భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 175



🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 175 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. మార్కండేయ మహర్షి - 1 🌻


1. వార్ధక్యం కోరుకోమని పెద్దలు అంటూంటారు. కన్ను, కాలు పనిచెయ్యకుండా ఉండేంత వార్ధక్యం కోరుకోమని – అంటే ఆయుర్ధాయం కోరుకోమని అంటారు. అది బాధే కావచ్చు! కానీ శరీరం జరాగ్రస్తమైనప్పటికీ మనోబుద్ధులు, ఏకాగ్రత ఈశ్వరుడియందు లగ్నం చేయగలిగిన దృష్టి కనుక ఉంటే, ఆ శరీరం వలన బాధపడరు.

2. అలా ఆ జన్మ సార్ధమవుతుంది. మరొక కారణం ఏమిటంటే – యౌవనంలో బలము, ఓపిక ఉన్నంత కాలము మనుష్యులలో పారమార్ధిక చింత కలగటంలేదు. అది వృద్ధాప్యం వచ్చిన తరువాతమాత్రమే కలుగుతున్నది.

3. ఈశ్వరుడి యందు భక్తి శ్రద్ధలు కలగటము మనిషికి వృద్ధాప్యము ప్రారంభమైన తరువాత మాత్రమే జరుగు తున్నది. మరి అలా కలిగినవెంటనే పోతే ఎలాగ! ఇక ఆ భక్తికి ఉపయోగమేమిటి? మరి తపస్సు ఎప్పుడు? అందుకనే, సుధీర్ఘమైన జర(వృద్ధాప్యం)ను కోరుకునే సంప్రదాయంకూడా ఒకటి ఉంది. అలా అడగమనికూడా చెప్తారు పెద్దలు. ఉత్తరదేశంలో ‘చిరాయురస్తు’ అని కాకుండా, ‘జరాయురస్తు’ అని ఆశీర్వదిస్తారు.

4. పూర్వం ఉత్తమజీవులకు, మృత్యుదేవత వాళ్ళకు బాగా తెలివిగా ఉండగానే ఒక పాశం వలె కనబడి తీసుకెళ్ళేదట. సావిత్రి చరిత్ర తరువాత మృత్యుదేవత జీవులకు కనబడటం మానేసిందట! చాలా చిక్కువచ్చింది మృత్యుదేవతకు! అంటే సావిత్రి చేతిలో మృత్యుదేవత ఓడిపొయినట్లే.

5. మార్కండేయుడు తన కంఠానికి మృత్యుపాశం తగలగానే ఈశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఆ లింగాన్ని ఆలింగనం చేసుకుని, తనను రక్షించమని శివుణ్ణి ప్రార్ధించాడు. సాధారణంగా శరణాగతి పొందినవారికి ఏ ఆపద వచ్చినా మామూలు వీరుడయిన క్షత్రియుడే సహించడు. సాక్షాత్తు రుద్రుడినే శరణు అంటే, తన సన్నిధిలోకి వచ్చిన యముణ్ణి సహిస్తాడా? వెంటనే త్రిశూలం పుచ్చుకుని, మృత్యువును చంపటానికే వచ్చాడు. శరణు అని ఆయన కాళ్ళమీద పడ్డాడు మృత్యుదేవత.

6. “నా భక్తుదయినవాడిని, సదా నన్ను స్మరించేవాడిని మృత్యుదేవతవైన నువ్వు ఎన్నడూ పాశబద్ధుణ్ణి చెయ్యటానికి వీలులేదు. శాశ్వతంగా ఇది నా శాసనంగా ఉంటుంది. మరణసమయంలో మృత్యువును జయిద్దామనే కోరికతో, బతకాలనే ఆశతో నన్ను స్మరణచేస్తున్నవాడిని నువ్వు ఏమీ చెయ్యకూడదు. శివస్మరణచేస్తూ, వెళ్ళిపోవడానికి సిద్దపడ్డవాళ్ళుమాత్రమే వెళ్ళిపోతారు” అని ఈశ్వరుడు ఈ విషయం మృత్యువుతో చెప్పాడు.

7. యోగులలో ప్రతీ మహాయోగి, తత్త్వం తెలిసిన తరువాత కూడా శరీరంలోంచి ఒక్కమాటు బయటకి వచ్చి మృత్యువువంటి స్థితిని అనుభవిస్తాడు. శరీరంలోంచి బయటకి రావటమూ తన శరీరాన్ని తను చూడటము, మళ్ళీ అందులోకి ప్రవేశించటము అనేవి చేసిన తరువాత అతడు చిరంజీవి అవుతాడు. తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే శరీరాన్ని వదిలిపెడతాడు. భారతభూమిలోని మహాయోగులలో ఇది ఒక విశిస్ట లక్షణంగా ఉన్నది! అందుకే వాళ్ళు స్వఛ్ఛంద మరణాన్ని పొందుతారు.

8. అంటే, గట్టిగా రాటకు పశువు కట్టబడితే ఎలా ఉంటుందో, అలాగ జీవాత్మ మూలాధారమందు కట్టబడి ఉంటుంది. దానిని ఒకమాటు వదిలించుకుని ఇవతలకు వచ్చి మళ్ళీ ప్రవేశిస్తే స్వేఛ్ఛగా ఉంటాడు. ఇంట్లో మనుష్యుడు తిరుగుతూ ఉన్నట్లు ఉంటాడు దేహంలో. అప్పుడిక ఆ జీవిడు పాశానికి కట్టుబడి ఉండడు. మృత్యంజయ మంత్రంలోకూడా ఈ విషయమే స్ఫురిస్తుంది.

9. ‘మృత్యోర్ముక్షీయ మామృతాత్’ – ‘మృత్యువునుంచీ విడిపించు. అమృతత్వంనుంచి కాదు’ అని అర్థంచేసుకోవాలి. అమృతత్వంనుండి వేరుచేయవద్దని; అంటే, అమృతత్వంలో ఉన్న ముడినికాక, మృత్యువులో ఉన్న ముడిని విప్పెయ్యమని అంటుంది ఆ మంత్రం.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


04 Dec 2020

No comments:

Post a Comment