గీతోపనిషత్తు - 90


🌹. గీతోపనిషత్తు - 90 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 26 - 3. ప్రాణాయామ యజ్ఞము - సృష్టి యందలి క్రమమే క్రతువు. సృష్టి యందు కాలమే దైవము. కావున కాలము ననుసరించుచు చేయు శ్వాస క్రతుబద్దము కాగలదు. జీవితము క్రతుబద్ధము కావలెనన్నను, క్రమబద్ధము కావలెనన్నను కాలమును గౌరవించుట నేర్చుకొనవలెను. కాలము ననుసరించుట నేర్చుకొనవలెను. ఒకే కాలమున ప్రాణాయామ హోమమును నిర్వర్తించుట ఐదవ నియమము 🍀

📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚

Part 3

పై తెలిపిన విధముగ శ్వాస నభ్యసించుచున్న కొలది దేహతత్వము మారుచుండును. దేహధాతువుల యందలి తమస్సు క్రమముగ తొలగును. తమస్సు తొలగినకొలది బద్ధకము, నిద్ర వదలును. ధాతువులు తేలిక యగుచున్నకొలది, తేలిక యగు ఆహారమే దేహము స్వీకరించును. బరువగు ఆహారమును నిర్జించును. ఇది అంతయు సహజముగ జరుగును. దేహమునకు హింసగ జరుగదు. యోగమున మాంసాహారులు శాకాహారులగుట.

శాకాహారులు దుంపలు ఇత్యాది బరువైన ఆహారమునకు బదులు కూరలు, ఆకు కూరలు మొదలగు ఆహారమునకు మ్రొగ్గుట, పప్పుదినుసులు తగ్గించుట, ద్రవాహారము పెరుగుట సహజముగ జరుగును. ఉప్పు, కారములు కూడ తగ్గును. మసాలా దినుసుల ప్రసక్తియే యుండదు. పండ్లు, పండ్లరసము, నీరు ఆహారమున ఎక్కువభాగ మగును. ఇట్లు సహజముగనే దేహ ధాతువుల యందు కలిగిన మార్పువలన ఆహారమందు మార్పులు కలుగును. అపుడు శ్వాస అభ్యాసము మరింత చురుకుగ సాగును.

మనసు లగ్నము చేసి శ్వాసను నెమ్మదిగను, పూర్ణముగను పీల్చుట, వదలుట వలన మనసు ప్రశాంతత చెందుట, ప్రాణశక్తి పెంపొంది స్వస్థత చేకూరుట, ప్రాణము పూర్ణమై అస్వస్థతను దరిచేరనీయకుండుట, తత్కారణముగ ఆయుర్దాయము పెరుగుట, శరీర ధాతువులయందు చక్కని మార్పు జరిగి ఆహారము నియత మగుట జరుగునని తెలుపబడినది. శ్వాసను నెమ్మదిగను, పూర్ణముగను పీల్చుట, వదలుట ప్రతి శ్వాస యందు నిర్వర్తింపబడుట మూడవ నియమము. నెమ్మదిగను, పూర్ణముగను పీల్చుట, వదలుట మొదటి రెండు నియమములు.

మూడవ నియమము ప్రకారము ప్రతి శ్వాస దాని నెమ్మదితనము నందును, దీర్ఘత్వము నందును, పూర్ణత్వము నందును ఒకే విధముగ నుండవలెను. మొదటి శ్వాస ఎంత శ్రద్ధగ నిర్వర్తింపబడుచున్నదో, చివరి శ్వాసకూడ అంతే శ్రద్ధగ, అంతే నెమ్మదిగ, దీర్ఘముగ, పూర్ణముగ నిర్వర్తింపబడవలెను. ఈ మూడవ నియమముననే శ్వాస క్రమబద్ధమగును. క్రతుబద్ధ మగును.

సృష్టియందలి క్రమమే క్రతువు. ఆ క్రమము ననుసరించియే ఋషులు క్రతువులను దర్శించిరి. క్రతువు లన్నియు కాలబద్ధమై యుండును. కాలమే సృష్టియందు గల క్రమము. అవరోహణము, ఆరోహణము కాలము వలననే జరుగుచున్నది.

సృష్టి యందు కాలమే దైవము. కావున కాలము ననుసరించుచు చేయు శ్వాస క్రతుబద్దము కాగలదు. జీవితము క్రతుబద్ధము కావలెనన్నను, క్రమబద్ధము కావలెనన్నను కాలమును గౌరవించుట నేర్చుకొనవలెను. కాలము ననుసరించుట నేర్చుకొనవలెను. ప్రాణాయామ యజ్ఞమున పై తెలిపిన విధముగ శ్వాసను క్రమబద్ధము చేయుట యనగా ఒక శ్వాసకు ఎంతకాలము పట్టునో తరువాత శ్వాసలకు కూడ అంతే కాలము పట్టవలెను. ఇది నాలుగవ నియమము.

ప్రతిదినము సాధకుని సౌకర్యమును బట్టి ఒకే కాలమున ప్రాణాయామ హోమమును నిర్వర్తించుట ఐదవ నియమము. అనగా ప్రతిదినము అదే సమయమునకు నిర్వర్తించుకొనవలెను. శ్వాసల సంఖ్య క్రమముగ పెంచుకొనవచ్చును. ప్రతి మూడు శ్వాసలు ఒక విభాగముగ (యూనిట్) భావించుచు పెంచుకొన వలెను.

ఇట్లు తొమ్మిది విభాగములుగ ఇరువది ఏడు శ్వాసలు నిర్వర్తించుకొనుట ఒక శ్వాస విభాగముగ గుర్తించవలెను. క్రమముగ దీనిని మూడు రెట్లు పెంచుకొనవచ్చును. అనగా ఒకసారి శ్వాస ప్రక్రియను ప్రారంభించినప్పుడు కనీసము 3 x 9 = 27 శ్వాసలు నిర్వర్తించుకొనవలెను. అట్లు 27 X 3 = 81 శ్వాసల వరకును నిర్వర్తించుకొనవచ్చును. ఇచ్చట కాలమునకు శ్వాసలే కొలతగాని గడియారము కాదు.

ప్రాణాయామ పరాయణులు, ముందు తెలిపిన శ్వాస యజ్ఞమును దినమునకు మూడుసార్లు నిర్వర్తించుకొందురు. అట్టివారిని గూర్చి భగవానుడు 29వ శ్లోకమున తెలుపుచున్నాడు. ముందు తెలిపిన నియమము లన్నియు శ్రద్ధతో పాటించు వారికి ఆహార వ్యవహారాదులు నియతమగును. ఆహార విషయమున ఎంత పవిత్రత ఏర్పడునో విహార విషయముల యందు కూడ అంతే పవిత్రత ఏర్పడును. వీరి జీవితము ప్రపంచమున సాగు చున్నప్పటికిని, అందు మమేకమై యుండక, మైకములేక జీవింతురు. అవసరము లేనిచో కదలరు. దేహమును కదలింపరు.

అవసరము లేనిచో మాట్లాడరు. అవసరము లేనివి చూడరు, వినరు, స్పృశింపరు. ఇట్టివారికి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశములతోపాటు, పంచేంద్రియములు, పంచతన్మాత్రలు, పంచభూతములతో కూడిన లింగశరీరము కూడ పవిత్రమై పారదర్శకముగ నుండును. పై తెలిపిన నియమము లన్నియు యమునిచే నచికేతునకు తెలుపబడినట్లుగ కఠోపనిషత్ నందు తెలుపుదురు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


04 Dec 2020

No comments:

Post a Comment