🌹 భగవంతుడు సర్వకారణ కారణము🌹

🌹 భగవంతుడు సర్వకారణ కారణము🌹
✍ మాస్టర్ ఇ.కె

🌸 శ్రీమద్భాగవతము 🌸

జీవుడు కోపము మరియు అభిమానము తొలగించుకొనవలెను. కోపము‌ తొలగించు కొనుటయనగా కోపమును ఆపుట కాదు. సంతుష్టిని అలవరచుకొనుట.

జీవుని యొక్క ఈశ్వరుని యొక్క యథార్థ జ్ఞానము గ్రహింపవలెను. జీవుడు తత్త్వము చేత ఈశ్వరుడే అని తెలియవలెను. ఒక గృహము కట్టినపుడు గదులలో చోటుండును. ఆ చోటు వంటివాడు జీవుడు. ఆరుబయలు లాంటి వాడు దేవుడు. ఇల్లు కట్టక ముందు గదులలో ఉన్న చోటు కూడ ఆరు బయలులోని చోటే. కట్టిన తరువాత కూడ దాని అఖండత్వము, పవిత్రత్వము చెడలేదని ఊహింపవచ్చును. గదిలో దుర్వాసన యున్నను, అది చోటునకు అంటదు. అట్లే జీవుడు కూడ ఈశ్వరుడే అని తెలియవలెను.

ఈ తెలివి వలన బుద్ధి ఇంద్రియముల వైపునకు మనస్సుగా ప్రసరించుట మాని, తన వైపునకు మరలి, తానుగా ఉండును. బుద్ధి యందలి సంకల్ప వికల్పములు మొదలగు స్థితులన్నియు కరగి, తానుగా ఉండును. కరుగక ముందు సంకల్పములు ఘనీభవించి యుండును. అవియే తన నమ్మకములు. ఈ నమ్మకములు అన్నియు కరిగి ఒకే నమ్మకముగా ఉండవలెను. అదియే భగవంతుడు. పాత్రలోని మంచుగడ్డలన్నియు కరగినచో ఒకే జలముగా ఉండును‌కదా!

జీవుడు పరమాత్మయని తెలిసిన వెనుక పరమాత్మనే అన్నిటియందును సూటిగా దర్శించును. కంటికి సూర్యుడు ఎంత స్పష్టముగా ప్రత్యక్షమగుచున్నాడో అట్లే వానికి దేవుడును. ఈ సాధనతో ఆత్మలకు నాయకుడైన శ్రీమన్నారాయణుని దర్శించును. అపుడు తన యందు అహంకారమునకు తావుండదు. అది అసత్యమగును.

సత్యమైన దేవుని వెలుగుచే అసత్యము మాయమగును. ఈ దృష్టితో చూచినవానికి సృష్టి మొత్తమునకు కారణముండదు. అందలి సన్నివేశములకు కూడా కారణములేదని తెలియును. కార్య కారణములవలె కనిపించుచున్నవి అన్నియు ఒక దాని యందు భాగములై దర్శనమిచ్చును.

స్థూల దృష్టితో చూసినచో మనము అన్నము తినుటకు కారణము బియ్యము మొదలగునవి. నిమిత్తకారణము బియ్యపు కొట్టువాడు, వండిపెట్టు భార్య మొదలగు వారు. ఇంకను విశదపరచుకొన్నచో ధాన్యము పండించు రైతు నిమిత్తకారణము. అంతకు ముందు వరి మొక్క యున్నది. దానికి కారణము విత్తనము. దానికి కారణము వరి మొక్క. ఈ రెండిటి పరస్పరత్వమునకు కారణము బీజాంకుర పరిపాక ప్రకృతి.

ప్రకృతికి కారణము యోగమాయ. దానికి కారణము భగవంతుడు. భగవంతుడు సర్వకారణ కారణము. వాని యందు లోకములోని కార్యకారణములన్నియును అంతర్భాగములై ఒకే వెలుగుగా దర్శనమిచ్చును.

ఈ వివరము తెలియుట వలన జీవి పరిపూర్ణుడై సర్వవ్యాపియై పరబ్రహ్మమును పొందును.......

🌹 🌹 🌹 🌹 🌹
🙏  ప్రసాద్

No comments:

Post a Comment