గీతోపనిషత్తు -158


🌹. గీతోపనిషత్తు -158 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 7

🍀 7 - 2. ఆత్మ తత్వము - జిజ్ఞాస ఎవరికుండునో అతడికే యోగవిద్య. యోగమునందు అవరోహణము, ఆరోహణము తెలుప బడినది. “నేను" అను ప్రజ్ఞ బుద్ధిలోనికి, మనస్సులోనికి (స్వభావములోనికి), యింద్రియముల లోనికి, శరీరములోనికి దిగి వచ్చుట అవరోహణము. మరల శరీరము యింద్రియము, మనస్సు దాటి బుద్ధిని చేరి అటుపై తానుగ నుండుట ఆరోహణము. మానవులు సహజముగ మనస్సు వరకు ఆరోహణము చేయగలరు. తమ స్వభావమును తాము దాటినపుడే బుద్ధిలోనికి ప్రవేశించుట జరుగును. ఈ శ్లోకమున 'జితాత్మనః' అను పదము ప్రారంభమున వాడబడినది. అనగా జయింపబడిన ఆత్మ అని అర్థము. ఇచ్చట స్వభావము పై జయమే చెప్పబడినది. 🍀

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |
శోతోష్ణ సుఖదు:ఖేషు తథా మానావమానయోః || 7

బుద్ధియందు ప్రవేశించినపుడు బుద్ధిమంతు డందురు. ఆలోచనల యందున్నపుడు ఆలోచనాపరు డందురు. ఆలోచనలు మనస్సు ద్వారా వచ్చు చుండును.

మనస్సు ప్రధానముగ జీవించు చున్నపుడు మానవుడందురు. అట్లే అహర్నిశలు యింద్రియ పరితృప్తికై, యింద్రి యార్థముల కొరకు శమించువానిని కాముకు డందురు. కేవలము శరీర శ్రమయే చేయగలుగుట అను స్థితియందున్నపుడు శ్రామికుడందురు. ఆయా కక్ష్యలలో ప్రవేశించినపుడు ఆయా నామములు వాడుచున్నాము. కాని యివి యేమియు తాను కాదు.

ఒక గృహస్థు యింటియందున్నపుడు యజమాని. భార్యతో నున్నపుడు భర్త. పిల్లలతో నున్నపుడు తండ్రి. తల్లిదండ్రులకు కుమారుడు. అన్నదమ్ములకు సోదరుడు. కార్యాలయమున కేగి నపుడు అధికారి, గుమస్తా, ప్యూను యిత్యాదిగ గుర్తింపబడును. స్నేహితులు స్నేహితుడుగ గుర్తింతురు. ఇన్నిటి యందు తా నెవరు? తాను యజమానియా? అన్ని సన్నివేశముల యందు తాను యజమాని కాదు గదా! అట్లే తాను భర్తయా? తండ్రియా? సోదరుడా? అధికారియా? స్నేహితుడా? ఇవి ఏవియు తాను కాడు.

సన్నివేశమును బట్టి యజమాని, భర్త, సోదరుడు యిత్యాదిగ తెలియ బడుచున్నాడు. నీ వెవరవు? పై తెలిపిన మానవుడవా? శ్రామికుడవా? యజమాని, భర్త, సోదరుడు యిత్యాది స్థితియా? ఇవి యేవియు కావని, అన్నియు ఆయా సందర్భమును బట్టి తాత్కాలిక సత్యము

లని తెలియును.

ఇవి కాక తా నెవరు? నీ వెవరవు అను ప్రశ్నకు, నేను అప్పారావు, సుబ్బారావు, సోమేశ్వరరావు అని తెలుపుచుందురు. అదికూడ నీవు పుట్టిన తరువాత పెట్టిన పేరేగాని, నీవు అంతకుముందు కూడ యున్నావు గదా! ఆ పేరు పెట్టకముందు నీ వెవరవు? "నే నున్నాను, నే నున్నాను" అనుచుందువే. నేనుండుట అనగా ఏమి? నీ వెట్లున్నావు? ఇత్యాది ప్రశ్నలకు సమాధానము తెలుసుకొనవలెనను జిజ్ఞాస ఎవరికుండునో అతడికే యోగవిద్య.

యోగమునందు అవరోహణము, ఆరోహణము తెలుప బడినది. “నేను" అను ప్రజ్ఞ బుద్ధిలోనికి, మనస్సులోనికి (స్వభావములోనికి), యింద్రియముల లోనికి, శరీరములోనికి దిగి వచ్చుట అవరోహణము.

మరల శరీరము యింద్రియము, మనస్సు దాటి బుద్ధిని చేరి అటుపై తానుగ నుండుట ఆరోహణము. మానవులు సహజముగ మనస్సు వరకు ఆరోహణము చేయగలరు. తమ స్వభావమును తాము దాటినపుడే బుద్ధిలోనికి ప్రవేశించుట జరుగును.

ఈ శ్లోకమున 'జితాత్మనః' అను పదము ప్రారంభమున వాడబడినది. అనగా జయింపబడిన ఆత్మ అని అర్థము. ఇచ్చట స్వభావము పై జయమే చెప్పబడినది.

తన స్వభావమును తాను జయించుటకు వలసిన సూత్రములన్నియు ముందు అధ్యాయములో తెలుపబడినవి. వాటిని పాటించినపుడు స్వభావము పై జయము కలుగును. అట్టివానికే ప్రశాంతి కలుగును. మనస్సులో నున్నపుడు అప్పడప్పుడు శాంతి కలుగవచ్చును. శాంతి వేరు, ప్రశాంతి వేరు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


26 Feb 2021

No comments:

Post a Comment