శ్రీ శివ మహా పురాణము - 358
🌹 . శ్రీ శివ మహా పురాణము - 358 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
93. అధ్యాయము - 05
🌻. మేనాదేవి వరములను పొందుట - 1 🌻
నారదుడిట్లు పలికెను -
దుర్గాదేవి అంతర్థానమై, దేవగణములు తమ గృహములకు వెళ్లిన తరువాత ఏమయ్యెను?(1) మేనా హిమవంతులు తీవ్రమగు తపస్సును చేసిన తీరు ఎట్టిది ? తండ్రీ! ఆయనకు మేన యందు కుమార్తె ఎట్లు జన్మించెను? ఆ వృత్తాంతమును చెప్పుము (2).
బ్రహ్మఇట్లు పలికెను-
ఓ బ్రాహ్మణ పుంగవా! దేవశ్రేష్ఠా! ఆ గొప్ప చరితమును వినుము. భక్తిని పెంపొందించే ఆ చరితమును శంకరునకు భక్తితో నమస్కరించి చెప్పెదను (3). కుమారా! విష్ణువు మొదలగు దేవతల గణము ఉపదేశించి వెళ్లిన తరువాత ఆ పర్వతరాజు, మేనతో కలిసి గొప్ప తపస్సును చేసెను (4).
ఆ దంపతులు రాత్రింబగళ్లు ఉమాశంకరులను స్మరిస్తూ. భక్తితో నిండిన మనస్సుతో ప్రతిదినము చక్కగా ఆరాధించిరి(5). హిమవంతుని ప్రియురాలగు ఆ మేన ప్రీతితో దేవిని పూజించెను. శివుని కూడ మిక్కిలి ప్రీతితో పూజించెను. మరియు శివా శివుల సంతోషము కొరకై ఆమె నిత్యము బ్రాహ్మణులకు దానములను చేసెను (6).
సంతానమును గోరు ఆ మేన చైత్ర మాసము నందారంభించి ఇరవై ఏడు సంవత్సరములు ప్రతి దినము శ్రద్ధతో ఉమాదేవిని ఆరాధించెను (7). ఆమె అష్టమినాడు ఉపవాసమును చేసి, మరునాడు నవమి యందు గానములను చేసెను. ఆమె ఓషది ప్రస్థనగరములో గంగా తీరము నందు మట్టితో ఉమయొక్క మూర్తిని చేసి, మోదకములు, అన్న పిండములు, పాయసము, గంధము పుష్పములు ఇత్యాది అనేక పూజాద్రవ్యములను సమర్పించి ఆరాధించెను (8,9). ఆమె ఒకప్పుడు ఆహారమును తీసుకోకుండా, మరియొకప్పుడు వ్రతమును పాలించునదై, మరియొకప్పుడు గాలిని భుజించి, ఒకప్పుడు జలమును మాత్రమే త్రాగి ఆరాధించెను (10).
గొప్ప తేజశ్శాలిని యగు ఆ మేన ఉమపై మనస్సును లగ్నము చేసి, ఇరవై ఏడు సంవత్సరములు ప్రీతితో గడిపెను (11). జగత్స్వరూపిణి, జగన్మాత, శంకరపత్ని యగు ఉమ ఇరవై ఏడు సంవత్సరముల తరువాత మిక్కిలి ప్రీతురాలాయెను (12).
పరమేశ్వరి యగు ఆ దేవి ఆమె గొప్ప భక్తికి మిక్కిలి సంతసించి ఆమెను అను గ్రహించుట కొరకై ఆ మేనా దేవి యెదుట సాక్షాత్కరించెను (13). ప్రకాశించే అవయవములతో గూడి తేజో మండల మధ్యములో నున్న ఆ దేవి మేన యెదుట ప్రత్యక్షమై చిరునవ్వుతో నిట్లనెను (14).
దేవి ఇట్లు పలికెను -
ఓ మహాసాధ్వీ! నీ మనసులోని కోర్కెను వెల్లడించుము. ఓ హిమవత్పత్నీ! నీ తపస్సుచే నేను చాల ప్రసన్నురాలనైతిని (15). ఓమేనా! నీవు దేనిని గొరి తపస్సును, వ్రతములను, సమాధిని అనుష్ఠించితివో ఆ సర్వమును నేను నీకు ఈయగలను (16). అపుడా మేనక తన ఎదుట ప్రత్యక్షమైన కాళీదేవిని చూచి, నమస్కరించి, అపుడిట్లనెను (17).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
26 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment