స్వేచ్ఛకు దారులు తెలుసా?


🌹. స్వేచ్ఛకు దారులు తెలుసా? 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


ధార్మికుడు ఎప్పుడూ ధర్మాన్ని అనుసరించే ధార్మికుడుగా ఉంటాడే తప్ప, ఒక హిందువుగానో, క్రైస్తవునిగానో, మహమ్మదీయునిగానో, బౌద్ధునిగానో ఎప్పుడూ ఉండడు. అలాంటి అవసరం అతనికి ఎప్పుడూ ఉండదు. అతను ఎప్పుడూ చాలా నిజాయితీగా, హృదయ పూర్వకమైన చిత్తశుద్ధితో, కరుణామయుడుగా, చక్కని ప్రేమికుడుగా, పరిపూర్ణ మానవత్వంతో దాదాపు దైవానికి ప్రతినిధిగా ఉంటాడు.

‘‘ఎవరికీ తలవంచని వీరుడైన ధీరుడు ఎప్పుడూ సమాజానికి వ్యతిరేకంగా ప్రతిస్పందించడు. ఎందుకంటే, అతడు సామాజిక ఎత్తుగడలన్నింటినీ చక్కగా అర్థం చేసుకుంటాడు. పైగా, అవన్నీ అతనికి అనవసర విషయాలే. అందుకే అతడు వాటికి చిక్కడు, దొరకడు. అదే అతని సౌందర్యం. అదే అసలైన స్వేచ్ఛ.

విప్లవకారునికి ఎప్పుడూ స్వేచ్ఛ ఉండదు. ఎందుకంటే, వాడు ఎప్పుడూ ఏదో ఒక దానితో ప్రతిస్పందిస్తూ పోరాడుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి స్వేచ్ఛగా ఎలా ఉండగలడు? ప్రతిస్పందనలో స్వేచ్చ ఎలా ఉంటుంది?

స్వేచ్ఛ అంటే అవగాహన. ఎవరైనా ఎటువంటి మురికి అంటని ఆత్మతో బయటపడాలంటే తపనతో తన ఇష్టప్రకారం జీవిస్తున్నప్పుడు సమాజం ఏ రకంగా తన ఎత్తుగడలతో ఎదుగుతున్న ఆ ఆత్మను అడ్డుకుంటోందో, తననుతానుగా ఉండనివ్వడం లేదో అందరూ అవగాహన చేసుకోవాలి.

ప్రేమ, ద్వేషాల పేరుతో సమాజాన్ని పట్టుకుని వేళ్ళాడకుండా, సమాజం ఎలాఉన్నా ఏమాత్రం పట్టించుకోని ఎవరికీ తలవంచని ధీరుడు ఎవరినైనా క్షమించగలడు, ఆ విషయాన్ని అంతటితో మరచిపోగలడు.

ఎందుకంటే, అతని దృష్టిలో సమాజం అనేదే ఉండదు. అందుకే వాడు ఈ ప్రపంచంలో ఉన్నా లేనట్లుగానే జీవించగలడు. అవసరమైతే అందులోంచి బయటపడగలడు. ఎందుకంటే, వాడు ఎప్పుడూ ఈ ప్రపంచానికి చెందని పరాయివాడే.’’

మనిషి ఒక పద్ధతి ప్రకారం యాత్రికుడిలా దారిలో అసంపూర్ణంగా జన్మించాడే కానీ, సంపూర్ణంగా జన్మించలేదు.

అదే అతని దుఃఖం, అదే అతని పరమానందం కూడా. దుఃఖం ఎందుకంటే, అతను ఎప్పుడూ ఏదో ఆశిస్తూ, దానికోసం అనే్వషిస్తూ ముందుకువెళ్తూనే ఉంటాడు. లేకపోతే, అతనికి తోచదు. అందువల్ల అతను ఏమాత్రం విశ్రాంతి తీసుకోలేడు. అయినా అతను అలా చెయ్యక తప్పదు. అందుకే అతని తీరు అలా తయారైంది. అయితే ఆ తీరులోనే అతని అస్తిత్వం ఎదుగుతుంది కాబట్టి, అతను అన్వేషణ మానడు, మానలేడు.

పరిణామం చెందడం మనిషి సహజ గుణం. అదే మనిషి ఆత్మతత్వం. అయితే, తాము పరిపూర్ణంగా జన్మించిన గొప్పవారమని భావించేవారెవరూ ఏమాత్రం పరిణామం చెందకుండా అలాగే ఉండిపోతారు తప్ప ఏమీ చెయ్యలేరు.

ఎందుకంటే, ఆ స్థితిలో విత్తనం విత్తనంలాగే ఉంటుంది తప్ప, అది వృక్షమై ఎదిగి ఋతురాగాల వసంత శోభలో పరవశిస్తూ పరిమళాలు వెదజల్లే అనేక వేల పుష్పాలుగా పరిణమించ లేదు. నిజానికి, అలా పరిణమించడమే సంపూర్ణత్వం. అదే దివ్యత్వం.

మనిషిలో ఒక విత్తనంలా నిక్షిప్తమై ఉన్న శక్తి తన వాస్తవ రూపాన్ని పొందినప్పుడే మనిషి పరిపూర్ణుడైనట్లు. ఎందుకంటే, మనిషి ఒక శక్తిగా జన్మించాడు. అదే మనిషి ప్రత్యేకత. ఇతర జంతువులన్నీ సమగ్రంగా, సంపూర్ణంగా జన్మించాయి.

అందుకే అవి ఎలా జన్మించాయో అలాగే జీవించి మరణిస్తాయి తప్ప, వాటి జనన మరణాలమధ్య సమూలమైన మార్పు కానీ, పరివర్తన కానీ చోటుచేసుకోదు, ఎప్పటికీ ఎలాంటి పరిణామం జరగదు. అవి ఎప్పుడూ సమాంతరంగా సంచరిస్తాయే కానీ, నిలువుగా వెళ్ళాలనుకోవు.

ఒకవేళ మనిషి కూడా జంతువులా సమాంతరంగా సంచరిస్తే, అతడు తన మానవత్వాన్ని కోల్పోతాడు. అందువల్ల అతడు ఒక ఆత్మగా ఎప్పటికీ మారడు.

గుర్జియఫ్ ‘‘అందరికీ ఆత్మలుండవు’’ అనడంలోని అంతరార్థం అదే. ఒక వ్యక్తికి ఆత్మ ఉండడమనేది చాలా అరుదైన ఘటన. ఇది చాలా వింతగా అనిపించే విషయమే. ఎందుకంటే, యుగయుగాలుగా ‘మీరు ఆత్మతో జన్మించారు’ అని మీకు బోధించడం జరిగింది.

‘‘మీరు ఆత్మగా పరిణమించగల శక్తితో జన్మించారే తప్ప, అసలైన ఆత్మతో జన్మించలేదు’’అంటాడు గుర్జియఫ్. మీకొక నమూనా ఉంది. అది పని చెయ్యాలి కదా!

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


26 Feb 2021

No comments:

Post a Comment