🌹గురువు అపార కరుణాసముద్రుడు 🌹

🌹గురువు అపార కరుణాసముద్రుడు 🌹

అయోమయావస్థలో ఉన్న వారి బుద్ధి పరిధిలో బోధించాలంటే గురువు అపార కరుణాసముద్రుడు కావాలి. ఇట్టి అర్హతలు కల గురువే సద్గురువు.

కనుక
1) అచంచలమైన ఆత్మానుభవం
2) ప్రేమపూరిత హృదయం

ఇవి గలవాడే సద్గురువుగా పరిగణింపబడతాడు.

శిష్యుల యొక్క సందేహాలను తీర్చి వారికి సరియైన జ్ఞానాన్ని అందించాలంటే గురువుకు అవసరం అయిన శాస్త్ర పాండిత్యం ఉండాలి, అంతేగాదు. అతడు బుద్ధి కుశలత కలిగినవాడై ఉండాలి.

ఎప్పుడు - ఏ స్థితిలో ఉన్న శిష్యునికి ఎట్టి జ్ఞానాన్ని అందించాలో - ఎట్టి ఉపదేశం చేయాలో తెలివిగలిగి ఉండాలి. శిష్యునికి అర్థమైన భాషలో చెప్పగలిగే భాషాసౌష్ఠవం ఉండాలి. దీనితో పాటు ఆత్మానుభవం లేకపోతే చెప్పిన మాటలన్నీ ఓటికుండ మ్రోతలే అవుతాయి. కొందరు పూర్తి ఆత్మానుభవంలో ఉంటారు.

మౌనంగా తమ గుహలలో కూర్చొని ఆనందంలో ఉంటారు. తమ అనుభవాన్ని సాధకులకు తెలియజేసే భాష వారి వద్దలేదు. వారి స్థాయి నుండి దిగివచ్చి శిష్యుల బుద్ధి స్థాయిలో బోధించలేరు. వర్ణనాతీతమైన అనుభవాన్ని వర్ణించలేరు. ఇట్టివారి వల్ల సాధకులకు ప్రయోజనం లేదు. అందుకే శాస్త్ర పాండిత్యం - అనుభవం రెండూ ఉండాలి - అట్టివానినే 'దేశికం' - పండితుడు - ఆచార్యుడు అని సంబోధిస్తున్నారిక్కడ.

అట్టి గురువును శిష్యుడు - 'సముపేత్య' - సమీపించాలి. ఉపేత్య అనక 'సముపేత్య' అంటున్నారు. గురువును సమీపించే విధానం కూడా ఎంతో ముఖ్యమైనది అని ఈ పదం యొక్క ఆంతర్యం.

గురువు ఎంత గొప్ప వాడైనప్పటికీ శిష్యునిలో మానసిక పరిపక్వత - బుద్ధి కుశలత అల్ప విషయాలకు ప్రాధాన్యతనివ్వని గుణం మొదలైన అర్హతలుంటేనే ప్రయోజనం. గురువు చెప్పిన వాక్యాలు అర్థం కాకపోతే శిష్యునిలో ఉత్సాహం, ఉత్తేజం ఉండదు. జ్ఞానం కలగదు. అందుకే 'సముపేత్య' అని శిష్యుడు ఎలా గురుసన్నిధిలో ప్రవేశించాలో చెబుతున్నారు.

(i) తాను తెలుసుకోబోయే జ్ఞానం యొక్క విలువ ఏమిటో తెలుసుకున్నవాడై, నేర్చుకోవాలనే ఆతృత గలవాడై యుండాలి.

(ii) గురువుపట్ల అత్యంత భక్తి శ్రద్ధ వినయము విధేయత ఆరాధనా భావం ఉండాలి. గౌరవం చూపాలి.

కొందరు గురువులవద్ద మహాత్ములవద్ద తమ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. గురువును పరీక్షించాలనే భావంతో తమకు తెలిసిన విషయాలనే తెలియనట్లు అడుగుతారు. కొందరు ఉబుసుపోకకు అడుగుతారు. కొందరు గురువుకు తామెంతో దగ్గర వారైనట్లు, హడావుడి చేస్తుంటారు. ఫోజులు ఇస్తుంటారు. కొందరు భయంతో తమ సందేహాలను దాచుకుంటారు. ఇవేవీ సరైన పద్ధతులు కావు.

గురువును ఎలా సమీపించాలో, ఎలా ప్రశ్నించాలో ఆధ్యాత్మిక రంగంలో ఒక అతి ప్రధానమైన విషయం, అందుకే భగవద్గీత (4-34) లో "తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా" 'ఉపదేక్ష్యంతి' - అంటూ సాష్టాంగ నమస్కారం చేస్తూ తమ అహంకారాన్ని వదలి వినయంతో గురువును సేవించి - పాదాలొత్తి అనుకూల సమయంలో; తెలుసుకోవాలనే కాంక్షతో తెలుసుకోవాలి - అని చెప్పారు.

అణకువగా ఉండటం వల్లనే అహంకారం తగ్గిపోతుంది. అహంకారం తగ్గితే అర్హత వచ్చినట్లే. కనుకనే గురువు మీద గౌరవం, ప్రేమ, జ్ఞానాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞతా భావం, విశ్వాసం, ఆయన పాండిత్యం పట్ల ఆరాధనా భావం ఉండాలని శాస్త్రం నిర్దేశించి చెబుతున్నది

అలా గురువును ఆశ్రయించినప్పుడు తగిన ఉపదేశం చేస్తాడు, జ్ఞానాన్ని బోధిస్తాడు, సాధనలెలా చేయాలో తెలియజెబుతాడు. గురువు కేవలం సూచనలు చేయగలడేగాని ఆ సూచనలను గ్రహించి ఆచరణలో పెట్టుకోవాల్సిన వాడు శిష్యుడే.

సేకరణ : శ్రీ ఆదిశంకరాచార్యులవారి 'వివేకచూడామణి'

🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

No comments:

Post a Comment