరస్పరము మాటలాడుకొనిరి. ఆమాటలు రోదన ధ్వనిలో కలిసిపోయెను. వారు జల పక్షుల వలె రోదించిరి (19). విష్ణువుతో సహా ఆ దేవతలందరు తమ శక్తులను కోల్పోయి, తాబేళ్లవలె ముడుచుకొని కూర్చుని దుఃఖించిరి (20).
ఆకాశవాణి పలికెను -
ఓరీ దక్షా! నీ జన్మ నింద్యము. నీవు ఈనాడు మహామూర్ఖుడవు, పాప బుద్ధివి అయినావు. నీకు శంకరుని నుండి మహాదుఃఖము సంప్రాప్తము కాగలదు. దానిని ఎవ్వరైననూ నివారింపజాలరు (22). అయ్యో! ఇచట దేవతలు మొదలగు వారు ముర్ఖత్వముచే ఉపస్థితులై యున్నారు. వారికి కూడ మహాదుఃఖము కలుగ బోవుచున్నది. దీనిలో సంశయము లేదు (23).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆ ఆకాశవాణి విని, ఆ చెడు శకునములను చూచి, దక్షుడు చాల భయపడెను. దేవతలు మొదలగు ఇతరులు కూడ భయపడిరి (24). మనస్సులో మహాక్షోభను పొందియున్న దక్షుడు వణకుచున్న వాడై తన ప్రభువు, లక్ష్మీ పతి అగు విష్ణువును శరణు పొందెను (25). మూర్ఖుడగు దక్షుడు భయభీతుడై, దేవదేవుడు, భక్తులను రక్షించువాడునగు ఆ విష్ణువునకు సాష్టాంగపడి, స్తుతించి ఇట్లనెను (26).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో దుశ్శకున దర్శనమనే ముప్పది నాల్గవ అధ్యాయము ముగిసినది (34).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
07 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment