శ్రీ శివ మహా పురాణము - 286


🌹 . శ్రీ శివ మహా పురాణము - 286 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

69. అధ్యాయము - 24

🌻. శ్రీరామునకు పరీక్ష - 2 🌻


నేను, విష్ణువు, సర్వదేవతలు, మహాత్ములగు మునులు, మరియు సనకాది సిద్ధులు సర్వదా ఆయనను సేవించెదము (18). నిత్యము ఆనందముతో ఆయన కీర్తిని గానము చేయు శేషుడు ఆ కీర్తియొక్క అంతమును చేరలేక పోయెను. కుమారా! ఆ శంకరప్రభువు మంగళముల నిచ్చును (19).

ఈ చిత్త భ్రాంతి అంతయూ ఆయన లీలవలననే సంప్రాప్తమైనది. దీని యందు ఎవ్వరి దోషము లేదు. సర్వవ్యాపకుడగు ఆయనయే సర్వమును ప్రేరేపించుచున్నాడు (20). సత్తారూపుడు, లీలాపండితుడు నగు ఆ రుద్రుడు ఒక సమయమునందు సతితో గూడి వృషభము నధిష్ఠించి ముల్లోకములలో పర్యటించుచూ భూలోకమును దర్శించెను (21).

సత్యమగు శపథము గల ఆ ప్రభువు సముద్రముపై ఆకసములో పర్యటించుచూ, దండకారణ్యమునకు వచ్చి అచటి సౌందర్యమును సతీదేవికి చూపించుచుండెను (22). రావణునిచే మోసముతో అపహరింపబడిన ప్రియురాలగు సీతకొరకు లక్ష్మణునితో గూడి అన్వేషించుచున్న రాముని ఈ శివుడు అచట చూచెను (23).

రాముడు 'హా సీతా!' అని బిగ్గరగా అరచుచూ, విరహముచే ఆవేశింపబడిన మనస్సు గలవాడై, ఇటునటు వెదకుచూ, అదే పనిగా ఏడ్చుచుండెను (24). రాముడు ఆమెను పొందవలననే కోరికతో, ఆమె వెళ్లిన మార్గము కొరకు లతలను, వృక్షములను ప్రశ్నించుచుండెను. ఆయన బుద్ధి నష్టమయ్యెను. ఆయన సిగ్గును వీడి శోకముచే విహ్వలుడై యుండెను (25).

సూర్యవంశములో పుట్టినవాడు, వీరుడు, రాజకుమారుడు, దశరథుని పుత్రుడు, భరతుని అన్న అగు రాముడు ఆనందమును గోల్పోయి, కాంతి విహీనుడై, ఉండెను (26). తల్లి కోరిన వరములకు అధీనుడై అడవిలో లక్ష్మణునితో కలిసి తిరుగాడు చున్న రామునికి విశాలహృదయము గలవాడు, పూర్ణకాముడునగు ఆ శివుడు ఆనందముతో నమస్కరించెను (27).

భక్తవత్సలుడగు శంకరుడు మరియొక్క స్థానమునకు వెళ్లుచూ అడవిలో రామునికి తన దర్శనమునిచ్చి 'జయ' అని పలికెను (28). మోహింపజేసే ఇట్టి శివలీలను చూచి, శివమాయచే విమోహితురాలైన సతీదేవి మిక్కిలి విస్మయమును పొంది శివునితో నిట్లనెను (29).

సతీదేవి ఇట్లు పలికెను -

ఓ దేవదేవా! పరబ్రహ్మా!సర్వేశ్వరా!పరమేశ్వరా! హరిబ్రహ్మాది దేవతలందరు సర్వదా నిన్ను సేవించెదరు (30). సర్వులచే సర్వదా నమస్కరింప , సేవించ, ధ్యానించ దగినవాడవు నీవే. మానవుడు నిర్వికారి, పరమాత్మ అగు నిన్ను ప్రయత్న పూర్వకముగా వేదాంతములనుండి యెరుంగ వలెను (31).

ఓ నాథా! విరహముచే దుఃఖితమైయున్న ఆకారము గలవారు, వనమందు దీనులై కష్టపడుతూ తిరుగుతున్నవారు, వీరులు, ధనుర్ధారులునగు ఈ పురుషులిద్దరు ఎవరు?(32).

వారిద్దరిలో నల్లకలువ వలె శ్యామ వర్ణము గల జ్యేష్ఠుని చూచి నీవు భక్తుని వలె ప్రసన్నుడవై సంతసించుటకు కారణమేమి?(33). ఓ శంకరస్వామీ! నీవు నా ఈ సంశయమును నివారింప దగుదువు. ఓ ప్రభూ! స్వామికి సేవకుడు ప్రణమిల్లుటయే యుక్తముగ నుండును గదా!(34).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆదిశక్తి, పరమేశ్వరి, శివుని అర్థాంగి అగు ఆ సతీదేవి శివుని మాయకు వశురాలై శివప్రభువును ఇట్లు ప్రశ్నించెను (35). పరమేశ్వరుడు, లీలాదక్షుడునగు శంకరుడు సతీదేవి యొక్క ఆ మాటను విని నవ్వి ఇట్లనెను (36).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


04 Dec 2020

No comments:

Post a Comment