రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
87. అధ్యాయము - 42
🌻. దక్షుని ఉద్ధారము -1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, దేవతలు, మునులు కలిసి అనునయించగా, పరమేశ్వరుడగు శంభుడు ప్రసన్నుడాయెను (1). కరుణా సముద్రుడగు పరమేశ్వరుడు విష్ణువు మొదలగు దేవతలను ఓదార్చి, చిరునవ్వు నవ్వి, గొప్ప అనుగ్రహమును ఇచ్చువాడై ఇట్లు పలికెను (2).
శ్రీ మహాదేవుడిట్లు పలికెను -
దేవశ్రేష్ఠులారా! మీరిద్దరు నా మాటను సావధానముగా వినుడు. వత్సలారా! మీకు నేను సత్యమును చెప్పెదను. మీరు చూపిన క్రోధమును నేను సర్వదా సహించితిని (3). బాలురు చేయు పాపములను నేను పరిగణించను. వారి బాల్యమును మాత్రమే పరిగణించెదను. వారు నా మాయచే పరాజితులై యుందురు గనుక, వారి యందు దండమును ప్రయోగించను (4). దక్షుని యజ్ఞమును ధ్వంసము చేసిన వాడను నేను కాదు. ఇతరుల అభివృద్ధిని ద్వేషించు వ్యక్తి తాను స్వయముగా భ్రష్ఠుడగును (5). కావున ఎప్పుడైననూ ఇతరులను నొప్పించే పనిని చేయరాదు. శిరస్సును కోల్పోయిన దక్షుడు మేక తలను పొందును గాక! (6).
భగదేవత మిత్రుని నేత్రముతో యజ్ఞభాగమును దర్శించగలడు. వత్సలారా! పూషన్ అను దేవతకు దంతములు పోయినవి గదా! ఆయన యజమానుని దంతములతో మెత్తని పిండి రూపములోనున్న యజ్ఞ భాగమును (7). భక్షించగలడు. నేను చెప్పు వచనము యథార్థము. నాపై విరోధమును బూనిన భృగువు మేక యొక్క గెడ్డమును పొందగలడు (8).
నా యందు విరోధమును ప్రదర్శించిన దేవతలు అందరూ తమ అవయవములను యథాపూర్వకముగా పొందగలరు. ఇతర ఋత్విక్కులు అశ్వినీ దేవతల బాహువులతో, పూషన్ యొక్క హస్తములతో యజ్ఞ కార్యములను (9) చక్కబెట్టగలరు. ఈ వ్యవస్థను మీ యందలి ప్రీతిచే నేను ప్రకటించితిని (10).
బ్రహ్మ ఇట్లు పలికెను -
దయానిధి, చరాచర జగత్ర్పభువు, ప్రకాశస్వరూపుడు, సర్వులపై సమ్రాట్, వేద మార్గానుయాయి అగు పరమేశ్వరుడిట్లు పలికి మిన్నకుండెను (11). అపుడు విష్ణువు, బ్రహ్మ, దేవతలు, ఇతరులు అందరు శంకరుని మాటలను విని సంతసించినవాహై'సాధు సాధు' అని పలికిరి (12).
అపుడు విష్ణువు, నేను, దేవతలు, ఋషులు కూడి శంభుని వెంటనిడుకొని మిక్కిలి ఆనందముతో మరల ఆ యజ్ఞవాటికకు వెళ్లితిమి (13). ఈ తీరున విష్ణువు మొదలగు దేవతలు ప్రార్థించగా శంభుడు దక్షప్రజాపతి యొక్క కనఖలమనే యజ్ఞ వాటిక వద్దకు వెళ్లెను (14).
వీరభద్రుడు ఆ యజ్ఞమును ధ్వంసము చేసి దేవతలను, ఋషులను పరాజితులను గావించిన తీరున అపుడు రుద్రుడు దర్శించెను (15). స్వాహా, స్వధా, పూషన్, తుష్టి, ధృతి, సరస్వతి, ఇతర ఋషులు, పితృదేవతలు, అగ్నులు (16),
ఇంతేగాక అక్కడకు వచ్చిన యక్ష గంధర్వ రాక్షసాదులు ఎంతోమంది అవయవములను గోల్పోయిరి. కొందరి కేశములు ఊడబెరుకబడెను. ఆ రణరంగములో మరికొందరు మరణించిరి (17). ఆ విధముగా నున్న యజ్ఞశాలను చూచి శంభువు గణాధ్యక్షుడు, మహావీరుడునగు వీరభద్రుని పిలిపించి, నవ్వుతూ ఆతనితో నిట్లనెను (18).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
06 Feb 2021
No comments:
Post a Comment