✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 51 🌻
ముందు పృథ్వి అంతా జలమయమైంది. ఆ జలమయమైనటువంటి పృథ్వి మరల ద్వాదశ సూర్యుల చేత ఎండగట్టబడుతుంది. అగ్ని తప్తమైపోతుంది. అయః పిండమైపోతుంది. అయః పిండమైనటువంటిది కాస్తా వాయురూపాన్ని ధరిస్తుంది.
ఆ వాయు రూపాన్ని ధరించింది కాస్తా ఆకాశంలో లయమైపోతుంది. ఎక్కడ నుంచైతే ఉత్పన్నమైనాయో అవి తమ తమ స్వస్థానమందు లీనమైపోతాయి. ఈ రకముగా ఈ పంచభూతాలు వాటి యొక్క వ్యక్తీకరణ, వాటి యొక్క లయాన్ని ఇక్కడ బోధించే ప్రయత్నం చేస్తున్నారు.
మరలా ఎట్లా ప్రాదుర్భవిస్తాయి అండి అంటే, ఈ సృష్టి మొత్తాన్ని సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలనేటటువంటి పంచకృత్యాలుగా బోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విత్తనము ఉన్నదండీ! విత్తనము స్వయంగా మొలకెత్తేస్తుందా? అంటే, దానికి నీళ్ళ యొక్క సంయోజనీయత జరిగి, దాని యొక్క బీజ కవచం ఉబ్బి సిద్ధంగా మొలక రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థితి ఒకటి. మొలక ఎత్తేటువంటి స్థితి ఒకటి. మొలక ఎత్తిన తరువాత రెమ్మలు, కొమ్మలు వచ్చి కాండము ఏర్పడినటువంటి స్థితి ఒకటి. తరువాత పూలు, ఫలములు వచ్చేటటువంటి స్థితి ఒకటి.
ఈ రకంగా చెట్టుకి ఈ స్థితులు ఎట్లా అయితే ఉన్నాయో, అట్లాగే ‘బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్ మహత్ మహదో మహదహంకారః, మహదహంకారో ఆకాశః’ అని ఎక్కడిదాకా చెబుతున్నామో దానిని చక్కగా వివరిస్తున్నారన్నమాట!
ఒక చెట్టు యొక్క ఉత్పన్నము ఎట్లా అవుతుందో, అంకురం ఎట్లా వస్తుందో, ఆ అంకురం మొలక ఎట్లా అవుతుందో, ఆ మొలక కాండం ఎట్లా అవుతుందో, ఆ కాండమే ఫల పుష్పాదులను ఎట్లా ఇస్తుందో, ఆ ఉపమానాన్ని స్వీకరించి, విత్తనము ఏదైతే ఉందో, ఆ విత్తనము ఉబ్బినటువంటి స్థితి మహతత్త్వము. విత్తనము విత్తనముగా ఉంటేనేమో మహత్తు కంటే ముండు ఉన్నటువంటి అవ్యక్తము. అర్థమైందా అండి? ఆ అవ్యక్తము కంటే ముందున్నటువంటిది పరమాత్మ.
కాబట్టి, అహం బీజ ప్రవర్తిత. అని, భగవద్గీతలో కూడా పరమాత్మ పురుషోత్తమ ప్రాప్తియోగంలో చెబుతూఉన్నాడు. నేను బీజ ప్రదాతను. ప్రకృతి తల్లి వంటిది. నేను తండ్రి వంటి వాడను అనేటటువంటిది కూడా అక్కడ మనకు బోధిస్తున్నాడు. అక్షర పరబ్రహ్మ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ రెండిటిని బాగా అధ్యయనం చేయాలన్నమాట.
ఎవరైతే మహతత్త్వాన్ని, అవ్యక్తాన్ని, దానిపైనున్నటువంటి బ్రహ్మమును, తెలుసుకోవాలనుకుంటారో, వాళ్ళు ఈ భగవద్గీతలో అక్షరపరబ్రహ్మయోగాన్ని, పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని బాగా అధ్యయనం చేయాలి. బాగా అధ్యయనం చేయడమం అంటే భగవద్గీతని, అది ఉపనిషత్ సారముగా బోధింపబడింది కాబట్టి, ఏ ఉపనిషత్తుల నుంచి ఆయా శ్లోకములు స్వీకరించబడినాయో, ఆయా ఉపనిషత్తులని కూడా చదువ వలసినటువంటి అవసరం ఉంది.
అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. శ్రవణం చేయాల్సిన అవసరం ఉంది. మనన నిధిధ్యాసలు చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చదివేటటువంటి వాళ్ళు మాత్రమే భగవద్గీతను క్షుణ్ణంగా చదివినట్లు.
ఎక్కడికక్కడ వ్యాఖ్యాన సహితంగా ఉన్నటువంటి గ్రంధాలలో, ఆ యా వాక్యములను, ఏ ఉపనిషత్తుల నుంచి స్వీకరించబడ్డాయో, ఏ ఉపనిషత్ వాక్యములకు సమన్వయం అవుతుందో, శ్వేతాశ్వతరోపనిషత్, కఠోపనిషత్ ఇలా అనేక రకాలైనటువంటి, సమన్వయీకరించబడేటటువంటి ముండక, మాండూక్య, కేన, బృహదారాణ్యక. ఈ ఉపనిషత్తుల యొక్క వాక్యాలన్నింటినీ కూడా, ఈ భగవద్గీతకు అనుసంధాన పరచి, వ్యాఖ్యన విశేషాలు లభిస్తోంది.
కాబట్టి, అటువంటి వ్యాఖ్యాన విశేషములను చదివేటప్పుడు కూడా, ఈ సమన్వయంతో చదువుకోవల్సినటువంటి, అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడే భగవద్గీతను బాగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అప్పుడే సమగ్రమైనటువంటి అవగాహన కూడా కలుగుతుంది.
అప్పుడేమి తెలుస్తుందంటే, సర్వవేదాంత గ్రంథములన్నియూ కూడా ఆత్మనిష్ఠ, బ్రహ్మనిష్ఠ, పరబ్రహ్మనిర్ణయం అనేటటువంటి లక్ష్యాలు దిశగానే బోధించారు అనేటటువంటి సుస్పష్టమైన మార్గము బోధపడుతుంది. - విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
04 Dec 2020
No comments:
Post a Comment