భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 240


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 240 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 4 🌻


24. పురుషోత్తముడు అని పరమేశ్వరుడికి పేరు. షడ్వింశతి తత్త్వమని సాంఖ్యదర్శనం చెప్పినదానిని – ప్రతి మహర్షీ చెప్పాడు. యోగము చెప్పని ఋషిలేడు. ఋషులందరూ చెప్పారు. అంటే, అది(ప్రకృతి) ఉన్నది కాబట్టి చెప్పారు.

25. ప్రకృతిని కాదని ఎవరనగలరు? ప్రకృతి పురుషుణ్ణి చూడదు. ఇక్కడ ప్రకృతి అంటే ఏమిటి? అహంకారం. జీవాహంకారం వరకూ ఉండే ప్రకృతి, పరుడైన పురుషుణ్ణి చూస్తుందా? ప్రకృతి ప్రకృతినే చూస్తుంది. ఆ లోపల అంతరాత్మలో ఉండే పరమపురుషుడు ప్రకృతిని చూస్తూ ఉంటాడు.

26. కానీ ఆ అంతరాత్మ యందుండేటటు వంటి పురుషుడు అని చెప్పబడే జీవి, ప్రకృతిని చూస్తున్నంత సేపూ తనను తాను చూచుకోదు. మోక్షము, ముక్తి అనే మాటకు అర్థం ఏమిటంటే, ఈ పురుషుడు యథార్థంగా నిస్సంగుడే! కాని అతడు, ప్రకృతిని చూచే స్థితిలో భోక్తవలె ఉండటంచేత, అన్నిటికీ అతీతమై నిరంజనుడైన వాడైనప్పటికీ, అతడు దీనిని చూచి దీని యందు శ్రద్ధ వహించి ఉండటంవలన, తనను తాను చూడటం మరచిపోయాడు. కాబట్టే బద్ధుడైపోయాడు. స్వస్వరూపజ్ఞానం తెలుసుకుని ముక్తుడు ప్రకృతినుంచి విడిపోవాలి.

27. ఇది అనిత్యమైనటువంటిది. నిత్యము, అనిత్యము కూడా కానిది. అనిత్యత్వము నిత్యంగా కలిగిన ప్రకృతి ఇది. క్షణక్షణమూ ప్రతీ వస్తువు కూడా ఉన్నట్లు కనిపించి నశించిపోతోంది. ఇటువంటి అనిత్యత్వం నిత్యంగా ఉంది. నిత్యమైన అనిత్యవస్తువుల యందు తాదాత్మ్యత పొందటం చేత, ఈతడు ఎప్పుడూ అనిత్యుడు అవుతూనే ఉన్నాడు. ఎప్పుడూ మరణం పాలు పడుతున్నాడు.

28. మృత్యువు వచ్చి, తాను అమర్త్యుడననే తన స్వస్వరూప స్తిథి జ్ఞాపకం రావటం లేదు. మృత్యువు లేనివాడు మృత్యువును అనుభవిస్తున్నాడు. దానియందు ఆత్మారోపణం. అది తనను ఏమీ చెయ్యటంలేదు. తానే దానిలో ప్రవేశించాడు.

29. సంగీతం పాడేవాడు, నాట్యం చేస్తున్నవాడూ మనను చూస్తున్నారా? మనం కదా వాళ్ళను చూస్తున్నాం! కాని, వాళ్ళు మనలో బుద్ధిపూర్వకంగా ప్రవేశిస్తున్నారా! ఎవరు ఎవరియందు తాదాత్మ్యత పొందారు అనేది ప్రశ్న. మనం ప్రకృతియందు తాదాత్మ్యతపొందినా, ప్రకృతి మనలో ప్రవేశించలేదు. ప్రవేశించజాలదు. దానికి ఇందులో ప్రవేశంలేదు. పురుషుణ్ణి ప్రకృతి చూడదు.

30. అలాగే ప్రకృతివిషయంలో తాదాత్మ్యత లేకుండా దానిని చూదవచ్చు. అందులో, ఇది ప్రకృతి, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది సుఖము, ఇది నిన్నటి దుఃఖము, ఇదే రేపు మళ్ళీ సుఖము – ఇలా దానిని విశ్లేషణ చేయవచ్చు. తాదాత్మ్యత పొందనక్కరలేదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


26 Feb 2021

No comments:

Post a Comment