గీతోపనిషత్తు -142 - 144


🌹. గీతోపనిషత్తు -142 - 144 🌹


✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 27


🍀 25. అంతర్ముఖుడు - బాహ్యమందలి స్పర్శాది విషయములను వెలుపలనే వదిలి ప్రాణాపానములను సమానము గావించి, చూపును అంతర్ముఖముగ నాసికాగ్రమున నిలిపి ముక్తుడై యుండుట తెలుపబడినది. ఇంద్రియముల అమరిక సృష్టింపక మునుపు జీవుడు అంతర్ముఖుడై, అంతరంగముననే యుండెడివాడు. ప్రచేతసులు అను ప్రజ్ఞల రూపమున యింద్రియ ప్రజ్ఞల నేర్పరచి, అంతః చేతనను బహిరంగముగ ప్రకటితము గావించుట జరిగినది. ఇంద్రియముల ద్వారా బాహ్యమున కలవాటుపడిన జీవులు, బాహ్యోన్ముఖులై అంతరంగమందలి స్వస్థానమును మరచిరి. మానవుని ప్రజ్ఞ అంతర్ముఖ మగుటకు ప్రధానమగు ఉపాయము శ్వాసను గమనించుట, శ్వాసపై మనసు లగ్నము చేయుట. శ్వాసమార్గము బహిర్ముఖమైన మనోప్రజ్ఞను అంతర్ముఖము చేయుటకు ఉపయోగపడును. శ్వాసపై మనసు నిలుపుట వలన శ్వాస ననుసరించుచు మనసు శ్వాస పుట్టుక స్థానమునకు పయనించును. 🍀


స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ।
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ।। 27 ।।


బాహ్యమందలి స్పర్శాది విషయములను వెలుపలనే వదిలి ప్రాణాపానములను సమానము గావించి, చూపును అంతర్ముఖముగ నాసికాగ్రమున నిలిపి ముక్తుడై యుండుట తెలుపబడినది.

శబ్ద స్పర్శాది. విషయము లన్నియు బాహ్య ప్రపంచ సంబంధితము. పంచేంద్రియముల మూలమున మానవుడు వీని ననుభవించు చున్నాడు. ఇంద్రియ సుఖము లన్నియు బాహ్య సుఖములే. పంచేంద్రియములే లేనిచో జీవునకు బాహ్యస్మృతి యుండదు. ఇంద్రియముల అమరిక సృష్టిలో ఒక ప్రధాన ఘట్టము. ఇంద్రియముల అమరిక సృష్టింపక మునుపు జీవుడు అంతర్ముఖుడై, అంతరంగముననే యుండెడివాడు.

ప్రచేతసులు అను ప్రజ్ఞల రూపమున యింద్రియ ప్రజ్ఞల నేర్పరచి, అంతః చేతనను బహిరంగముగ ప్రకటితము గావించుట జరిగినది. ఇంద్రియముల ద్వారా బాహ్యమున కలవాటుపడిన జీవులు, బాహ్యోన్ముఖులై అంతరంగమందలి స్వస్థానమును మరచిరి. ఇల్లు మరచి రాత్రింబవళ్లు పోకిరిగా తిరుగు పిల్లలను సంఘమున చూచుచున్నాము కదా! వారికి యిల్లు పట్టదు.

అట్లే సర్వ సామాన్య ముగ మానవులకు బహిరంగముననే జీవిత మంతయు గడిచి
పోవును. అంతరంగ అనుభూతి వారికి కలిగించుటయే ప్రధానోద్దేశ్యముగ యోగవిద్య ఏర్పడినది. మానవుని ప్రజ్ఞ అంతర్ముఖ మగుటకు ప్రధానమగు ఉపాయము శ్వాసను గమనించుట, శ్వాసపై మనసు లగ్నము చేయుట. శ్వాసమార్గము బహిర్ముఖమైన మనోప్రజ్ఞను అంతర్ముఖము చేయుటకు ఉపయోగపడును. శ్వాసపై మనసు నిలుపుట వలన శ్వాస ననుసరించుచు మనసు శ్వాస పుట్టుక స్థానమునకు పయనించును.


క్రమముగ మనసు స్పందన ప్రక్రియను చేరును. మనసు స్పందనమును గమనించుట యందు ఏకాగ్రత కలిగిన కొద్దీ, ప్రాణాపానములు సమన్వయింపబడి ఉదాన ప్రాణము ద్వారమున అంతరంగమున ఊర్ధ్వ ముఖమై జనును. భ్రూమధ్యమును చేరును. భ్రూమధ్యమును నాసికాగ్ర కేంద్రముగ కూడ తెలుపుదురు. అచ్చట అంతర్ముఖుడై చరించు చుండును. (ప్రాణాయామ యజ్ఞముగ దీనినే భగవంతుడు ముందు అధ్యాయ
ములలో బోధించినాడు.)

అచ్చట అంతర్జ్యాతిని దర్శించుచు, అంతరారాముడై, అంతః సుఖమును పొందుచు నుండువాడు సన్న్యాసియని 24వ శ్లోకమున తెలుపబడినది. అట్లు అంతర్ముఖముగ భ్రూమధ్యమునకు చేరుటకు ఉపాయమును దైవమీ శ్లోకమున ప్రతిపాదించినాడు.


సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


06 Feb 2021

No comments:

Post a Comment