🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 13 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃. యోగి లక్షణములు 🍃
40. బ్రహ్మ జ్ఞాని అయిన యోగి భౌతిక సాధనలు, పూజ సామాగ్రిని వాడడు. తాంత్రిక సాధనలు చేయడు. దేవతారాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడు.
41. ఆసనములు, ప్రాణాయామము, భూచరి, ఖేచరి, సాంభవి ముద్రలను అభ్యసించడు.
42. యోగి అయిన వాడు ఇడ, పింగళ, సుషుమ్న, నాడుల మార్గములు అన్వేషించడు.
43. ఆత్మ నిగ్రహమునకు, ఇంద్రియ నిగ్రహమునకు అతీతముగా యోగి వుండును.
44. సకామ, నిష్కామ కర్మలకు అతీతుడుగా ఉండును. ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడై ఆత్మానందుడై ఉండును.
45. బ్రహ్మ జ్ఞాని అయిన యోగి తాను మనస్సు, బుద్ధి, శరీరము, ఇంద్రియములు, అహంకారము పంచతన్మాత్రలు పంచభూతములు కాదని తెలిసియుండును.
46. శాస్త్ర జ్ఞానములందు, శుద్ధ అశుద్ధులందు అతీతుడుగా ఉంటూ కేవలం ఆత్మ యందే రమించి ఉండును.
47. యోగి శరీరపరముగా ఏ స్థితిలో మరణించినను, ఎచ్చట మరణించినను, తాను పరమాత్మ యందే ఐక్యమైయుండును.
48. యోగులు భౌతికముగా చతుర్విద ధర్మములను ఆచరిస్తూ ప్రేమ, వైరాగ్యములను అలవర్చుకుని నిర్గుణుగా యుండును.
49. యోగికి వేదాధ్యయనము, దీక్షలు, విగ్రహారాధనతో పనిలేదు.
50. యోగి సదా బ్రహ్మ భావనలో లీనమై ఉండుటచే అంత్య కాలమందు కూడా అదే నిష్ఠ కల్గి పునర్జన్మ పొందడు.
51. యోగి సంకల్ప రహితుడు, జన్మ రహితుడు అగుటచే అతనికి పిత్రుయానము, దేవయానము లుండవు.
52. యోగి జీవన్ముక్తుడగుటచే మానసికముగా అంతరముగా పవిత్రుడై ఉండును.
53. యోగి కర్మలను నిష్కామముగా ఆచరించుటచే, అతడు కర్మలను చేసినను త్యజించినవాడే అగును.
54. యోగి జ్ఞానికంటెను, తపస్వుల కంటెను పండితులకంటెను, శ్రేష్ఠుడు. నిరంతర కృషి, ధ్యానాభ్యాసము, కఠోర సాధన వలన యోగి అగుచున్నాడు.
55. యోగులలో మహా యోగియైనవాడు పంచ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములను, మనసును నిగ్రహించి భగవంతుని యందు వాటిని ఐక్యము చేయు నేర్పరియైయుండును.
56. యోగియైన వాడు విషయ, వస్తు, శబ్ధ, భోగ రాహిత్యముతో సాధన యందు అనాసక్తుడై వుండి కర్మలను కూడా అనాసక్తితో ఆచరించును. అపుడు కర్మ అంటదు.
57. యోగికి యోగాభ్యాస కాలములో అనారోగ్యము, భోగాదులపై ఆసక్తి, ఇతర వ్యక్తిగత, బాహ్యకారణముల వలన యోగాభ్యాసమునకు భంగము కలిగినపుడు అతడు యోగభ్రష్టుడగు చున్నాడు.
58. యోగభ్రష్టుడు మరణానంతరము పుణ్యలోకములు పొంది, తిరిగి శ్రీమంతుల సదాచారపరుల ఇండ్లలో జన్మించి జ్ఞానియై మరల యోగాభ్యాసము కొనసాగించి చివరికి ముక్తుడగును. గత జన్మ సంస్కారములు ఇతనికి తోడ్పడును. అందువలన యోగి ముక్తి నందువరకు యోగిగానే జీవించి ఉండును.
🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment